Skip to main content

తెలుగులో చదివితే... సివిల్స్ విజయం సాధ్యమేనా?

దేశంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి 24 ప్రతిష్టాత్మక సర్వీసుల్లోకి ఎంపికకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. ఏటా నిర్వహించే పరీక్ష... సివిల్ సర్వీసెస్! ఈ అత్యున్నత పరీక్షను అమ్మ భాష (తెలుగు)లో రాయాలంటే.. ఎన్నో సందేహాలు, మరెన్నో సంశయాలు! అసలు తెలుగులో చదివితే సివిల్స్ విజయం సాధ్యమా? తెలుగు మీడియంలో సన్నద్ధతకు సరిపోయే మెటీరియల్ ఉందా? ఇలా అనేక సందేహాలు..! ఇవన్నీ అపోహలేనని, శ్రమిస్తే విజయం దాసోహమవుతుందని నిరూపించారు రోణంకి గోపాలకృష్ణ (సివిల్స్-2016, 3వ ర్యాంకు). ఆయన తెలుగు మీడియంలో పరీక్ష రాసి, సక్సెస్ సొంతం చేసుకున్నారు. గతంలోనూ తెలుగులో సివిల్స్ పరీక్ష రాసి విజేతలైన వారు ఎందరో ఉన్నారు. కాబట్టి సివిల్స్‌ను తెలుగులో రాసేందుకు వెనకాడాల్సిన అవసరంలేదని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు మీడియం అభ్యర్థులు సివిల్స్ ప్రిపరేషన్ పరంగా ముందుకెళ్లేందుకు సన్నద్ధత వ్యూహాలు...
అధిక శాతం మంది సివిల్స్‌ను ఒక ‘బ్రహ్మపదార్థం’గా భావిస్తుంటారు! చిన్నప్పటి నుంచి ఇంగ్లిష్‌లో మీడియంలో చదివిన అపర మేధావులకు మాత్రమే సివిల్స్‌లో సక్సెస్ సాధ్యమవుతుందని అపోహపడుతుంటారు. ‘తెలుగులో సివిల్స్ అసాధ్యం’ అనే భావన చాలా మందిలో స్థిరపడిపోయింది. అందుకే సివిల్స్‌కు ఇంగ్లిష్ మీడియం విద్యార్థులంత చొరవగా తెలుగు విద్యార్థులు హాజరవడం లేదు. తెలుగులో చాలా తక్కువ మంది సివిల్స్ రాస్తుండగా.. అందులో సగం మందికి సరైన ప్రిపరేషన్ ఉండటం లేదు. దీంతో అంతిమ ఫలితం ప్రతికూలం!

ఆలోచనా దృక్పథం మారాలి...
తెలుగులో సివిల్స్ రాయాలనుకునే అభ్యర్థులు ముందుగా మాతృభాషకు సంబంధించిన ఆలోచనా దృక్పథాన్ని మార్చుకోవాలి. తెలుగులో రాస్తే విజయం వరించదేమోనన్న భయాన్ని మొదట విడనాడాలి. అమ్మ భాషనే ఒక ఆయుధంగా గుర్తించాలి. సహజంగా ఇంగ్లిష్ మీడియం అభ్యర్థుల్లో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. దీనికి కారణం వారు ఇంగ్లిష్‌ను ఒక ప్రయోజనకారిగా గుర్తించడమే! అదే తరహాలో తెలుగులో రాసే విద్యార్థులు సైతం భాషను ఒక ఆయుధంగా భావిస్తే.. ప్రిపరేషన్ పరంగా వెయ్యేను గుల బలం వచ్చినట్లే! భావవ్యక్తీకరణకు మాతృభాషకు మించిన మాధ్యమం లేదని శాస్త్రీయంగానూ నిరూపితమైంది. కాబట్టి భాషను విజయానికి అడ్డుగోడ (బారియర్)గా భావించడం సరికాదు.

