Skip to main content

యూపీఎస్సీ సివిల్స్-2018కి అనుసరించాల్సిన వ్యూహాలు..

ఫిబ్రవరి మొదట్లో సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్‌కు నోటిఫికేషన్ విడుదల కానుంది. ఆ తర్వాత పరీక్షకు లభించే సమయం 4 నెలలు. సివిల్స్‌లో తొలి మెట్టును విజయవంతంగా దాటాలంటే ఇప్పటి నుంచి అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సివిల్స్-2018 ఔత్సాహికులు అనుసరించాల్సిన మార్గాలపై ఫోకస్..
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్.. ఓ సుదీర్ఘ ఎంపిక ప్రక్రియ. దాదాపు ఏడాదిన్నరపాటు సాగే మూడంచెల ఎంపిక ప్రక్రియలో విజయానికి మూడు, నాలుగేళ్ల పాటు కృషిచేస్తున్న అభ్యర్థులు కనిపిస్తుంటారు. అయితే కొత్తగా సివిల్స్‌కు సిద్ధమవుతున్నవారు వారిని చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు నిపుణులు, గత విజేతలు. స్పష్టమైన ప్రణాళికతో ముందడుగు వేసి, విజయాన్ని అందుకోవాలని వారు సూచిస్తున్నారు.
  1. వ్యక్తిగత సామర్థ్యంపై అంచనా..
    బలాలు, బలహీనతలు: సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు ముందుగా తమ వ్యక్తిగత సామర్థ్యంపై స్పష్టమైన అవగాహన ఏర్పరచుకోవాలి. అకడమిక్‌గా తమకున్న నైపుణ్యాలు, బలాలు, బలహీనతలు, సివిల్స్ ప్రిపరేషన్ పరంగా అనుసరించాల్సిన టైం మేనేజ్‌మెంట్ తదితర అంశాలపై స్పష్టత ఏర్పరచుకోవాలి.

    ఆత్మవిశ్వాసంతో..: వ్యక్తిగత స్థామర్థ్యంపై ఆత్మవిశ్వాసం లభించాక ప్రిపరేషన్‌కు సిద్ధమవాలి. పరీక్ష విధానానికి సంబంధించి సిలబస్‌లోని అంశాలు, వాటిపై పట్టు సాధించేందుకు అందుబాటులో ఉన్న వనరుల (మెటీరియల్, ఇతర సదుపాయాలు)ను సేకరించుకోవాలి.

    ఆప్షనల్‌పై అవగాహన: ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌కు సిద్ధమయ్యే ముందు మెయిన్స్‌లో ఎంపిక చేసుకోవాల్సిన ఆప్షనల్‌పై స్పష్టత ఏర్పరచుకోవాలి. ఎందుకంటే కొన్ని ఆప్షనల్ పేపర్ల (పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, సోషియాలజీ)లో ప్రిలిమ్స్, మెయిన్స్ ఉమ్మడి ప్రిపరేషన్‌కు వీలుంటుంది.

    శిక్షణపై నిర్ణయం..
    సివిల్స్ ఔత్సాహికులు గుర్తించాల్సిన మరో ముఖ్య విషయం.. శిక్షణ. ఇప్పటికే తమ వ్యక్తిగత సామర్థ్య స్థాయిపై స్పష్టత ఏర్పరచుకున్న అభ్యర్థులు.. శిక్షణ తీసుకోవాలా.. వద్దా? అని దానిపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలి. వాస్తవానికి శిక్షణ అనేది గెడైన్స్ టూల్ మాత్రమే అని.. అది అభ్యర్థులు సరైన మార్గంలో పయనించేలా చేయడానికి మాత్రమే ఉపకరిస్తుందని, విజయాన్ని శాసించేది మాత్రం అభ్యర్థిలోని నిజమైన సామర్థ్యమేనని శిక్షణ నిపుణులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని కోచింగ్‌పై నిర్ణయం తీసుకోవాలి.

  2. ప్రిపరేషన్ సన్నాహాలు...
    ప్రాథమికంగా వ్యక్తిగత సామర్థ్యాలపై అవగాహన, స్పష్టత ఏర్పరచుకున్న అభ్యర్థులు.. ఇక తదుపరి దశలో పరీక్ష ప్రిపరేషన్ విషయంపై దృష్టి సారించాలి. ఈ క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలు..

