Skip to main content

సివిల్స్‌ ప్రిలిమ్స్‌–2018...ఉన్న సమయంలో ప్రిపరేషన్‌ ఎలా?

జాతీయస్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌ తదితర 24 సర్వీసుల్లో పోస్టుల భర్తీకి యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే పరీక్ష సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌. ఇది మూడు దశ (ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ)ల్లో ఉంటుంది. సివిల్స్‌ ప్రిలిమ్స్‌–2018, జూన్‌ 3న జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో ప్రిలిమ్స్‌లో విజయానికి నిపుణుల సలహాలు..

ఈ పరీక్షకు దాదాపు అయిదు లక్షల మందికి పైగా పోటీపడుతున్నారు. ఈ అభ్యర్థుల నుంచి 1:12 లేదా 1:12.5 నిష్పత్తిలో మెరిట్‌ జాబితా రూపొందించి రెండోదశ మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. అంటే.. ఈ ఏడాది నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఖాళీలు (మొత్తం పోస్టులు 782)ను పరిగణనలోకి తీసుకుంటే.. మెయిన్స్‌కు ఎంపికయ్యే వారి సంఖ్య 9400 నుంచి పది వేల మధ్యలో ఉంటుంది. తీవ్ర పోటీ ఉండే ప్రిలిమ్స్‌లో గట్టెక్కాలంటే.. పటిష్ట ప్రణాళిక ప్రకారం కృషి చేయాలనేది సబ్జెక్టు నిపుణుల మాట.

టైం మేనేజ్‌మెంట్‌:
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు అభ్యర్థులకు టైం మేనేజ్‌మెంట్‌ చాలా అవసరం. జనరల్‌ స్టడీస్‌ పేపర్‌ సిలబస్‌లో పేర్కొన్న విభాగాలకు సంబంధించిన అంశాలను పరిశీలించి.. ప్రతి సబ్జెక్టును నిరంతరం చదివేలా టైమ్‌ప్లాన్‌ రూపొందించుకోవాలి. రోజూ కనీసం ఎనిమిది నుంచి పది గంటల çసమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించాలి. దాంతోపాటు ప్రతివారం తాము పూర్తిచేసిన సిలబస్‌ అంశాలపై ఎంతమేర అవగాహన ఏర్పడిందో తెలుసుకునేందుకు సెల్ఫ్‌ టెస్ట్‌లు, మాక్‌ టెస్ట్‌లు రాయాలి.

కరెంట్‌ అఫైర్స్‌తో సమ్మిళితం :
సిలబస్‌లో పేర్కొన్న కోర్‌ అంశాలను కరెంట్‌ అఫైర్స్‌తో సమ్మిళితం చేసుకుంటూ చదవడం అభ్యర్థులకు లాభిస్తుంది. గత రెండు, మూడేళ్ల ప్రిలిమ్స్‌ ప్రశ్నల శైలిని పరిగణనలోకి తీసుకుంటే.. ఆయా అంశాలకు సంబంధించి పరీక్షలో వస్తున్న ప్రశ్నలు కరెంట్‌ అఫైర్స్‌ సమ్మిళితంగా ఉంటున్నాయి.

అనుసంధాన దృక్పథం :
ప్రిలిమ్స్‌ పరంగా అభ్యర్థులు ఒక సబ్జెక్టును ఇతర సబ్జెక్టులతో అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేసే దృక్పథాన్ని అలవరచుకోవాలి. ముఖ్యంగా ఎకానమీ–పాలిటీ, ఎకానమీ–జాగ్రఫీ, జాగ్రఫీ–ఎకాలజీ; జాగ్రఫీ–సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విభాగాలను అనుసంధానం చేసుకుంటూ చదవడం మేలు చేస్తుంది.

ముఖ్యాంశాల గుర్తింపు..
గత నాలుగైదేళ్ల ప్రశ్నపత్రాలను పరిశీలించి వాటిలో వివిధ సబ్జెక్టుల నుంచి వస్తున్న ప్రశ్నల సంఖ్య.. ఏఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తుందో గుర్తించాలి. ఉదాహరణకు చరిత్ర ను పరిగణనలోకి తీసుకుంటే.. సాంస్కృతిక చరిత్ర, రాజ్యవంశాలు, కీలక ఘట్టాలు తదిత రాలను ముఖ్యమైనవిగా పేర్కొనొచ్చు.

రెండుసార్లు రివిజన్‌..
అందుబాటులో ఉన్న ప్రస్తుత సమయంలో అభ్యర్థులు ప్రతి సబ్జెక్టును కనీసం రెండుసార్లు పునశ్చరణ చేసుకోవాలి. ఆయా సబ్జెక్టుల సిలబస్‌ను మే మొదటి వారానికి పూర్తిచేసుకునేలా సమయ పాలన పాటించాలి. ఇలా చేయడం వల్ల రెండుసార్లు రివిజన్‌ చేసేందుకు సమయం లభ్యత పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. రివిజన్‌ కోసం ఉపయోగపడేలా ప్రిపరేషన్‌ సమయంలోనే షార్ట్‌నోట్స్‌ రూపొందించుకోవడం మరింత మేలు చేస్తుంది. దీంతోపాటు గత ప్రశ్నపత్రాల సాధన కూడా అభ్యర్థులకు ఉపయోగపడుతుంది.

