Skip to main content

నేపథ్యాన్ని అవగాహన చేసుకుంటూ...పిపరేషన్ సాగించాలి

ప్రపంచ వ్యాప్తంగా ప్రాధాన్యత సంతరించుకున్న పర్యావరణం సంబంధిత అంశాల పట్ల సివిల్స్ ఔత్సాహికులకు అవగాహ ఉండాలనే ఉద్దేశంతో సిలబస్‌లో ఆయా అంశాలకు చోటు కల్పించారు. ఆ మేరకు సివిల్స్ ప్రిలిమ్స్ సిలబస్‌లో పర్యావరణ పరిరక్షణ, కాలుష్యం, శీతోష్ణస్థితి మార్పు, జీవ వైవిధ్య పరిరక్షణ అంశాలను ప్రవేశ పెట్టారు. కేవలం ప్రిలిమ్స్‌లోనే కాకుండా మెయిన్‌‌సలోని జనరల్ స్టడీస్ పేపర్-3లో పర్యావరణ నష్టం, జీవ వైవిధ్య పరిరక్షణ అంశాలను చేర్చారు. రాబోయే కాలంలో సహజవనరులు, పర్యావరణ నిర్వహణ (Environment Management) ప్రాధాన్యతను గుర్తించి ఈ అంశాలకు సిలబస్‌లో పొందుపరిచారు. కాబట్టి అభ్యర్థులు ఆయా అంశాల నేపథ్యాన్ని అవగాహన చేసుకోవడం ఎంతో అవసరం. మరో కీలక విషయం.. సివిల్స్ ప్రిలిమ్స్‌లోని 100 ప్రశ్నల్లో దాదాపు 10 నుంచి 15 ప్రశ్నలు ఈ అంశాల నుంచి కచ్చితంగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా అంశాలను సమగ్రంగా అవగాహన చేసుకోవాలంటే అభ్యర్థులు బయాలజీకి సంబంధించిన ప్రాథమిక భావనల (బేసిక్స్)పై పట్టు సాధించాలి.

అభివృద్ధి దిశగా వడివడిగా అడుగలు వేస్తున్న మానవుడు.. ఆదే క్రమంలో సహజ వనరులకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాడు. భావితరాల సుస్థిరతను పట్టించుకోకుండా మితిమీరిన వినియోగానికి పాల్పడుతున్నాడు. దాని ప్రభావం వ్యవసాయం, సముద్రమట్టం, జల వలయం, హిమనదులపై స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం, జీవవైవిధ్య సంరక్షణ, కాలుష్య నిర్మూలన వంటివి ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

సమకాలీన దృక్పథం:
Bavitha
కాలుష్య కారకాల ప్రభావాలను తెలుసుకునే క్రమంలో సమకాలీన దృక్పథాన్ని అవలంబించడం ముఖ్యం. ఇటీవల కాలంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వార్తల్లోని పర్యావరణ కాలుష్య సంఘటనలు, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు విడుదల చేసిన నివేదికలను తప్పనిసరిగా పరిశీలించాలి. అదే విధంగా ముఖ్యమైన కాలుష్య కారకాలు, వాటి ప్రభావాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు వాపు నివారణలో ఉపయోగించే డైక్లోఫినాక్ అనే ఔషధం రాబందుల సంఖ్య తగ్గడానికి ఏ విధంగా కారణమవుతుంది? ఎండోసల్ఫాన్ వినియోగం ద్వారా దేశంలో క్యాన్సర్లు ఎలా సంభవిస్తున్నాయి? వాటితోపాటు పాలీక్లోరినేటెడ్ బైఫినైల్స్, ట్రైక్లోసన్, పారాబెన్‌‌స, సోడియం లారెల్ సల్ఫేట్ తదితరాల మూలం, ప్రభావాలను తప్పనిసరిగా చదువుకోవాలి. ఈ మధ్య ఈ రసాయనాలు, వాటి ప్రభావాలు అధిక చర్చల్లో ఉండటమే ఇందుకు కారణం.