    సిలబస్ పరిశీలన...
    సివిల్స్ లక్ష్యాన్ని బలంగా నిర్దేశించుకున్న అభ్యర్థులు ముందుగా సిలబస్‌ను పూర్తిస్థాయిలో పరిశీలించాలి. ఆపై తమకు అను కూలంగా, ప్రతికూలంగా ఉన్న అంశాలు/ పేపర్లతో వేర్వేరుగా జాబితాలను రూపొందిం చుకోవాలి. ప్రతి కూలంగా భావిస్తున్న అంశాలపై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. సదరు పేపర్/సబ్జెక్టులో రాణించేందుకు అవసరమైన, అందుబాటులో ఉన్న సెల్ఫ్ లెర్నింగ్ టూల్స్‌ను ఉపయోగించుకోవాలి. ప్రస్తుత ఇంటర్నెట్ యుగంలో ప్రతీ అంశానికి సంబంధించిన సమాచారం ఒక్క క్లిక్‌తో కళ్ల ముందు ప్రత్యక్షమవుతోంది.

    గత పరీక్షల విశ్లేషణ :
    ప్రిపరేషన్ కోణంలో అభ్యర్థులు తదుపరి దశలో అనుసరించాల్సిన విధానం.. గత ప్రశ్నపత్రాల విశ్లేషణ. కనీసం నాలుగైదు ప్రీవియస్ కొశ్చన్ పేపర్లను పరిశీలించాలి. దీని ఆధారంగా పరీక్షల్లో వస్తున్న ప్రశ్నల తీరు, ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీ తదితర అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. దీనికి అనుగుణంగా ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన అంశాలపైనా అవగాహన లభిస్తుంది.

    మెటీరియల్ సేకరణ: పేపర్లు/సబ్జెక్టులకు సంబంధించి ప్రామాణిక మెటీరియల్‌ను సేకరించుకోవాలి. ఒక్కో సబ్జెక్టుకు కనీసం రెండు పుస్తకాలు చదివే విధంగా ప్రణాళిక రూపొందించుకోవాలి.

  3. ప్రిపరేషన్ తీరు..
    ప్రిపరేషన్‌కు అనువైన వాతావరణం ఏర్పడ్డాక అభ్యర్థులు పూర్తిస్థాయి ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. ఈ క్రమంలో అనుసరించాల్సిన వ్యూహాలు..

    సమన్వయ పూర్వక ప్రిపరేషన్ : తొలుత సిలబస్‌లోని అంశాలను పరిశీలించి.. అంతర్గత సంబంధం (ఇంటర్ రిలేటెడ్) కలిగిన అంశాలు, సబ్జెక్టులను గుర్తించాలి. తర్వాత దశలో ఆయా అంశాలను సమన్వయం చేసుకుంటూ ప్రిపరేషన్ కొనసాగించాలి. ముఖ్యంగా జాగ్రఫీ-ఎకానమీ, పాలిటీ- ఎకానమీ, కరెంట్ అఫైర్స్-ఎకానమీ, పాలిటీ అంశాల్లో సమన్వయ పూర్వక ప్రిపరేషన్ విధానం అభ్యర్థులకు చక్కగా ఉపయోగపడుతుంది. దీంతో సమయం ఆదా అవడంతోపాటు ఒకేసారి రెండు సబ్జెక్టుల ప్రిపరేషన్ పూర్తి చేయొచ్చు.

    కరెంట్ అఫైర్స్‌‘కీలకం’ :
    ఇటీవల ప్రిలిమ్స్ ప్రశ్నపత్రాలను పరిశీలిస్తే కరెంట్ అఫైర్స్ ప్రాధాన్యం పెరిగినట్లు అర్థమవుతుంది. దీన్ని దృష్టి లో పెట్టుకుని అభ్యర్థులు రోజూ కరెంట్ అఫైర్స్‌కు సమ యం కేటాయించాలి. కరెంట్ అఫైర్స్‌ను బాగా అధ్యయనం చేస్తే ఇతర సబ్జెక్టుల పరంగానూ ప్రయోజనం ఉంటుంది.

    విశ్లేషణాత్మకంగా..
    ప్రిలిమ్స్‌ను ఆబ్జెక్టివ్ విధానంలోనే నిర్వహిస్తున్నప్పటికీ.. అభ్యర్థులు మాత్రం విశ్లేషణాత్మక దృక్పథంతో ప్రిపరేషన్ కొనసాగించాలి. ఇలా చేసినప్పుడే మెయిన్స్‌లో రాణించేందుకు అవసరమైన డిస్క్రిప్టివ్ అప్రోచ్ అలవడుతుంది. ఒక సబ్జెక్టులను చదివేటప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటూ చదవడం చాలా కీలకం. ఇందులో భాగంగా చదువుతున్న సబ్జెక్టులోని ముఖ్యాంశాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. ఇది రివిజన్ సమయంలో ఉపయోగపడుతుంది.

