EdCET Result 2023: ఎడ్‌సెట్‌లో అ‘ద్వితీయం’
ఎడ్‌సెట్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఏయూ నిర్వహించిన ఈ పరీక్షలో నాతవరం మండలం లింగంపేటకు చెందిన దత్తసాయి బయాలజీలో, చోడవరం పట్టణ శివారు రేవళ్లుకు చెందిన మనోజ్ఞ త్రిభువని గణితంలో రాష్ట్ర స్థాయిలో రెండవ ర్యాంకులు సాధించారు. దత్తసాయి టీచర్‌గా, మనోజ్ఞ సివిల్స్ సాధనే లక్ష్యంగా సాక్షికి తెలిపారు.
నాతవరం: ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసిన ఎడ్‌సెట్ ఫలితాల్లో మండలానికి చెందిన పోలుపర్తి దత్తసాయి జీవశాస్త్రం(బయాలజీ)లో 92 మార్కులతో రాష్ట్ర స్ధాయిలో రెండవ ర్యాంకు సాధించాడు. నాతవరం మండలంలో మారుమూల ప్రాంతమైన లింగంపేట గ్రామానికి చెందిన దత్తసాయి గుంటూరు నాగార్జునసాగర్ ఏపీఆర్‌జేసీలో ఇంటర్, విశాఖలోని వీఎస్ కృష్ణా కళాశాలలోడిగ్రీ చదివాడు. దత్తసాయిది వ్యవసాయ కుటుంబం. ఇటీవల నిర్వహించిన ఎడ్‌సెట్‌లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించడంపట్ల తల్లిదండ్రులు రాము, సుబ్బలక్ష్మి, కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడటం తన ఆశగా దత్తసాయి తెలిపాడు.
AP PGCET 2023: పీజీ సెట్‌లో మెరిశారు
సివిల్స్ సాధనే లక్ష్యం
చోడవరం రూరల్: ‘నా ఆశ, ధ్యాస సివిల్స్‌లో సత్తా చాటడమే. ఎడ్‌సెట్‌లో రాష్ట్ర స్థాయి ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు, అక్కయ్య ఇచ్చిన సలహాలు సూచనలు ఎంతగానో ఉపకరించాయి. వారి అండదండలతో తప్పక సివిల్స్‌లో మంచి ర్యాంకు సాధించగలనని నమ్ముతున్నా’.. అంటూ ఏయూ నిర్వహించిన ఎడ్‌సెట్‌లో గణితం మెథడాలజీ విభాగంలో 95 మార్కులతో రాష్ట్రంలో రెండో ర్యాంక్ సాధించిన ఓరుగంటి మనోజ్ఞ త్రిభువని తన సంతోషాన్ని వెల్లడించింది. మనోజ్ఞ తండ్రి ఓరుగంటి సీతబాబు మండలంలోని లక్కవరం హైస్కూల్లో గ్రేడ్–2 హెచ్‌ఎంగా, తల్లి పద్మజ జుత్తాడ హైస్కూల్లో గణితం స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. వీరు చోడవరం పట్టణ శివారు రేవళ్లు గ్రామంలో నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కుమార్తెకు ఫిజిక్స్ మెథడాలజీలో 216వ ర్యాంకు వచ్చింది. సివిల్స్ కోసం హైదరాబాద్‌లో శిక్షణ పొందుతున్న మనోజ్ఞ తన ఆనందాన్ని ఫోన్‌లో సాక్షితో పంచుకుంది.