ముఖ్యాంశాలు..
చరిత్ర :
 • ప్రాచీన, మధ్యయుగ చరిత్రకు సంబంధించి సాహిత్యం, కళలు, మత ఉద్యమాలు, రాజకీయ–సామాజిక– ఆర్థిక చారిత్రక అంశాలు.
 • ఆధునిక చరిత్రలో బ్రిటిష్‌ సామ్రాజ్య స్థాపన– పరిపాలన విధానాలు; స్వాతంత్య్ర పోరాటం, సంస్కరణోద్యమాలు.
పాలిటీ :
రాజ్యాంగం: రాజ్యాంగ పరిషత్, రాజ్యాంగ సవరణ ప్రక్రియ, పీఠిక, ఇప్పటివరకు జరిగిన ముఖ్య రాజ్యాంగ సవరణలు– వాటికి సంబంధించిన రాజ్యాంగ ప్రకరణలు.
రాజకీయ వ్యవస్థ: పార్లమెంటరీ వ్యవస్థ, అర్ధ సమాఖ్య, రాష్ట్రపతి, గవర్నర్, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు, సుప్రీంకోర్టు, హైకోర్టు, ఎన్నికల కమిషన్, ఆర్థిక కమిషన్, పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్లు, అటార్నీ జనరల్, అడ్వకేట్‌ జనరల్‌.. వాటికి సంబంధించి రాజ్యాంగ ప్రకరణలు.
పంచాయతీరాజ్‌ వ్యవస్థ: బల్వంత్‌రాయ్, అశోక్‌మెహతా తదితర కమిటీల సిఫారసులు. 73వ రాజ్యాంగ సవరణ చట్టంలోని ముఖ్యాంశాలు.
ప్రభుత్వ విధానం: విధాన రూపకల్పన జరిగే తీరు. విధానాల అమలు, వాటి సమీక్ష.
 • ఇటీవల ప్రభుత్వం తీసుకున్న ముఖ్య విధానపర నిర్ణయాలు.
 • కేంద్ర–రాష్ట్ర సంబంధాలు.
 • కొద్ది రోజులుగా చర్చనీయాంశంగా మారిన న్యాయ వ్యవస్థ క్రియాశీలత.
ఎకానమీ
 • ఆర్థికాభివృద్ధిలో సహజవనరులు –మూలధన వనరుల పాత్ర. ∙
 • ఆర్థిక వ్యవస్థలో వివిధ రంగాల ప్రగతి (వ్యవసాయ రంగం, పారిశ్రామిక రంగం, సేవారంగం).
 • ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో దేశంలో ఆర్థిక–సాంఘికాభివృద్ధి. ∙
 • పారిశ్రామిక తీర్మానాలు–వ్యవసాయ విధానం. ∙
 • పంచవర్ష ప్రణాళికలు. ∙
 • బ్యాంకింగ్‌ రంగం ప్రగతి–సంస్కరణలు– ఇటీవల కాలంలో బ్యాంకింగ్‌ రంగంలో స్కామ్‌లు, ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావం.
 • 14వ ఆర్థిక సంఘం సిఫారసులు. ∙
 • డీ–మానిటైజేషన్, జీఎస్‌టీ.
 • తాజా మానవాభివృద్ధి, ప్రపంచ అభివృద్ధి నివేదికలు.
సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ :
 • గత ఏడాది కాలంలో ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాలు.
 • సైబర్‌ సెక్యూరిటీ యాక్ట్‌.
 • ∙రక్షణ రంగంలో కొత్త క్షిపణుల ప్రయోగాలు. ∙
 • దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్య వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు.
 • పర్యావరణ పరిరక్షణ ఒప్పందాలు, చర్యలు.
జాగ్రఫీ :
 • 2011 జన గణన ముఖ్యాంశాలు.
 • పర్యావరణ సమస్యలు– ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతాలు, దేశాలు.
 • సౌర వ్యవస్థ, భూ అంతర్నిర్మాణం, శిలలు, జియలాజికల్‌ టైం స్కేల్, రుతుపవనాలు, ప్రపంచ పవనాలు, చక్రవాతాలు, ఉష్ణోగ్రత విలోమం, భూకంపాలు, సునామీలు.
 • మన దేశ పరిస్థితుల నేపథ్యంలో నగరీకరణ, ఆటవిక జాతులు, రుతుపవనాల భవిష్యత్‌ దర్శనం, మాన్‌సూన్‌ మెకానిజం, నదులు, జలాల పంపిణీ, వివాదాలు.

డిస్క్రిప్టివ్‌ విధానంలో..

ప్రిలిమ్స్‌ ప్రిపరేషన్‌ సాగించే అభ్యర్థులు పరీక్షకు నెల రోజుల ముందు వరకు డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌తో ప్రిపరేషన్‌ సాగించడం మెయిన్స్‌కూ ఉపయోగపడుతుంది. ప్రిలిమ్స్‌కు ముందు సబ్జెక్టు అంశాలను చదువుతూనే వాటిలో తమ నైపుణ్యాల స్థాయిని తెలుసుకునే విధంగా మాక్‌టెస్ట్‌లు, మోడల్‌టెస్ట్‌లకు హాజరు కావడం మేలు చేస్తుంది. వీటివల్ల ప్రిపరేషన్‌లో లోటుపాట్లు తెలుస్తాయి. వాటిని సరిదిద్దుకునేందుకు వీలవుతుంది.
– వి.గోపాలకృష్ణ, బ్రెయిన్‌ ట్రీ అకాడమీ
Published date : 03 Apr 2018 04:18PM

Photo Stories