Skip to main content

సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ప్రణాళిక

100 శాతం ఆత్మవిశ్వాసంతో సివిల్స్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్ కొనసాగించాలి. పటిష్ట ప్రణాళికతో చదివితే తప్పకుండా ప్రిలిమ్స్‌లో విజయం సాధిస్తామనే నమ్మకం అవసరం. అదృష్టాన్ని నమ్ముకోకుండా, కేవలం కటాఫ్ మార్కులు తెచ్చుకుంటే సరిపోతుందని కాకుండా పూర్తిస్థాయిలో మంచి స్కోర్ సాధించేందుకు శ్రమించాలి.
పేపర్ 1: 2015 సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్‌తో వచ్చిన మార్పులు కారణంగా ప్రిలిమ్స్‌లో విజయానికి జనరల్ స్టడీస్ పేపర్-1 కీలకంగా మారింది. ఈ పేపర్‌లో కనబర్చిన ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. పేపర్-2 అర్హత పేపర్ మాత్రమే. సిలబస్‌లోని సబ్జెక్టులకు సంబంధించి ప్రాథమిక అంశాలపై పట్టుసాధించడం ద్వారా ప్రిలిమ్స్‌ను తేలిగ్గా అధిగమించవచ్చు.

తేదీలు, ఫ్యాక్ట్స్:
జనరల్ స్టడీస్ ప్రిపరేషన్ అంటే కేవలం ఫ్యాక్ట్స్, తేదీలు, పేర్లను గుర్తుంచుకోవడం కాదు. హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి వివిధ అంశాలను క్రమపద్ధతిలో అధ్యయనం చేస్తూ వెళ్తే ప్రిపరేషన్ సాఫీగా సాగిపోతుంది.