ఇంగ్లిష్ అవసరం ఏ మేరకు ?
  • జాతీయస్థాయి నియామకాలను కొన్ని లక్ష్యాలకు అనుగుణంగా చేపడతారు. సివిల్ సర్వీసెస్ జాబ్ ప్రొఫైల్స్ చూస్తే ఇంగ్లిష్ కమ్యూనికేషన్ కీలకమని తెలుస్తుంది. జాతీయ అవసరాలు, సివిల్స్‌కి ఎంపికై న అభ్యర్థి నిర్వర్తించాల్సిన విధులు.. ఇలా దేన్ని పరిశీలించినా.. ఇంగ్లిష్‌పై అవగాహన తప్పనిసరి. కాబట్టి ప్రాంతీయ భాషలో పరీక్ష రాసే అభ్యర్థికి సైతం ఇంగ్లిష్‌లో ఇతరులతో కమ్యూనికేట్ చేయగలిగే, ఇంగ్లిష్‌లో ఒక విషయాన్ని చదివి అర్థం చేసుకోగలిగే సామర్థ్యాలు తప్పనిసరి..
  • సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ ప్రశ్నపత్రాలు రెండూ ఇంగ్లిష్‌లోనే ఉంటాయి. ప్రిలిమ్స్ మల్టిపుల్ చాయిస్ విధానంలో జరుగుతుంది. వ్యాస రూప విధానంలో ఉండే మెయిన్స్‌లో ప్రశ్నలు ఇంగ్లిష్‌లో అడిగినా సమాధానాలు తెలుగులో రాసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి అభ్యర్థికి ప్రశ్న చదివి, అవగాహన చేసుకునే కనీస ఇంగ్లిష్ నైపుణ్యం తప్పనిసరి. ప్రిలిమ్స్‌లో సరైన ఆప్షన్ గుర్తించాలన్నా.. మెయిన్స్‌లో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం రాయాలన్నా.. ఇంగ్లిష్‌ను చదివి అర్థంచేసుకోగలిగే నైపుణ్యం ఉండాలి. దీనికోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం లాభిస్తుంది. ఇంగ్లిష్ వొకాబ్యులరీని పెంచుకోవడాన్ని నిరంతర ప్రక్రియగా అలవరచుకుంటే.. ఇంగ్లిష్ బేసిక్స్‌పై పట్టు చిక్కుతుంది..
  • ప్రిపరేషన్ పరంగా సివిల్స్, మెయిన్స్‌ను వేర్వేరుగా చూడకూడదు. అనువర్తన దృక్పథాన్ని అలవరచు కోవాలి. అప్పుడే ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి..
  • ఇంగ్లిష్‌ను పూర్తిగా పక్కనపెట్టి సివిల్స్‌కి సిద్ధమవడం సాధ్యం కాదు. తెలుగులో లభిస్తున్న మెటీరియల్‌ను అనుసరి స్తూనే.. ఇంగ్లిష్‌లో అందుబాటులో ఉండే సమా చారాన్ని తెలుగులోకి అనువదించుకొని చదవడం లాభిస్తుంది..
  • సివిల్స్‌కి సంబంధించి గతంతో పోల్చితే తెలుగులో మెటీరియల్ లభ్యత పెరిగింది. చాలావరకు ఇంగ్లిష్ ప్రామాణిక పుస్తకాలకు తెలుగు అనువాదాలు లభిస్తున్నాయి..

తెలుగులో ప్రిపరేషన్ ఇలా..
కరెంట్ అఫైర్స్ :
సివిల్స్ ప్రిపరేషన్‌లో అత్యంత కీలక విభాగం.. కరెంట్ అఫైర్స్. దీనికి సంబంధించిన ప్రశ్నల్లో ఎక్కువగా జాతీయ, అంతర్జాతీయ అంశాలు కనిపిస్తున్నాయి. గ్రూప్స్‌లో అడిగే ప్రశ్నలకు సివిల్స్ ప్రశ్నలకు ప్రధాన వ్యత్యాసం ఇదే. దీంతోపాటు కోర్ సబ్జెక్టులకు సంబంధించిన అంశాలను కరెంట్ అఫైర్స్‌తో ముడిపెట్టి అడగడం సివిల్స్ ప్రత్యేకత. హిందూ వంటి ఇంగ్లిష్ పత్రికతోపాటు ఒకటి లేదా రెండు తెలుగు పత్రికలు చదవాలి. రాజ్యసభ టీవీ వంటి ఛానెళ్లను అనుసరిస్తుండాలి.

