Skip to main content

జీవశాస్త్ర పరిచయం

జీవశాస్త్రం (బయాలజీ) అనే పదం బయోస్ (జీవం), లాగస్ (అధ్యయనం) అనే గ్రీకు పదాల నుంచి ఉద్భవించింది. అరిస్టాటిల్ (క్రీ.పూ. 384-322) అనేక జీవశాస్త్ర ప్రాథమిక భావనలు ఇచ్చారు. అందువల్ల ఆయనను ‘జీవశాస్త్ర పితామహుడు’ అంటారు.
  • జీవశాస్త్రంలో రెండు విభాగాలుంటాయి.
    1. జంతు శాస్త్రం (జువాలజీ - జోవన్ అంటే జంతువు, లాగోస్ అంటే అధ్యయనం)
    2. వృక్షశాస్త్రం (బోటనీ - బొటానె అనే మాటకు మొక్క అని అర్థం)
  • మొక్కలు స్వయం పోషకాలు. అంటే తమ ఆహారాన్ని తామే తయారుచేసుకుంటాయి. కిరణజన్య సంయోగక్రియలో సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డై ఆక్సైడ్, నీరు కల వడం వల్ల పిండిపదార్థం లేదా కార్బో హైడ్రేట్ ఏర్పడుతుంది. ఈ చర్యకు అవసరమైన క్లోరోఫిల్ (పత్రహరితం) మొక్కల్లో ఉంటుంది. శిలీంద్రాల్లో పత్రహరితం ఉండదు. అవి సేంద్రియ పదార్థాలపై ఆధారపడి జీవిస్తాయి.
  • జంతువులు ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. అందువల్ల వీటిని పరపోషకాలు (Heterotrophs) అంటారు.
  • కుళ్లుతున్న సేంద్రియ పదార్థాలపై ఆధారపడే జీవులు ‘పూతికాహారులు (Saprophytes)’ ఇవి కళేబరాలపై ఆధారపడి జీవిస్తాయి.
  • ఆహారం లేదా ఆవాసం లేదా రెండింటి కోసం ఇతర జీవుల శరీరాన్ని అంటిపెట్టుకునే జీవులను ‘పరాన్నజీవులు’ అంటారు.
    అతిథేయి శరీరం బయటకు అంటి పెట్టుకునేవి బాహ్య పరాన్నజీవులు
    ఉదా: జలగ.
    అతిథేయి లోపలి భాగాల్లో నివసించేవి అంతర పరాన్న జీవులు
    ఉదా: ఆస్కారిస్ (ఏలికపాము)
  • సహజీవనంలో రెండు రకాల జీవులు పరస్పర సహకారం అందించుకుంటాయి.
పోషణ:
  • జీవుల ప్రధాన లక్షణం జీవనక్రియలు జరుపుకోవడం. ఈ క్రియల్లో జీర్ణక్రియ ఒకటి. శక్తి కోసం జీర్ణక్రియ అవసరం.
  • ఏకకణ జీవులైన ప్రాథమిక జీవుల్లో జీర్ణవ్యవస్థ ప్రత్యేకంగా అభివృద్ధి చెంది ఉండదు.
  • ఏకకణ జీవుల్లో కణాంతర జీర్ణక్రియ ఉంటుంది.
కణం: జీవి ప్రాథమిక ప్రమాణం కణం. దీన్ని రాబర్‌‌ట హుక్ గుర్తించాడు. కణజాలం: ఒకే విధమైన నిర్మాణం కల్గి, ఒకే పనిని నిర్వర్తించే కణాల సమూహాన్ని కణజాలం అంటారు. భిన్న కణజాలాలు కలిసి అవయవం ఏర్పడుతుంది. వ్యవస్థ: భిన్న అవయవాలు కలిసి ఒకే పనిని నిర్వర్తిస్తే దాన్ని ‘అవయవ వ్యవస్థ’ అంటారు. జీవి శరీరంలో జీర్ణ, శ్వాస, విసర్జన, ప్రత్యుత్పత్తి, నాడీ, రక్తప్రసరణ, అంతస్రావ వ్యవస్థలుంటాయి. జంతువులను రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి: 1. వెన్నెముక లేని జీవులు 2. వెన్నెముక ఉన్న జీవులు వెన్నెముక లేని జీవులను 9 వర్గాలుగా విభజించారు.
  • ప్రోటోజోవా: ప్రోటో అంటే ప్రాథమిక, జోవన్ అంటే జంతువులు అని అర్థం.
  • పొరిఫెరా: పొరి అంటే పోరస్ (రంధ్రాలు ఉన్న), ఫెరిన్ అంటే కల్గి ఉండేవి అని అర్థం. రంధ్రాలు కల్గిన జీవులు.