మెయిన్స్ కోణంలో
వివిధ అంశాలపై పరిజ్ఞానం, అభిరుచిని పరీక్షించేలా ప్రిలిమ్స్ ఉంటుంది. మెయిన్స్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రిలిమ్స్‌కు ప్రిపరేషన్ కొనసాగించాలి. దీనివల్ల రెండు పరీక్షల్లో మంచి మార్కులు సాధించేందుకు వీలవుతుంది. ప్రిలిమ్స్ పూర్తయ్యాక మెయిన్స్ సబ్జెక్టులను చదవడం కూడా తేలికవుతుంది.
  • ప్రిలిమ్స్‌లో ఒక ప్రశ్నకు ఇచ్చిన ఆప్షన్ల నుంచి కచ్చితమైన సమాధానాన్ని ఎంపిక చేసుకోవాల్సి ఉంటే, మెయిన్స్‌లో సరైన సమాధానాన్ని రాయాల్సి ఉంటుంది. ఈ రెండింటికీ అదే తేడా. దీన్ని దృష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. ఒక్క ఆప్షనల్ సబ్జెక్టు తప్పించి, మిగిలిన అన్ని సబ్జెక్టులు, అంశాలు ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఒకే విధంగా ఉంటాయి.
  • జనరల్ స్టడీస్‌కు దగ్గరగా ఉండే హిస్టరీ, జాగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ వంటి సబ్జెక్టులను ఆప్షనల్ సబ్జెక్టుగా ఎంపిక చేసుకుంటే మంచిది.
  • ప్రిలిమ్స్ (మల్టిపుల్ చాయిస్), మెయిన్స్ (డిస్క్రిప్టివ్), పర్సనాలిటీ టెస్ట్ (వెర్బల్ ప్రజెంటేషన్).. సివిల్స్‌లో ఈ మూడింటి రూపాలు వేరైనా.. వాటి మధ్య అంతర్గత సంబంధం ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, పరీక్షకు సిద్ధమవాలి.
  • ప్రిలిమ్స్‌లో సబ్జెక్టుల వారీగా ప్రశ్నలకు వెయిటేజీ లేదు. ఒక అంశం నుంచి కచ్చితంగా వచ్చే ప్రశ్నల సంఖ్యను చెప్పలేం. ఈ పరిస్థితిలో ప్రిలిమ్స్, మెయిన్స్‌కు ఉమ్మడిగా ఉన్న సబ్జెక్టుల ప్రిపరేషన్‌కు ఎక్కువ సమయం కేటాయించాలి. ఉమ్మడి అంశాలు: ఆధునిక భారతదేశ చరిత్ర, రాజనీతి శాస్త్రం, భారత ఆర్థిక వ్యవస్థ, భౌగోళిక శాస్త్రం, వర్తమాన అంశాలు. ఎన్ని అంశాలను చదివామనే దానికంటే, చదివిన అంశాలను ఎంత బాగా అధ్యయనం చేశామన్నది విజయానికి కీలకం.
పేపర్-2 (సీశాట్): సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సీశాట్) పేపర్‌ను అర్హత పేపర్‌గా మార్చడం వల్ల ముఖ్యంగా గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు మేలు జరుగుతోంది. ఈ పేపర్‌లో 33 శాతం మార్కులను అర్హత మార్కులుగా నిర్దేశించారు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రెహెన్షన్ స్కిల్ విభాగాన్ని తొలగించారు. ఈ మార్పుల వల్ల పేపర్-2 ప్రిపరేషన్ తేలికైంది. అయితే ఇది అర్హత పేపర్ కాబట్టి, నిర్లక్ష్యం చేయకూడదు. ఈ పేపర్లో విజయం సాధించాలంటే అభ్యర్థులు కనీస స్థాయిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీడింగ్ స్కిల్స్‌ను పెంపొందించుకోవాలి.
  • పేపర్-2 ప్రశ్నలకు సమాధానాలు రాసే విషయంలో వేగం, కచ్చితత్వం అవసరం. ప్రాక్టీస్ ద్వారా మాత్రమే ఈ నైపుణ్యాలు అలవడతాయి. దీనికోసం పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. వీలైనన్ని మాక్‌టెస్ట్‌లు రాయాలి. మ్యాగజైన్లలో ప్రచురించిన క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.
రీడింగ్ కాంప్రెహెన్షన్:
సీశాట్‌లో రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగం చాలా చిన్నది. ప్యాసేజ్‌ను చదివే ముందు మొదట ఒకసారి ప్రశ్నలన్నింటినీ పరిశీలించాలి. దీనివల్ల ప్రశ్నలకు సరైన సమాధానాల ఎంపికకు అవసరమైన సమాచారాన్ని గుర్తించడం తేలికవుతుంది. రీడింగ్ కాంప్రెహెన్షన్ విభాగాన్ని విజయవంతంగా అధిగమించడానికి ఫ్రంట్‌లైన్, ఇండియా టుడే, వీక్ వంటి మ్యాగజైన్లను చదవాలి. ఇవి జనరల్ స్టడీస్‌కు కూడా ఉపయోగపడతాయి.
  • నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు పరీక్ష గురించి ఆందోళన చెందనవసరం లేదు. పరీక్షలో కేవలం బేసిక్ అంశాలపై పరిజ్ఞానాన్ని పరిశీలిస్తారు. అందువల్ల ప్రాక్టీస్ బాగా చేస్తే తేలిగ్గానే లాజికల్, అనలిటికల్ రీజనింగ్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించవచ్చు. ఈ విభాగాల ప్రిపరేషన్‌కు ఎం.కె.పాండే, ఆర్.ఎస్.అగర్వాల్ పుస్తకాలు ఉపయోగపడతాయి.
రిఫరెన్స్
  • అనలిటికల్ రీజనింగ్: ఎం.కె.పాండే (లాజికల్, అనలిటికల్ రీజనింగ్)
  • ఆర్.ఎస్.అగర్వాల్ (వెర్బల్/లాజికల్ రీజనింగ్, ఆప్టిట్యూడ్, రీడింగ్ కాంప్రెహెన్షన్)
  • క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్-అరుణ్‌శర్మ (టీఎంహెచ్)
  • అరిహంత్ పబ్లికేషన్స్ (సీశాట్)
  • పజిల్స్ టు పజిల్ యూ - శకుంతలా దేవి
  • అరిహంత్ పబ్లికేషన్స్ (సీశాట్)
శ్రీరాం శ్రీరంగం
డెరైక్టర్, శ్రీరాం ఐఏఎస్, న్యూఢిల్లీ
Published date : 04 May 2016 06:44PM

Photo Stories