TS POLYCET 2022: బహుళ అవకాశాల.. పాలిటెక్నిక్
సాంకేతిక విద్యలో నైపుణ్యం సాధించి చిన్న వయసులోనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకోవాలనుకునే వారికి సరైన మార్గం.. పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు. ఉపాధి, ఉద్యోగం, ఉన్నత విద్య.. ఈ మూడింటికీ వీలు కల్పించే చదువు పాలిటెక్నిక్ డిప్లొమా! పాలిటెక్నిక్‌లో ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ పాలిసెట్ 2022 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నేపథ్యంలో..టీఎస్ పాలిసెట్ వివరాలు, పరీక్ష విధానంపై ప్రత్యేక కథనం...
- టీఎస్ పాలిసెట్ ప్రకటన విడుదల
- ఏప్రిల్ రెండో వారం నుంచి దరఖాస్తు ప్రక్రియ
- జూన్ 30న పరీక్ష
టీఎస్ పాలిసెట్
తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ పాలిసెట్)ను స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తోంది.ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించే పాలిసెట్ పరీక్షలో ర్యాంక్ ఆధారంగా రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
TS POLYCET - 2021 Question Paper With Key (Held on: 17.07.2021)
అర్హతలు
పదోతరగతి లేదా తత్సమాన విద్యను మ్యాథ్స్ ఒక సబ్జెక్టుగా కనీసం 35 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు పాలిసెట్ దరఖాస్తుకు అర్హులు.
పరీక్షా విధానం
- పాలిసెట్ పరీక్షను పెన్ అండ్ పేపర్(ఆఫ్‌లైన్) విధానంలో నిర్వహిస్తారు. మల్టిపుల్ ఛాయిస్ పద్ధతిలో 150 ప్రశ్నలుంటాయి. మొత్తం నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. మ్యాథ్స్–60, ఫిజిక్స్–30, కెమిస్ట్రీ–30, బయాలజీ నుంచి 30 చొప్పున ప్రశ్నలు వస్తాయి. రెండున్నర గంటలు పరీక్ష సమయం ఉంటుంది. పదోతరగతి స్థాయి సిలబస్ నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు చొప్పున కేటాయిస్తారు. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ విధానం అమలులో లేదు.
- ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (పీజేటీఎస్‌యూ), పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ, వీటి అనుబంధ సంస్థల్లో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారు మాత్రమే బయాలజీ ప్రశ్నలను సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది.
రెండు వేర్వేరు ర్యాంకులు
పాలిసెట్ ప్రవేశాలకు సంబంధించి ప్రతి అభ్యర్థికి రెండు వేర్వేరు ర్యాంకులను జనరేట్ చేస్తారు. టెక్నికల్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ డిప్లొమాగా ర్యాంకుల జాబితాను రూపొందించి ప్రవేశాలను కల్పిస్తారు.
పాలిటెక్నిక్ (టెక్నికల్)
ఇంజనీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే వారి మార్కులు విధానం 120గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్–60, ఫిజిక్స్–30,కెమిస్ట్రీ–30 గా ఉంటాయి.
అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ
అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ డిప్లొమా కోర్సులకు మార్కుల విధానం కూడా 120గా ఉంటుంది. ఇందులో మ్యాథ్స్–(60/2=30)–30, ఫిజిక్స్–30, కెమిస్ట్రీ–30, బయాలజీలో 30 మార్కులుగా ఉంటాయి.
ముఖ్యమైన సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేదీ: 04.06.2022
- పాలిసెట్ పరీక్ష తేదీ: 30.06.2022
- వెబ్‌సైట్: http://www.polycet.sbtet.telangana.gov.in
చదవండి: Polycet: ఐటీ, రోబోటిక్స్, కోడింగ్.. కొత్తగా ఐదు కోర్సులు!