Skip to main content

సివిల్స్.. ప్రిలిమ్స్ 30 డేస్ సక్సెస్ ప్లాన్...

సివిల్స్ ప్రిలిమ్స్.. దేశ అత్యున్నత సర్వీసుల్లోకి ఎంపిక ప్రక్రియలో తొలి దశ. దేశవ్యాప్తంగా ఆగస్టు 7న ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. అంటే.. సరిగ్గా ఇంకా 30 రోజుల సమయం అందుబాటులో ఉంది. దాదాపు పది లక్షల మంది దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇంత పోటీ ఉండే పరీక్షలో విజయానికి.. ఈ 30 రోజుల్లో సక్సెస్ ప్లాన్..
సివిల్స్ ప్రిలిమ్స్.. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ తదితర దేశ అత్యున్నత సర్వీసుల్లోకి నియామకానికి నిర్వహించే మూడంచె ల ప్రక్రియలో తొలిదశ. ప్రిలిమ్స్ పాసైతేనే మలి దశ మెయిన్ పరీక్ష రాసేందుకు అర్హత లభిస్తుంది. ప్రిలిమ్స్‌లో రెండు పేపర్లు ఉంటాయి. మరో నెలరోజుల్లో పరీక్ష జరగనుంది. ఈ నెల రోజులు సివిల్స్ ప్రిలిమ్స్‌లో సక్సెస్‌కు అత్యంత కీలకం అంటున్నారు నిపుణులు. రెండు, మూడేళ్లుగా ప్రిపేర్ అవుతున్నవారితోపాటు తొలిసారిగా అటెంప్ట్ చేస్తున్న అభ్యర్థులు.. ఇప్పుడిక భిన్నమైన ప్రిపరేషన్ వ్యూహం అనుసరించాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు సిలబస్ ప్రకారం అన్ని అంశాలపై క్షుణ్నంగా అభ్యసనం సాగించిన అభ్యర్థులు.. ఈ నెల రోజులు మాత్రం వీలైనన్ని ఎక్కువసార్లు రివిజన్ చేస్తూ ముఖ్యాంశాలపై ఫోకస్డ్‌గా ఉండాలి.

రివిజన్‌కే ప్రాధాన్యం :
అందుబాటులో ఉన్న సమయాన్ని పూర్తిగా పునశ్చరణకే కేటాయించాలి. ఇప్పటికే అవగాహన ఏర్పరచుకున్న అంశాలనే మళ్లీ మళ్లీ చదవాలి. ప్రిపరేషన్ సమయంలో నిర్దిష్ట అంశం గుర్తుంచుకునేలా షార్ట్‌కట్ మెథడ్స్ (పాయింటర్స్ అప్రోచ్, షార్ట్ నోట్స్, విజువలైజేషన్ టెక్నిక్)లో నోట్స్‌లు రూపొందించుకుంటారు. ప్రస్తుత సమయంలో వాటిపై ఎక్కువగా దృష్టిపెట్టాలి. ప్రతి సబ్జెక్ట్, యూనిట్‌లో అన్ని అంశాలకు సంబంధించి ఈ విధానం అవలంబించాలి. ప్రిపరేషన్ సమయంలో షార్ట్ నోట్స్ రూపొందించుకోకుంటే.. ఎంపిక చేసుకున్న మెటీరియల్‌లోని పాయింట్లను రివిజన్ చేయాలి. అన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసేలా టైం ప్లాన్ రూపొందించుకోవాలి. ప్రతిరోజు, ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్టంగా సమయం కేటాయించుకోవాలి. అభ్యర్థులు తమ వ్యక్తిగత సామర్థ్యాల ప్రకారం ఆయా సబ్జెక్ట్‌కు సమయం కేటాయించుకోవాలి. అయితే తమకు క్లిష్టంగా ఉండే అంశాల కోసం ఎక్కువ సమయం వెచ్చించడం సరికాదు.

కరెంట్ అఫైర్స్‌పై ఎక్కువ శ్రద్ధ :
ప్రస్తుత సమయంలో అభ్యర్థులు.. గతేడాది కాలంలో అంతర్జాతీయంగా, జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న అంశాలపై పట్టు సాధించేలా సన్నద్ధమవ్వాలి. అంతర్జాతీయంగా సంభవించిన పరిణామాలు భారతదేశ కోణంలో ఎలా ప్రభావం చూపుతున్నాయి? వాటి ఫలితం ఏంటి? తదితర అంశాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. సమకాలీన అంశాలపై ప్రాధాన్యం ఇచ్చే క్రమంలో అభ్యర్థులు సిస్టమాటిక్‌గా వ్యవహరించాలి. గతేడాది కాలంగా జరిగిన సదస్సులు, తీర్మానాలు ఇలా వరుస క్రమంలో అధ్యయనం చేయాలి. ఇటీవల అంతర్జాతీయంగా ప్రాముఖ్యం సంతరించుకున్న బ్రెగ్జిట్ గురించి అన్ని కోణాల్లో తెలుసుకోవాలి.