ఎకాలజీ:
ఆవరణ శాస్త్రం (Ecology) విషయానికొస్తే.. ఈ విభాగం నుంచి అడుగుతున్న ప్రశ్నలు తప్పనిసరిగా ప్రాథమిక భావనల(బేసిక్స్)పై ఉంటున్నాయి. కాబట్టి ముందుగా ఎకాలజీ (Ecology) అంటే ఏమిటి? ఈ భావన ఎలా అభివృద్ధి చెందింది? ఎకాలజీ అనే పదాన్ని ముఖ్యమైన ఆవరణ శాస్త్రవేత్తలు (హెకెల్, ఓడం, చార్లెస్ ఎల్టన్, క్లెమెంట్స్) ఏ విధంగా నిర్వచించారు వంటి అంశాలను తెలుసుకోవడం ముఖ్యం. ఆ తర్వాత ఎకాలజీలోని ప్రాథమిక భావనల (Fundamental Concepts)ను చదవడం ప్రయోజనకరం. తద్వారా ఈ అంశంపై స్పష్టమైన అవగాహన లభిస్తుంది. ఆ తర్వాత స్పీషీస్, జాతి ఉత్పత్తి (Speciation), ఆటెకాలజీ, సినెకాలజీ, బయోమ్యాగ్నిఫికేషన్, ఆవాసం, జనాభా, కమ్యూనిటీ, బయోం, ఆవరణ వ్యవస్థ (Eco System) నిర్మాణం, విధులు, ఆవరణ వ్యవస్థ శక్తి ప్రసరణ (Energy Flow), జీవ భౌమ రసాయన వలయాలు (Bio Geochemical Cycles), ఆహార శృంఖలాలు, జీవావరణ అనుక్రమం వంటి అంశాలను చదవాలి. ప్రకృతిలోని వివిధ అనుకూల, ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా జీవులు ప్రదర్శించే అనుకూలతల (Adaptations)తోపాటు కొన్ని పర్యావరణ సూత్రాలను తెలుసుకోవాలి.

ఒకసారి ఆవరణ శాస్త్ర భావనల అధ్యయనం తర్వాత కాలుష్యం అనే అంశంపై దృష్టి సారించాలి. పర్యావరణ కాలుష్యం, కాలుష్య కారకాలు, వాటి రకాలు, వాయు, జల, శబ్ద, నేల కాలుష్యం, కారణాలు, ప్రభావాలు, నివారణ చర్యలు, చట్టాలు మొదలైన వాటిని విస్తృతంగా చదువుకోవాలి. వీటికి అదనంగా కాంతి కాలుష్యం, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ, మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (ewaste), బయో మెడికల్ వ్యర్థాల గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి.

శీతోష్ణస్థితి మార్పు:
ఎటువంటి సందేహం లేకుండా ప్రపంచ వ్యాప్తంగా శీతోష్ణస్థితి మార్పు సంభవిస్తుందని ఐపీసీసీ (IPCC-Inter governmental Panel on Climate Change) 1990లో విడుదల చేసిన తన మొదటి నివేదికలో స్పష్టం చేసింది. శీతోష్ణస్థితి మార్పు అంటే ఏమిటి? కారణాలు? గ్లోబల్ వార్మింగ్ అంటే ఏమిటి? గ్రీన్‌హౌస్ ఎఫెక్ట్, గ్రీన్‌హౌస్ ఉద్గారాలేమిటి? వాటి మూలం, ఐపీసీసీ గుర్తించిన గ్రీన్‌హౌస్ ఉద్గారాలు తదితర అంశాలను తెలుసుకోవాలి. అదే సమయంలో ప్రపంచ వ్యాప్తంగా, మన దేశంలో శీతోష్ణష్థితి మార్పు ప్రభావాలు ఏమిటి? ముఖ్యంగా ఐపీసీసీ 2007లో వెల్లడించిన నాలుగో నివేదికతోపాటు ఈ ఏడాది విడుదలైన ఐదో నివేదికలోని ప్రాథమిక అంశాలను కచ్చితంగా తెలుసుకోవాలి. శీతోష్ణస్థితి మార్పు, నియంత్రణ నివారణకు అంతర్జాతీయ స్థాయి చర్యలు ముఖ్యంగా 1992 ధరిత్రీ సదస్సు (ూ్ఖఇఉఈ) ఆనాటి యూఎన్‌ఎఫ్‌సీసీసీ (UNFCCC-Un Framework Convention on Climate Change) అనే ఒప్పందం అమల్లోకి వచ్చిన తీరు దాని లక్ష్యాలు, సంతకాలు చేసిన సభ్య దేశాల సమావేశాలు (COP to UNFCCC).. క్యోటో నగరంలో 1997లో జరిగిన కాప్-3 (COP-3) సందర్భంగా ఏర్పాటైన క్యోటో ప్రోటోకాల్, దాని లక్ష్యాలు, 2005 ఫిబ్రవరి 16 నుంచి అమల్లోకి రావడం.. క్యోటో ప్రోటోకాల్‌కు కొనసాగింపుగా 2015 నాటికి కుదరనున్న రెండో ఒప్పందం గురించి క్షుణ్నంగా తెలుసుకోవాలి. 2009లో కొపెన్‌హాగన్‌లో జరిగిన కాప్-15 (COP-15) సమావేశం, 2010లో మెక్సికో కాంకన్‌లో జరిగిన కాప్-16 (COP-16), 2011లో డర్బన్ కాప్-17 (COP-17), 2012లో దోహా కాప్-18 (COP-18), 2013లో వార్సాలో జరిగిన కాప్-19 (COP-19) సమావేశాల నిర్ణయాలను నిశితంగా పరిశీలించాలి. ఈ ఏడాది పెరూలోని లీమాలో జరిగే కాప్-20 (COP-20), 2015లో ప్యారిస్‌లో నిర్వహించే కాప్-21 (COP-21) సమావేశాలకు సంబంధించిన అంశాలను కూడా పరిశీలించాలి. శీతోష్ణస్థితి మార్పు వల్ల భారత్ బాగా నష్టపోతున్నట్లు ఐఎన్‌సీసీఏ (INCCA-The Indian Network on Climate Change Assessment) నివేదిక స్పష్టం చేసింది. ఈ నివేదికలోని విషయాలతోపాటు శీతోష్ణస్థితి మార్పు నియంత్రణ, నివారణపై భారత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా తెలుసుకోవాలి. ఇందుకోసం భారత ప్రభుత్వం 2005, జూన్ 30న ఎన్‌ఏపీసీసీ (NAPCC-National Action Plan on Climate Change) అనే జాతీయ ప్రణాళికను రూపొందించింది. ఇందులో భాగంగా ఎనిమిది జాతీయ మిషన్లను రూపొందించింది. సౌరశక్తి అభివృద్ధి, శక్తి సామర్థ్యం పెంపు, హరిత భద్రత, సుస్థిర వ్యవసాయం, సుస్థిర ఆవాసాలు, సుస్థిర హిమాలయ వ్యవస్థ, జల భద్రత మొదలైన అంశాలకు సంబంధించినవి ఈ ఎనిమిది మిషన్లు. వీటిలో ఒక్కో మిషన్ గురించి క్షుణ్నంగా చదువుకోవాలి. అదనంగా క్లీన్ డెవలప్‌మెంట్ మెకానిజం, కార్బన్ ట్రేడింగ్, కార్బన్ క్రెడిట్, కార్బన్ ఫుట్ ప్రింట్, ఇకాలాజికల్ ఫుట్ ప్రింట్, REDD+ (Reducing Emissions from Deforestation and Forest Degradation), రియో- 20 మొదలైన అంశాలపై అవగాహన పెంచుకోవాలి.