    ఉదా: స్పంజికలు
  • సీలెంటరేటా: ఆయికులాస్ ఎంటిరాన్ పదాల కలయికతో సీలెంటరేటా వచ్చింది. ఆయికులాస్ అంటే గొట్టం, ఎంటిరాన్ ఆహారనాళం అని అర్థం. వీటిలో గొట్టం లాంటి ఆహారనాళం ఉంటుంది. ఇవి ద్విస్తరిత (డిప్లోబ్లాస్టిక్) జీవులు.
    ఉదా: హైడ్రా
  • ప్లాటీ హెల్మింథిస్: ఫ్లాట్ అంటే బల్లపరుపు, హెల్మింథ్‌‌స అంటే పురుగులు అని అర్థం. ఇవి బల్లపరుపు శరీర నిర్మాణం కల్గిన జీవులు. ఇవి పరాన్నజీవులు.
    ఉదా: టీనియా సోలియం (బద్దెపురుగులు)
  • నిమాటి హెల్మింథిస్: ఇవి గుండ్రటి పురుగులు. ఎక్కువగా పరాన్నజీవులు.
    ఉదా: ఏలిక పాము (ఆస్కారిస్)
  • అనెలిడా: అక్యులస్ అంటే వలయాకార ఖండితాలు అని అర్థం. ఈ జీవుల్లో ఇలాంటి అవయవ వ్యవస్థలుంటాయి. సీలోం (శరీర కుహరం) ఉంటుంది.
    ఉదా: వానపాము, జలగ.
  • ఆర్థ్రోపొడా: ఆర్థ్రాస్ అంటే కీళ్లు కలిగిన పోడియం - కాళ్లు. కీళ్లు కల్గిన (ఖండితాలున్న) కాళ్లు ఉండటం వీటి లక్షణం. బాహ్య అస్థిపంజరం కల్గిన కీట కాలుంటాయి.
    ఉదా: బొద్దింక, ఈగ, దోమ.
  • మొలస్కా: మెత్తని శరీరం కల్గినది అని అర్థం. దీంట్లో కర్పరాలుంటాయి.
    ఉదా: ఆల్చిప్ప, నత్త.
  • ఇఖైనోడెర్మేటా: ఇఖినస్ అంటే ముళ్లు, డర్మా అంటే చర్మం. చర్మంపై ముళ్లు కల్గిన జీవులు అని అర్థం.
    ఉదా: సముద్ర నక్షత్రం.
వెన్నెముక ఉన్న జీవులు: వీటిని నాలుగా రకాలుగా విభజించారు.
  • చేపలు: జలచరాలు. శీతల రక్త జీవులు (పరిసర ఉష్ణోగ్రత మారినప్పుడు రక్తం ఉష్ణోగ్రత మారుతూ ఉంటుంది). వీటిలో రెండుగదుల గుండె ఉంటుంది. ఇవి చాలా వరకు అండోత్పాదకాలు.
  • ఆంఫిబియా (ఉభయచరాలు): నేలపైనా, నీటిలోనూ నివసిస్తాయి. ఇవి కూడా శీతల రక్తజీవులు. 3 గదుల గుండె ఉంటుంది. ఇవి అండోత్పాదకాలు.
  • సరీసృపాలు: ఇవి నేలపై పాకే జీవులు. శీతల రక్తజీవులు. 3 గదుల గుండె (2 కర్ణికలు, అసంపూర్తిగా విభజితమైన జఠరిక) ఉంటుంది. ఇవి అండోత్పదకాలు.
    ఉదా: పాము, బల్లి, మొసలి.
  • పక్షులు: ఉష్ణరక్త జీవులు. అంటే రక్తం ఉష్ణోగ్రత పరిసర ఉష్ణోగ్రతలో మారకుండా స్థిరంగా ఉంటుంది. 4 గదుల గుండె ఉంటుంది. ఇవి ఈకలు కల్గిన జీవులు, అండోత్పదకాలు.
  • క్షీరదాలు: పాలిచ్చే శిశుత్పాదకాలు. నాలుగు గదుల గుండె ఉంటుంది. ఉష్ణరక్త జంతువులు.
    ఉదా: ఆవు, మేక, కుక్క, మానవుడు.
  • ఎగిరే పక్షుల శరీరం పడవ ఆకారంలో ఉంటుంది. వీటి ఎముకలు గుల్లగా ఉంటాయి. వీటిలో వాయుసంచులు ఉంటాయి.
  • బయాలజీ అనే పదాన్ని కనుగొన్నది ‘లామార్‌‌క’.
  • సరీసృపాల్లోని గుండె గదుల సంఖ్య ‘మూడు’. కానీ మొసలిలో నాలుగు గదుల గుండె ఉంటుంది.