పట్టున్న అంశాలపై మరింత లోతుగా :
అభ్యర్థులు ఇప్పటికే పట్టు సాధించిన అంశాలపై మరింత లోతైన అవగాహన పెంచుకోవాలి. సబ్జెక్ట్‌ల వారీగా ముఖ్య సమాచారం, సంఘటనలు, కమిటీలు-నివేదికలు, సర్వేలు-గణాంకాలను తెలుసుకోవాలి. ఇలాంటి ఆంశాలపై షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకుని పరీక్షకు వారం రోజుల ముందు వీలైనన్నిసార్లు రివైజ్ చేయాలి.

ప్రీవియస్ పేపర్స్.. ప్రాక్టీస్ టెస్ట్‌లు :
అభ్యర్థులు ప్రతి రోజూ ఒక ప్రీవియస్ పేపర్ ప్రాక్టీస్ చేయాలి. తద్వారా తమ బలాలు, బలహీనతలపై అవగాహన వస్తుంది. దాంతోపాటు ప్రిలిమ్స్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఇప్పుడు ఉపకరించే సాధనాలు ప్రాక్టీస్ టెస్ట్‌లు, మాక్ టెస్ట్‌లు. సంబంధిత సబ్జెక్ట్ నిపుణులు రూపొందించిన మాక్‌టెస్టులు/ప్రాక్టీస్ టెస్టులకు హాజరు కావడం ద్వారా వాస్తవ పరీక్షను రాసిన అనుభవం వస్తుంది. ఇది ఆగస్టు 7న పరీక్ష హాల్లో అనవసర ఆందోళనకు గురికాకుండా ఎంతగానో దోహదపడుతుంది. శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థులు ఇన్‌స్టిట్యూట్స్ నిర్వహించే వీక్లీ టెస్ట్‌లకే పరిమితం కాకుండా..ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న టెస్ట్‌లకు హాజరు కావడం మంచిది. కనీసం మూడు గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కావడం మేలు చేస్తుంది. వీటిని వాస్తవ పరీక్ష మాదిరిగా ఓఎంఆర్ షీట్ విధానంలో రాయాలి. ప్రిలిమ్స్ పరీక్షలో విజయావకాశాలు పెంచడంలో చివరి వారం రోజులు ఎంతో కీలకం. ఈ సమయంలో ఒకవైపు పరీక్ష రోజు, పరీక్ష హాల్లో సంసిద్ధత పొందాల్సిన విధానంపై అవగాహన ఏర్పరచుకుంటూనే ఆయా సబ్జెక్ట్‌ల క్విక్ రివిజన్‌కు సమయం కేటాయించాలి. దీనికోసం అప్పటికే తాము రాసుకున్న నోట్స్‌లను రెడీ రెకనర్స్‌గా ఉపయోగించుకోవాలి.

ఈ అడ్మిట్ కార్డ్ (హాల్ టికెట్) డౌన్‌లోడ్ :
ఈ - అడ్మిట్ కార్డ్‌ను వీలైనంత ముందుగా డౌన్‌లోడ్ చేసుకోవాలి. వాస్తవానికి జూలై 1 నుంచే ఈ-అడ్మిట్ కార్డ్ సదుపాయం అందుబాటులోకి వచ్చినందున ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోవడం మేలు. ఫలితంగా తమకు కేటాయించిన సెంటర్ గురించి ముందుగా తెలుసుకునే వీలు కలుగుతుంది. ఉదాహరణకు.. గత ఏడాది తిరుపతి, హైదరాబాద్‌లను కేంద్రాలుగా ఎంపిక చేసుకున్న అభ్యర్థుల్లో కొంతమందికి.. పరీక్ష కేంద్రాల పరిమితి కారణంగా చెన్నై, విజయవాడ కేంద్రాలను యూపీఎస్‌సీ కేటాయించింది. పరీక్షకు రెండు రోజుల ముందుగానో లేదా వారం రోజుల ముందుగానో డౌన్‌లోడ్ చేసుకుని ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఒత్తిడికి గురయ్యే ఆస్కారముంది.

పరీక్ష రోజు ఇలా..
 • అన్ని ప్రశ్నలను చదివేందుకు కనీసం పది నిమిషాలు కేటాయించాలి.
 • ఆ ప్రశ్నలను మూడు కేటగిరీలుగా విభజించాలి.
 • ముందుగా ఈజీగా ఉన్న వాటికి సమాధానాలివ్వాలి.
 • తర్వాత మోస్తరు క్లిష్టత ఉన్నవాటిపై దృష్టి పెట్టాలి.
 • చివరగా కష్టమైన ప్రశ్నలపై దృష్టి సారించాలి.
 • నెగటివ్ మార్కింగ్ నిబంధన నేపథ్యంలో ఊహాత్మక సమాధానాలివ్వకూడదు.
 • ఫస్ట్ పేపర్‌కు రెండో పేపర్‌కు మధ్య లభించే 2 గంటల సమయంలో రెండో పేపర్‌కు సన్నద్ధం కావాలి.
 • చాలా మంది అభ్యర్థులు మొదటి పేపర్ సరిగా రాయలేదని రెండో పేపర్‌కు గైర్హాజరవుతారు. కానీ ఇది సరికాదు. ఒక పేపర్‌కు హాజరైనా, రెండు పేపర్లకు హాజరైనా ఒక అటెంప్ట్ ఇచ్చినట్లే. కాబట్టి రెండు పేపర్లకు హాజరు కావాలి.
 • రెండు పేపర్లు పూర్తయ్యాక మూల్యాంకనం చేసుకుని 50 శాతంపైగా సమాధానాలు సరైనవని భావిస్తే మెయిన్స్ ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి.