జీవ వైవిధ్యం:
మానవ మనుగడ ఇతర జీవులపై ఆధారపడి ఉంటుంది. భూమిపై అపారంగా ఉన్న జీవ వైవిధ్య సంరక్షణ ద్వారానే సుస్థిర మానవ అభివృద్ధి సాధ్యమవుతుంది. ఒకప్పుడు అడవులను కలప వనరులుగానే భావించారు. ప్రస్తుతం ప్రతి జీవి, మొక్క, జంతువు, సూక్ష్మజీవులు మానవునికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అనే విషయంలో అవగాహన పెరిగింది. ఒక జీవిలోని వేల జన్యువుల్లో ఒక జన్యువు మాత్రమే అపారమైన విలువలను కలిగి ఉంటుందని మానవునికి అర్థమైన తర్వాత జీవ వైవిధ్య పరిరక్షణ ఆవశ్యకతను గుర్తించాడు. అధిక జీవ వైవిధ్య సంపద ఉన్న దేశాలు భవిష్యత్తులో వ్యవసాయ, వైద్య, పారిశ్రామిక, సామాజిక, విద్యా రంగాల్లో ప్రగతిని సాధించగలుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మొదటి 17 మెగా బయో డైవర్సిటీ కేంద్రాల్లో భారత్ స్థానం ఆరు. ప్రపంచ భూభాగంలో కేవలం 2.4 శాతం ఉన్న భారత్ ప్రపంచ జీవ వైవిధ్యంలో 8 శాతం వాటాను కలిగి ఉంది. భారత్ జీవ వైవిధ్యంలో 33 శాతం వరకు స్థానీయ వైవిధ్యం కనిపిస్తుంది. అనాదిగా ఈ జీవ వైవిధ్యంపై ఎన్నో రకాలుగా ఆధారపడుతూనే ఉంది. అయితే వాటి విలువలను గుర్తించి పరిశోధనలు చేసి పేటెంట్ హక్కులు పొందడంలో మాత్రం భారత్ ఘోరంగా విఫలమైంది. మన వైవిధ్యంపై ఇతరులు పేటెంట్ హక్కులు పొందినా మనం ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో జీవ వైవిధ్య పరిరక్షణ ప్రాధాన్యతను సంతరించుకుంది.

