Skip to main content

త్వర‌లో రైల్వే ఉద్యోగాల‌కు ప‌రీక్షలు.. స‌మాచారం ఇదిగో..!

భారతదేశ ఆర్థిక ప్రగతిలో ఇండియన్‌ రైల్వే ప్రధాన పాత్ర పోషిస్తోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాలతో అనుసంధానమైన రైల్వేలు.. దేశ రవాణా రంగానికి వెన్నుముకగా చెప్పొచ్చు.

దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులతో ప్రపంచంలో అత్యధిక ఉద్యోగులు గల విభాగంగా భారతీయ రైల్వే చరిత్ర సృష్టించింది. రైల్వేలో ఇప్పటికే విడుదలైన ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీ, ఆర్‌ఆర్‌బీ గ్రూప్‌–డి నోటిఫికేషన్‌లకు త్వరలో పరీక్షలు జరుగనున్నాయి. దాంతోపాటు వివిధ స్థాయిల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌లు విడుదల చేసే అవకాశముందనే వార్తల నేపథ్యంలో.. రైల్వేలో వివిధ ఉద్యోగాలు, అర్హతలు, ఎంపిక విధానం గురించి తెలుసుకుందాం...

సకల సౌకర్యాలు..

ప్రపంచంలో అతిపెద్ద రవాణా వ్యవస్థగా గుర్తింపు పొందిన భారతీయ రైల్వే.. దేశవ్యాప్తంగా 17 జోన్లు, 73 సబ్‌ డివిజన్లతో విస్తరించి ఉంది. ఇందులో లక్షల మంది పనిచేస్తున్నారు. రైల్వేలో ఏటా వేల సంఖ్యలో నియామకాలు జరుగుతాయి. పదో తరగతి నుంచి డిగ్రీ, ఇంజనీరింగ్‌ అభ్యర్థులకు వారి అర్హతలకు తగ్గ కొలువులు దక్కించుకునే అవకాశం ఉంది. రైల్వేలో ఉద్యోగం సాధిస్తే.. వారికి చక్కటి వేతనంతోపాటు నివాసానికి క్వార్టర్స్, రవాణా, విద్య, వైద్యం, సబ్సిడీ క్యాంటీన్‌ వంటి అనేక సౌకర్యాలు పొందే వీలుంటుంది. అందుకే రైల్వేలో ఉద్యోగం సాధించాలని చాలామంది నిరుద్యోగులు కోరుకుంటారు.

నాలుగు గ్రూప్‌లుగా విభ‌జ‌న..

  1. ఇండియన్‌ రైల్వే ఉద్యోగాలను ‘టెక్నికల్, నాన్‌ టెక్నికల్‌’గా విభజిస్తారు. వీటిని తిరిగి నాలుగు (గ్రూప్‌–ఏ/బీ/సీ/డీ)గా గ్రూపులుగా పేర్కొంటారు. వీటిలో గ్రూప్‌–ఏ/బీ విభాగాల్లోకి ఉన్నతాధికారిక కేడర్‌ పోస్టులు వస్తాయి. మెడికల్, ఇంజనీరింగ్‌ విభాగాల అధికారులు గ్రూప్‌–ఏ/బీ క్యాడర్‌లోకి వస్తారు.
  2. గ్రూప్‌–ఏ పరీక్షలను యూనియన్‌ సర్వీస్‌ పబ్లిక్‌ కమిషన్‌ నిర్వహిస్తుంది.
  3. గ్రూప్‌– బీ పోస్టులు సాధారణంగా పదోన్నతుల ద్వారా భర్తీ అవుతాయి.
  4. గ్రూప్‌–సీ విభాగంలోకి సబార్డినేట్‌ స్టాఫ్‌ వస్తారు. ఇందులో సూపర్‌వైజర్స్, క్లర్క్స్, స్కిల్డ్‌ లేబర్‌ వంటి సిబ్బంది ఉంటారు.
  5. గ్రూప్‌–డీలో నైపుణ్యం అవసరం లేని సిబ్బంది ఉంటారు. గ్రూప్‌–íసీ/డీ పరీక్షలను రైల్వే రిక్రూట్‌మెంట్‌ కంట్రోల్‌ బోర్డు నిర్వహిస్తుంది.

అర్హతలు..

  1. ఇండియన్‌ రైల్వే ట్రాఫిక్‌ సర్వీస్, ఇండియన్‌ రైల్వేస్‌ పర్సనల్‌ సర్వీస్, ఇండియన్‌ రైల్వేస్‌ అకౌంట్‌ సర్వీస్, రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌(ఆర్‌పీఎఫ్‌) పోస్టులు; సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, సిగ్నల్‌ ఇంజనీర్స్, మెడికల్‌ సర్వీస్‌ గ్రూప్‌–ఏ విభాగంలోకి వస్తాయి. ఈ పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేస్తుంది. సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్,ఎంబీబీఎస్, నాన్‌ టెక్నికల్‌ పోస్టులకు బ్యాచిలర్‌ డిగ్రీ ఉండాలి. ఈ పోస్టులకు గరిష్ట వయోపరిమితి 32ఏళ్లు. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీలకు సడలింపు ఉంటుంది.
  2. గ్రూప్‌–బీ పోస్టుల నియామకాలను నేరుగా చేపట్టరు. ఈ పోస్టులను గ్రూప్‌–సీలోని నాన్‌ మినిస్టీరియల్‌ ఉద్యోగులకు డిపార్ట్‌మెంటల్‌ టెస్టులు నిర్వహించి. గెజిటెడ్‌ హోదాలతో పదోన్నతి కల్పిస్తారు.
  3. గ్రూప్‌–సీ పోస్టులకు సంబంధించి పదో తరగతి, ఐటీఐ, తత్సమాన అర్హతలతో అసిస్టెంట్‌ లోకో పైలట్, టెక్నీషియన్‌ గ్రేడ్‌–3 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  4. 10+2 లేదా ఇంటర్మీడియెట్‌ అర్హతతో టికెట్‌ కలెక్టర్, గ్రాడ్యుయేషన్‌తో గూడ్స్‌ గార్డ్‌ లేదా అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌కు పోస్టులకు పోటీ పడొచ్చు. గరిష్ట వయోపరిమితి ఆయా పోస్టులను బట్టి మారుతుంది.
  5. గ్రూప్‌–డీ విభాగంలో పోర్టర్లు, గేట్‌మెన్‌, ట్రాక్‌మెన్‌ తదితర ఉద్యోగాలు ఉంటాయి. ఈ పోస్టులకు పదో తరగతి, ఐటీఐ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లు ఇలా..

భారతీయ రైల్వేలో గ్రూప్‌–ఏ(క్లాస్‌1) పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ)ఏటా ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా భర్తీ ప్రక్రియ కొనసాగుతుంది. గ్రూప్‌–íసీ(క్లాస్‌ 3), గ్రూప్‌–డీ(క్లాస్‌ 4) పోస్టులకు దేశంలో ఉన్న 21 రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు(ఆర్‌ఆర్‌బీ).. తమ పరిధిలోని పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసి.. ఎంపిక ప్రక్రియ చేపడతాయి.

Published date : 23 Oct 2020 04:14PM

Photo Stories