ప్రస్తుత సమయంలో తప్పనిసరిగా దృష్టి పెట్టాల్సిన అంశాలు..
 • ముఖ్యమైన ఘట్టాలు, సంఘటనలు
 • ఏడాది కాలంలో జరిగిన జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు రాజ్యాంగంలోని ముఖ్యమైన ఆర్టికల్స్
 • ఎకాలజీ ప్రాధాన్యత గల అంశాలు, తాజా ఆర్థిక సర్వే
 • ఆయా సంస్థల నివేదికలు - గణాంకాలు - సిఫార్సులు
 • కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీలు- వ్యక్తులు

ఒత్తిడి లేకుండా :
సివిల్స్‌లో పోటీ ఎంత ఉన్నా సబ్జెక్ట్‌లలో పట్టు ఉంటే మెయిన్స్‌కు అర్హత సాధించే మార్కులు సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రస్తుత సమయంలో సెల్ఫ్ టెస్ట్స్, మాక్ టెస్ట్, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరు కావాలి. రివిజన్ కోసం తాము రూపొందించుకున్న సొంత నోట్స్ లేదా ఇతర షార్ట్ నోట్స్, రెడీ రెకనర్స్‌ను ఉపయోగించుకోవాలి.
-వల్లూరు క్రాంతి, 65వ ర్యాంకు, సివిల్స్-2015

లక్ష్యం 60 శాతం :
అరవై శాతం మార్కులు లక్ష్యంగా కృషి చేయాలి. కొన్నేళ్ల కటాఫ్‌లను పరిగణిస్తే 50 - 60 శాతం మార్కులతో మెయిన్‌‌సకు అర్హత లభిస్తోంది. విజయం సాధించాలంటే రివిజన్‌కు ప్రాధాన్యం ఇవ్వడంతోపాటు కరెంట్ అఫైర్స్‌లో కీలకాంశాలపై పట్టు సాధించాలి.
వి.గోపాలకృష్ణ, డెరైక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ

ప్రిలిమ్స్

2015 కటాఫ్స్

జనరల్

107.34

ఓబీసీ

106

ఎస్‌సీ

94

ఎస్‌టీ

91.34


గమనిక: గత ఏడాది నుంచి ప్రిలిమ్స్ పేపర్-2 (సీశాట్)ను అర్హత పరీక్షగానే పేర్కొన్న నేపథ్యంలో మెయిన్స్‌కు అభ్యర్థుల ఎంపిక పరంగా రెండు వందల మార్కులకు నిర్వహించిన పేపర్-1 (జీఎస్) మార్కులనే పరిగణనలోకి తీసుకున్నారు.

ప్రిలిమ్స్ (ఆబ్జెక్టివ్ టైప్) పరీక్ష విధానం :

 

మార్కులు

వ్యవధి

పేపర్-1

200

2 గంటలు

పేపర్-2

200

2 గంటలు


మెరిట్‌కు పరిగణనలోకి తీసుకునే మెయిన్స్ (డిస్క్రిప్టివ్ టైప్) పేపర్లు :

పేపర్-1:

ఎస్సే

250 మార్కులు

పేపర్-2:

జనరల్ స్టడీస్ 1

250 మార్కులు

పేపర్-3:

జనరల్ స్టడీస్ 2

250 మార్కులు

పేపర్-4:

జనరల్ స్టడీస్ 3

250 మార్కులు

పేపర్-5:

జనరల్ స్టడీస్ 4

250 మార్కులు

పేపర్-6:

ఆప్షనల్ సబ్జెక్టు పేపర్ 1

250 మార్కులు

పేపర్-7:

ఆప్షనల్ సబ్జెక్టు పేపర్ 2

250 మార్కులు


ఒక్కో పేపర్ పరీక్ష వ్యవధి: 3 గంటలు. వీటితోపాటు అర్హత పేపర్లుగా ఏదైనా భారతీయ భాష, ఇంగ్లిష్ రెండు పేపర్లుగా ఉంటాయి. వీటికి ఒక్కోదానికి 300 మార్కులు. వీటిలో నిర్దేశిత మార్కులు సాధిస్తే సరిపోతుంది.
ఇంటర్వ్యూ: 275 మార్కులు
Published date : 07 Jul 2016 03:05PM

Photo Stories