    ప్రిలిమ్స్ + మెయిన్స్ :
    ప్రస్తుత సివిల్స్ సిలబస్ ప్రకారం 70 శాతం అంశాలు ప్రిలిమ్స్, మెయిన్స్ రెండిటిలో (ఉమ్మడిగా)ఉన్నాయి. వీటిని ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సమయంలోనే విశ్లేషణాత్మక దృక్పథంతో చదివితే.. ప్రిలిమ్స్ దశలోనే మెయిన్స్‌కు సైతం సన్నద్ధత లభిస్తుంది. అయితే ప్రిలిమ్స్‌కు నెల రోజుల ముందు నుంచి పూర్తిగా ప్రిలిమ్స్‌కు ఉపయోగపడేలా రివిజన్‌పై దృష్టిసారించాలి.

సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష విధానం..

పేపర్

సబ్జెక్టు

ప్రశ్నలు

మార్కులు

పేపర్-1

జనరల్ స్టడీస్

100

200

పేపర్-2

ఆప్టిట్యూడ్ టెస్ట్

80

200

మొత్తం

180

400


ఒక్కో పేపర్‌కు లభించే సమయం: 2 గంటలు

కనీస అర్హత: పేపర్-2లో 33 శాతం మార్కులతో ఉత్తీర్ణత; పేపర్-1 కనీస అర్హత మార్కులను యూపీఎస్సీ నిర్దేశిస్తుంది. వీటి ఆధారంగా అభ్యర్థులను మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. తుది ఫలితాల్లో మాత్రం ఈ మార్కులను పరిగణనలోకి తీసుకోరు.

రిఫరెన్స్ :
  1. మోడ్రన్ ఇండియన్ హిస్టరీ- బిపిన్ చంద్ర
  2. ఇండియాస్ స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్ - బిపిన్ చంద్ర
  3. ఇండియా కల్చర్ - స్పెక్ట్రమ్
  4. ఇండియన్ జాగ్రఫీ - మాజిద్ హుస్సేన్
  5. ఇండియన్ పాలిటీ - లక్ష్మీకాంత్
  6. ఇండియన్ ఎకానమీ - రమేశ్ సింగ్
  7. ఇండియా ఇయర్ బుక్
  8. ఎకనామిక్ సర్వే
  9. అనలిటికల్ రీజనింగ్- ఎం.కె.పాండే
  10. వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్ - ఆర్.ఎస్.అగర్వాల్

సివిల్స్ ప్రిలిమ్స్-2018 షెడ్యూల్..
నోటిఫికేషన్ విడుదల: ఫిబ్రవరి 7, 2018.
దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 6, 2018.
ప్రిలిమ్స్-2018 పరీక్ష తేదీ: జూన్ 3, 2018.

శాస్త్రీయ దృక్పథంతో వ్యవహరించాలి
సివిల్స్ ఔత్సాహికులు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ప్రారంభించినా ప్రిలిమ్స్‌లో విజయం సాధించొచ్చు. అయితే దానికి శాస్త్రీయ దృక్పథం (సైంటిఫిక్ అప్రోచ్) అవసరం. అంటే.. ఏయే అంశాలు చదవాలి? ఎలా చదవాలి? అనే ప్రశ్నల కోణంలో ఒక క్రమ పద్ధతిలో స్పష్టతతో వ్యవహరించాలి. అభ్యర్థులు.. తమకు పట్టున్న, ఆసక్తి ఉన్న అంశాలను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవాలి. అలాకాకుండా డిగ్రీలో చదివిన సబ్జెక్టులనే ఎంపిక చేసుకుందామనే ధోరణి సరికాదు.
- వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ


ఆత్మవిశ్వాసం అండతో...
సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులు ముందుగా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. లక్షల మంది పోటీలో రాణించగలమా? అనే సందేహంతో మొదలయ్యే అనవసర ఆందో ళన కారణంగా ప్రతిభ ఉన్నప్పటికీ స్వయంగా విజయావ కాశాలను చేజార్చుకునే ప్రమాదం ఉంది. ప్రిపరేషన్ పరంగా ఓర్పు, సహనం వంటి అంశాలు కీలకంగా వ్యవహరిస్తాయి. సుదీర్ఘంగా సాగే ఎంపిక ప్రక్రియలో ఏదో ఒక సమయంలో అసహనం ఏర్పడుతుంది. కాబట్టి దాన్ని అధిగమించడం చాలా ముఖ్యం. ప్రిపరేషన్ పరంగా డిస్క్రిప్టివ్ అప్రోచ్‌తో ముందుకెళ్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.
- చేకూరి కీర్తి, 14వ ర్యాంకు, సివిల్స్-2015
Published date : 27 Dec 2017 03:54PM

Photo Stories