చరిత్ర :
చరిత్రలో ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర ఉంటాయి. ఈ మూడింట్లో ఆధునిక భారతదేశ చరిత్రకు అధిక వెయిటేజీ లభిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ సాగించాలి. చరిత్ర అధ్యయనం.. అవగాహన, విశ్లేషణపై ఆధారపడి ఉంటుంది. టైమ్‌లైన్ ఆధారంగా చరిత్ర అధ్యయనం సాగిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఉదాహరణకు ప్రిలిమ్స్ కోణంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) ఏర్పడిన సంవత్సరం 1885 అని చదివితే సరిపోదు. దీని స్థాపనకు దారితీసిన పరిస్థితులు.. క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తులు వంటి విషయాలను తప్పనిసరిగా చదవాలి. ఇలా చేయడం వల్ల మెయిన్స్‌కూ సన్నద్ధత లభిస్తుంది. చరిత్రలో మెయిన్స్‌కి సంబంధించి విస్తృతంగా విశ్లేషణ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు మెయిన్స్ పేపర్-2లో భరతనాట్యం, కూచిపూడి మధ్య వ్యత్యాసాలను సోదాహరణంగా వివరించండి? అని అడిగితే.. రెండు కళలను పోల్చుతూ, విశ్లేషిస్తూ సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్‌కి సంబంధించి స్వాతంత్య్ర ఉద్యమానికి అధిక ప్రాధాన్యమివ్వాలి.
రిఫరెన్స్:
  1. తెలుగు అకాడమీ బీఏ పుస్తకాలు..
  2. అంబేద్కర్ ఓపెర్ యూనివర్సిటీ బీఏ హిస్టరీ పుస్తకాలు..
  3. బిపిన్‌చంద్ర స్వాతంత్య్రానంతర భారతదేశం (తెలుగు అనువాదం)..
  4. సతీష్ చంద్ర మధ్యయుగ భారతదేశ చరిత్ర..
  5. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ- ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్ బుక్..
  6. 6 నుంచి 12 వరకు ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు..

జాగ్రఫీ :
సమకాలీనాంశాలను దృష్టిలో ఉంచుకొని జాగ్రఫీ ప్రిపరేషన్ కొనసాగిస్తే.. మంచి మార్కులు సాధించొచ్చు. అట్లాస్ ఆధారంగా ప్రిపరేషన్ సాగించాలి. మ్యాప్ ఆధారిత ప్రశ్నలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు పంటలు, పరిశ్రమలు, పర్యాటక ప్రదేశాలు, బయోడైవర్సిటీ పార్కులు, నేషనల్ పార్కులు; ప్రపంచ, భారత భౌతిక భౌగోళికాంశాలపై దృష్టిసారించాలి. భారత్‌ను ప్రభావితం చేసే భౌగోళిక, వాతావరణ అంశాలకు అధిక ప్రాధాన్యమివ్వాలి.
రిఫరెన్స్:
  1. ఇంటర్, బీఏ తెలుగు మీడియం జాగ్రఫీ పుస్తకాలు..
  2. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు..

పాలిటీ :
పాలిటీని ఒక క్రమపద్ధతిలో చదవాలి. రాష్ట్రపతి గురించి చదివేటప్పుడు గవర్నర్ గురించి కూడా అవగాహన పెంచుకోవాలి. ఇదే క్రమంలో లోక్‌సభ, రాజ్యసభ; శాసనసభ, శాసన మండలి, లోక్‌సభ స్పీకర్; శాసనసభ స్పీకర్‌లను పోల్చుతూ అధ్యయనం సాగించాలి. చట్టబద్ధ సంస్థలు, రాజ్యాంగబద్ధ సంస్థల మధ్య వ్యత్యాసం, ప్రభు త్వ విధానాలు, అంతర్జాతీయ సంబంధాలు వంటి వాటిపై లోతైన అవగాహన ఏర్పరచుకోవాలి. వీటితో పాటు రాజ్యాంగ సంస్థల పరిధి, సమాఖ్య వ్యవస్థ వంటి అంశాలు కీలకమైనవి.
రిఫరెన్స్ :
  1. లక్ష్మీకాంత్ పాలిటీ (తెలుగు అనువాదం)..
  2. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు..
  3. తెలుగు అకాడమీ బీఏ పుస్తకాలు..
  4. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బీఏ రాజనీతి శాస్త్రం, ఏంఏ రాజనీతి శాస్త్రం..

