AP PGCET 2023: పీజీ సెట్‌లో మెరిశారు
- ఎంఈడీలో రామకృష్ణకు మొదటి ర్యాంక్
- కంప్యూటర్ సైన్స్‌లో అనిల్‌కు రెండో ర్యాంక్
నక్కపల్లి: ఆంధ్రాయూనివర్సిటీ నిర్వహించిన ఏపీ పీజీసెట్ ఫలితాల్లో జిల్లా అభ్యర్థులు ప్రతిభ కనబరిచారు. ఏయూ శుక్రవారం విడుదలచేసిన పీజీ సెట్(ఎడ్యుకేషన్) ప్రవేశ పరీక్షలో నక్కపల్లి మండలం దోసలపాడుకు చెందిన బవిరి శెట్టి రామకృష్ణకు మొదటి ర్యాంకు లభించింది. రామకృష్ణది నిరుపేద కుటుంబం. తండ్రి ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ ఏడేళ్ల క్రితం పాముకాటుకు గురై మరణించాడు. తల్లికూడా చిన్నతనంలోనే చనిపోయింది. సోదరుడే తల్లితండ్రీ అయి చదివించాడు. విద్యాభ్యాసమంతా ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే గడిచింది. ఏయూ నుంచి బీఈడీ పూర్తి చేశాడు. తాజా ఫలితాల్లో ఎంఈడీలో 100కు 84 మార్కులతో మొదటి ర్యాంకు సాధించడంతో గ్రామస్తులు అభినందించారు. ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడి ఉత్తమ విద్యాబోధన అందించాలన్నది తన ఆకాంక్షగా తెలిపాడు.
కంప్యూటర్ సైన్స్‌లో 2వ ర్యాంక్
కె.కోటపాడు : ఏపీపీజీసెట్‌లో మండలంలోని చౌడువాడకు చెందిన భీశెట్టి అనిల్ కుమార్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో రెండో ర్యాంక్ సాధించాడు. తండ్రి రామకోటి గ్రామంలో వెల్డర్‌గా పని చేస్తూ కుమారుడిని చదివిస్తున్నాడు. అనిల్ ఇంటి వద్దనే ఉంటూ పీజీ సెట్‌కు ప్రిపేర్ అయ్యాడు. ఏయూలో ఎంసీఏ లేదా ఎమ్మెస్సీ పూర్తి చేసి, సాఫ్ట్‌వేర్ రంగంలో స్థిరపడటమే తన లక్ష్యమని తెలిపాడు.