మాదిరి ప్రశ్నలు
  1. బయాలజీ అనే పదానికి సంబంధించి కిందివాటిలో సరైన జత ఏది?
    1) గ్రీకు - అరిస్టాటిల్
    2) గ్రీకు - లామార్‌‌క
    3) ఫ్రెంచ్ - లామార్‌‌క
    4) ఏదీకాదు
  2. ‘జీవశాస్త్ర పితామహుడు’ అని ఎవరిని పేర్కొంటారు?
    1) లామార్‌‌క
    2) థియోప్రాస్టస్
    3) అరిస్టాటిల్
    4) ప్లేటో
  3. బొటానె అనే మాటకు అర్థం?
    1) విత్తనం
    2) వేరు
    3) మొక్క
    4) ఫలం
  4. కిందివాటిలో ఏ గ్రీకు పదానికి జంతువు అనే అర్థం ఉంది?
    1) బొటానె
    2) జోవన్
    3) లాగస్
    4) బయోస్
  5. బయోస్, లాగస్ అనే పదాల నుంచి బయా లజీ ఉద్భవించింది. కిందివాటిలో వీటి అర్థాలు వరుసగా..
    1) అధ్యయనం, మొక్కలు
    2) జంతువులు, శాస్త్రం
    3) మొక్కలు, జంతువులు
    4) జీవం, అధ్యయనం
  6. మొక్కలు, జంతువుల పోషణకు సంబం ధించి కిందివాటిలో సరైన ప్రవచనం?
    1) మొక్కలు పరాన్నజీవులు, జంతువులు పరపోషకాలు
    2)జంతువులు పరపోషకాలు, మొక్కలు స్వయం పోషకాలు
    3) మొక్కలు పూతికాహారులు, జంతు వులు పరాన్నజీవులు
    4) జంతువులు పరపోషకాలు, మొక్కలు పరపోషకాలు
  7. జలగ ఏ రకానికి చెందిన జీవి?
    1) పూతికాహార జీవి
    2) అంతర పరాన్న జీవి
    3) స్వయంపోషకం
    4) బాహ్య పరాన్న జీవి
  8. ఏ రకమైన జీవులు కుళ్లుతున్న సేంద్రియ పదార్థాలపై ఆధారపడి జీవిస్తాయి?
    1) పరాన్నజీవులు
    2) పూతికాహారులు
    3) సహభోజకులు
    4) పరపోషకాలు
  9. ప్రోటోజోవా వర్గానికి చెందిన ఏకకణ జీవుల్లో ఈ రకానికి చెందిన జీర్ణక్రియ జరుగుతుంది?
    1) కణబాహ్య జీర్ణక్రియ
    2) అసంపూర్ణ జీర్ణక్రియ
    3) కణాంతర జీర్ణక్రియ
    4) ఎక్స్‌ట్రా కార్పోరియర్ జీర్ణక్రియ
  10. ఏలికపాము, బద్దెపురుగు, స్పంజికలు వరుసగా ఏ వర్గాలకు చెందుతాయి?
    1) ప్లాటిహెల్మింథిస్, నిమాటి హెల్మింథిస్, పొరిఫెరా
    2) నిమాటి హెల్మింథిస్, ప్లాటిహెల్మింథిస్, మొలస్కా
    3) ప్లాటిహెల్మింథిస్, ఇఖైనోడెర్మేటా, ప్రోటోజోవా
    4) నిమాటి హెల్మింథిస్, ప్లాటిహెల్మిం థిస్, పొరిఫెరా
  11. ఆల్చిప్ప ఏ వర్గానికి సరైన ఉదాహరణ?
    1) మొలస్కా
    2) ఇఖైనోడెర్మేటా
    3) పొరిఫెరా
    4) అనెలిడా
  12. ఇఖైనోడెర్మేటా జీవుల ప్రధాన లక్షణం?
    1) రంధ్రాలు కల్గి ఉండటం
    2) శరీరత్వచం రెండు పొరలతో ఉండటం
    3) శరీరంపై ముళ్లు ఉండటం
    4) ఖండితాలు కల్గిన కాళ్లు ఉండటం
  13. కిందివాటిలో సరైన ప్రవచనం ఏది?
    1) అమీబా బహుకణ జీవి
    2) హైడ్రా ద్విస్తరిత జీవి
    3) బొద్దింక అనెలిడా వర్గానికి చెందింది
    4) బద్దెపురుగు పరాన్నజీవి కాదు
సమాధానాలు
1) 2 2) 3 3) 3 4) 2 5) 4 6) 2 7) 4
8) 2 9) 3 10) 4 11) 1 12) 3 13) 2.
Published date : 18 Dec 2014 04:14PM

Photo Stories