ఎకానమీ :
ఎకానమీకి సంబంధించి సూక్ష్మ అర్థశాస్త్రంపై ఎక్కువ దృష్టిపెట్టాలి. ఈ మధ్యకాలంలో అడిగిన ప్రశ్నలను గమనిస్తే.. ఎకానమీలో కరెంట్ అఫైర్స్ ఆధారిత ప్రశ్నలు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి అభ్యర్థులు ఆ దిశగా ప్రిపరేషన్ సాగించాలి. రిజర్వ్ బ్యాంక్ పాలసీలు, కరెంట్ అకౌంట్ లోటు, ఆర్‌బీఐ మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ, బడ్జెట్, ప్రభు త్వం ప్రారంభించిన కొత్త పథకాలు, భారతదేశ ఆర్థిక వృద్ధి జనాభా పెరుగుదల ప్రభావం తదితరాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి.
రిఫరెన్స్:
  1. బీఏ ఎకానమీ పుస్తకాలు..
  2. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు..
  3. ఆర్థిక సర్వే..
  4. బడ్జెట్.

పర్యావరణం, విపత్తు నిర్వహణ :
కాప్ సదస్సులు, పారిస్ అగ్రిమెంట్, మాంట్రియల్ ఒప్పందం వంటి అంతర్జాతీయ ఒడంబడికల గురించి తెలుసుకోవాలి. ఇది కాస్త టెక్నికల్ సబ్జెక్టులా అనిపిస్తుంది. కానీ కాన్సెప్ట్‌పై స్పష్టతతో ముందుకెళ్తే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విభాగానికి సంబంధించి విపత్తు నిర్వహణపై ఎక్కువగా దృష్టిపెట్టాలి.
రిఫరెన్స్:
  • అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పర్యావరణం -సమస్యలు పుస్తకం..

జనరల్ సైన్స్ :
సైన్స్‌కు సంబంధించి సమకాలీన శాస్త్ర, సాంకేతిక అంశాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కాబట్టి జనరల్ సైన్స్ కు సంబంధించి దినపత్రికల్లో వచ్చే అంశాలపై దృష్టిసారించాలి. వీటితోపాటు అనువర్తనాలు, నవకల్పనలు, అంతరిక్ష విజ్ఞానం వంటి అంశాలను బాగా చదవాలి.
రిఫరెన్స్:
  1. తెలుగు అకాడమీ పుస్తకాలు..
  2. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు..
  3. 6 నుంచి 10వ తరగతి వరకు పుస్తకాలు..

జనరల్ ఎస్సే :
జనరల్ ఎస్సే ద్వారా అభ్యర్థుల భావవ్యక్తీకరణ నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. సమాధానం రాసే క్రమంలో అభ్యర్థి సంబంధిత అంశాలను విశ్లేషించిన తీరును ఈ పేపర్ ద్వారా అంచనా వేస్తారు. జనరల్ ఎస్సే రాసేటప్పుడు భావోద్వేగాలను అతిగా ప్రదర్శించకూడదు. దీంతోపాటు సమాధానాలు తప్పనిసరిగా దేశ రాజ్యాంగానికి లోబడే ఉండాలి. ఎందుకంటే.. సివిల్స్‌కి ఎంపికై న అభ్యర్థి రాజ్యాంగాన్ని అనుసరించే పనిచేయాల్సి ఉంటుంది. ఎస్సే రాసేటప్పుడు సమాధానాన్ని పాయింట్ల వారీగా రాయకూడదు. సమాధానానికి సంబంధించి సరైన ఇంట్రో, ప్రధాన అంశాలు, ముగింపు ఉండాలి. దీనికోసం దినపత్రికల ఎడిటోరియల్స్ వ్యాసాలు చదవడం లాభిస్తుంది.

ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్ :
ఈ పేపర్ ద్వారా అభ్యర్థి వ్యక్తిత్వం, ఆలోచనా దృక్పథాన్ని అంచనా వేస్తారు. ఆయా అంశాలపై అడిగే ప్రశ్నలకు సమాధానాలు రాసేటప్పుడు మానవతా దృక్పథం ప్రస్ఫుటించేలా అభిప్రాయాలను వ్యక్తం చేయాలి. దీనికి గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయడం లాభిస్తుంది. తెలుగులో ఎథిక్స్‌కు సంబంధించి ప్రామాణిక పుస్తకాలు అందుబాటులో లేవని చెప్పొచ్చు. విలువలు, నీతి, నిజాయితీ తదితర అంశాలపై దినపత్రికల్లో వస్తున్న అంశాలను ప్రిపరేషన్‌కు ఉపయోగించుకోవాలి.
  1. మెయిన్స్‌లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ పరీక్ష కోసం పదోతరగతి స్థాయిలో ప్రిపేరైతే సరిపోతుంది. ప్రాంతీయ భాషలో అడిగే ప్రశ్నలు అత్యంత తేలిగ్గా ఉంటాయి..
  2. ఆసక్తి, అభిరుచి ఆధారంగా ఆప్షనల్ సబ్జెక్టును ఎంచుకోవాలి. ఇటీవల తెలుగు ఆప్షనల్‌తో ఎక్కువ మంది సక్సెస్ అవుతున్నారు. అయినా ఆప్షనల్ ఎంపిక అనేది పూర్తి వ్యక్తిగతం, అవసరమైతే నిపుణులు సలహాలు తీసుకోవాలి. .

ఇంటర్వ్యూ :
తెలుగులో ఇంటర్వ్యూ చేస్తే నష్టపోతామనే భావన సరైంది కాదు. యూపీఎస్సీ అనువాదకులుగా ప్రొఫెసర్ స్థాయి వ్యక్తులను నియమిస్తోంది. కాబట్టి వారు అభ్యర్థి వ్యక్తపరచిన అభిప్రాయాలను సరైన రీతిలో ఇంగ్లిష్‌లోకి అనువదిస్తారు. కాకపోతే అక్కడక్కడ ఇంగ్లిష్ పదాలను ఉపయోగించడం వల్ల ప్యానెల్‌కి అభ్యర్థిపై మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది.

సగం సిలబస్‌కు దినపత్రికలే ఆధారం..
  • రెండేళ్ల పాటు ఏవైనా రెండు ప్రామాణిక దినపత్రికలను నిరంతరం చదివితే చాలా వరకు సివిల్స్ మెటీరియల్ లభించినట్లే !.
  • ప్రస్తుతం తెలుగు దినపత్రికలు సైతం అంతర్జాతీయ, జాతీయ అంశాలను ఎక్కువగా కవర్ చేస్తున్నాయి. ఇది తెలుగు మీడియం అభ్యర్థులకు లాభించే అంశం..
  • కృత్రిమ మేధస్సు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌‌స, జీనోమ్ ఎడిటింగ్ తదితర టెక్నికల్ అంశాలపైనా తెలుగు పత్రికల్లో కథనాలు వస్తున్నాయి. కాబట్టి సిలబస్‌కు అనుగుణంగా అవసరమైన అంశాలను సేకరించడం లాభిస్తుంది..
  • ఎకానమీకి సంబంధించి బడ్జెట్‌కు ముందు, తర్వాత కొన్ని రోజులపాటు తెలుగు పత్రికల్లో పెద్ద సంఖ్యలో కథనాలు వస్తున్నాయి. వాటిని సేకరించి అధ్యయనం చేయాలి. .
  • సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్‌మెంట్‌కు సంబంధించి పత్రికల ప్రత్యేక పేజీల్లో వచ్చే ఆర్టికల్స్ బాగా ఉపయోగపడతాయి..
  • దినపత్రికలు చదివేటప్పుడు కరెంట్ అఫైర్స్‌ను కోర్ సబ్జెక్టుల వారీగా విభజించి.. రాసుకోవడం లాభిస్తుంది. తెలుగు మీడియంలో చదివేవారు సొంతంగా నోట్సును ప్రిపేర్ చేసుకోవడం ద్వారా రాత నైపుణ్యాలు కూడా పెంపొందుతాయి. .
  • సాధించాలనే తపన.. సాధిస్తామనే నమ్మకముంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. ఆత్మవిశ్వాసంతో, హార్డ్‌వర్క్ చేయండి.. సివిల్స్ సాధించండి.
- మల్లవరపు బాలలత, డెరైక్టర్, సీఎస్‌బీ ఐఏఎస్ అకాడమీ.
Published date : 26 Jul 2018 05:00PM

Photo Stories