కీలకం:
ఐయూసీఎన్ (International Union for Conservation of Nature and Natural Resources- IUCN) ఏటా ప్రచురించే రెడ్‌లిస్ట్ (Red List) ను నిశితంగా గమనించాలి. అందులో ప్రమాద (థ్రెటెండ్) విభాగాల్లో పేర్కొన్న ఉదాహరణలు చాలా ముఖ్యం. ఎండేంజర్‌‌డ, క్రిటికల్లీ ఎన్‌డేంజర్‌‌డ, వల్నరబుల్ మొదలైన వర్గీకరణ భేదాలు, వాటి ఉదాహరణలు తెలుసుకోవాలి. అంతర్జాతీయ స్థాయిలో జీవ వైవిధ్య పరిరక్షణ కోసం ఏర్పాటైన సీబీడీ (CBD-Convention on Biological Diversity) దానికి అనుబంధంగా కుదిరిన కార్టాజీన (Cartagena), నగోయ ఒప్పందాల సమాచారం, హైదరాబాద్‌లో సీబీడీ సభ్య దేశాల 11వ సమావేశం, కాప్-11 (COP-11) నిర్ణయాలు, ఈ ఏడాది అక్టోబర్‌లో దక్షిణకొరియాలోని యాంగ్ చాంగ్ (Pyeongchan)లో జరిగే కాప్-12 (COP-12) లక్ష్యాలను చదవాలి. వీటికి అదనంగా భారత్‌లో పర్యావరణ చట్టాలు, కార్యక్రమాలు, జీవ వైవిధ్య సంరక్షణ చట్టం 2002, దాని లక్ష్యాలు, ఎన్‌బీఏ (National Biodiversity Authority NBA) లక్ష్యాలు, స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు, బయోడైవర్సిటీ మేనేజ్‌మెంట్ కమిటీల విధులు తెలుసుకోవాలి. 1972 నుంచి ఇప్పటివరకు అమల్లోకి వచ్చిన అన్ని అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు, కార్యక్రమాలు (స్టాక్‌హాం, మాంట్రియల్, రామ్సర్, బేకల్, బాన్, యునెస్కో) మొదలైనవి. దేశంలోని జాతీయ పార్కులు, అభయారణ్యాల గురించి (వాటిలో సంరక్షిస్తున్న ముఖ్యమైన జాతులు) సమాచారాన్ని చదువుకోవాలి.

ఏం చదవాలి?
జీవ వైవిధ్యం ఏమిటి? ఆ భావన అభివృద్ధి చెందిన తీరు? జీవ వైవిధ్య స్థాయిలు, రకాల గురించి తెలుసుకోవాలి. దేశంలోని ముఖ్యమైన మొక్కలు, జంతు జాతులు, ముఖ్యంగా ఎండమిక్ జాతులు, శాస్త్రీయ నామాలు, వాటి విస్తరణపై అవగాహన పెంచుకోవాలి. అంతేకాకుండా వైద్య, పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో వాటి ప్రయోజనాలను తెలుసుకోవాలి. పరిణామ సిద్ధాంతాల (Darwin, Lamarck, Hugode Vries)పై అవగాహన పెంచుకోవాలి. జీవ వైవిధ్య హాట్‌స్పాట్‌లు, ప్రపంచ వ్యాప్తంగా వాటి ప్రమాణాలు, దేశ వ్యాప్తంగా గుర్తించిన హాట్‌స్పాట్‌లు వాటి ప్రాధాన్యతను చదువుకోవాలి. అదే సమయంలో జీవ వైవిధ్యానికి ఏర్పడుతున్న ప్రమాదాలను తెలుసుకోవడం ముఖ్యం. తిమింగలాలు, డాల్ఫిన్‌లు, సొరచేపలు, ఖడ్గమృగం, పులి, బట్టమేక పక్షి, చింపాంజీ, ఉడుము, ఏనుగు, ఆసియా సింహం, దుప్పి జాతులు ఎదుర్కొంటున్న ప్రమాదాల గురించి అధ్యయనం చేయాలి. అంతేకాకుండా వాటి సంరక్షణ విధానాలు, ముఖ్యంగా ఇన్‌సిటు, ఎక్స్‌సిటు సంరక్షణ పద్ధతుల గురించి అవగాహన పెంచుకోవాలి.

ఈ క్రమంలో జన్యు బ్యాంకులు, క్షేత్ర జన్యు బ్యాంకులు (బొటానికల్ గార్డెన్‌‌స ఆర్బోరెటం), టిష్యూ కల్చర్, క్రయో ప్రిజర్వేషన్, జాతీయ పార్కులు, అభయారణ్యాలు, కన్జర్వేషన్ రిజర్వు, కమ్యూనిటీ రిజర్వులు, బయోస్ఫియర్ రిజర్వు (దాని భాగాలు) మొదలైన సంరక్షణ విధానాలు, వాటి మధ్య భేదాలు తెలుసుకోవాలి. అదనంగా ప్రాజెక్టు టైగర్, ప్రాజెక్టు ఎలిఫెంట్ మొదలైన కార్యక్రమాలపై సమాచారం తెలుసుకోవాలి.
Published date : 25 Jul 2014 10:30AM

Photo Stories