Admissions in Sainik Schools: AISSEE నోటిఫికేషన్ విడుదల.. మంచి మార్కులకు మార్గమిదే
ఈ నేపథ్యంలో.. ఏఐఎస్‌ఎస్‌ఈఈ వివరాలు, ప్రవేశం లభించే సైనిక పాఠశాలలు, భవిష్యత్తు అవకాశాలు, ఎంట్రన్స్‌లో విజయానికి మార్గాలపై ప్రత్యేక కథనం..
- సైనిక్ స్కూల్స్‌లో 6, 9వ తరగతుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
- ఎంట్రన్స్ టెస్ట్‌లో ప్రతి ఆధారంగా అడ్మిషన్
- దేశవ్యాప్తంగా మొత్తం 52 సైనిక్ స్కూల్స్‌లో ప్రవేశాలు
- సీటు సొంతం చేసుకుంటే.. త్రివిధ దళాల్లో చేరే సన్నద్ధత
త్రివిధ దళాలైన ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్, నేవీలపై పాఠశాల స్థాయిలోనే ఆసక్తి కల్పించి.. వాటిల్లో చేరేలా సంసిద్ధులను చేసే ఉద్దేశంతో సైనిక్ స్కూల్స్‌ను ఏర్పాటు చేశారు. వీటి పర్యవేక్షణకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా సైనిక్ స్కూల్ సొసైటీని నెలకొల్పారు. ఈ స్కూల్స్ ఆరో తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యా బోధనతోపాటు విద్యార్థులకు ధైర్య సాహసాలు నూరిపోస్తూ త్రివిధ దళాల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నాయి.
మొత్తం 52 సైనిక పాఠశాలలు
- ప్రస్తుతం జాతీయ స్థాయిలో మొత్తం 52 సైనిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 33, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) విధానంలో మరో 19 ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని 33 సైనిక్ స్కూల్స్‌లో..ఆరో తరగతిలో 2,779 సీట్లు, తొమ్మిదో తరగతిలో 697 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పీపీపీ విధానంలో నెలకొల్పిన 19 సైనిక్ స్కూల్స్‌లో ఆరో తరగతిలో 2,256 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి సైనిక్ స్కూల్‌లో 10 సీట్లను మహిళా విద్యార్థులకు కేటాయించారు.
- తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో కోరుకొండ సైనిక్ స్కూల్ ఆరో తరగతిలో 78 సీట్లు, తొమ్మిదో తరగతిలో 22 సీట్లు, కలికిరిలో ఆరో తరగతిలో 105 సీట్లు, తొమ్మిదో తరగతిలో 10 సీట్లు ఉన్నాయి.
- పీపీపీ విధానంలో..శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో అదానీ వరల్డ్ స్కూల్‌లో ఆరో తరగతిలో 80 సీట్లు అందుబాటులో ఉన్నాయి. n ఏపీలోని సైనిక్ స్కూల్స్‌కు ఏపీ, తెలంగాణ విద్యార్థులు పోటీ పడొచ్చు.
చదవండి: APOSS: ఓపెన్ స్కూల్ ప్రవేశాలు.. చివరి తేదీ ఇదే!!
అర్హతలు
- ఆరో తరగతికి: మార్చి 31, 2024 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- తొమ్మిదో తరగతి: మార్చి 31, 2024 నాటికి 13 నుంచి 15 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- తొమ్మిదో తరగతిలో ప్రవేశ సమయానికి విద్యార్థులు ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
జాతీయ స్థాయి పరీక్ష
దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్స్‌లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశం కల్పించేందుకు.. జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా విద్యార్థులకు సీట్లు ఖరారు చేయనున్నారు. ఈ పరీక్షను.. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పేరుతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహిస్తుంది. ప్రవేశ పరీక్ష ఆరు, తొమ్మిది తరగతులకు వేర్వేరు విధానాల్లో ఉంటుంది.
ఆరో తరగతి పరీక్ష ఇలా
ఆరో తరగతిలో ప్రవేశానికి 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అవి.. లాంగ్వేజ్ 25 ప్రశ్నలు–50 మార్కులు, మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలు–150 మార్కులు, ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. మ్యాథమెటిక్స్ విభాగంలో ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు, మిగతా విభాగాల్లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ప్రవేశ పరీక్ష సమయం రెండున్నర గంటలు. ఆరో తరగతి ప్రవేశ పరీక్షను ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మళయాలం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు. అభ్యర్థులు తమకు నచ్చిన భాషలో పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల విద్యార్థులు తెలుగు, ఉర్దూ మీడియంలను ప్రాంతీయ భాషలుగా పేర్కొని పరీక్ష రాసే అవకాశముంది.
తొమ్మిదో తరగతి పరీక్ష
తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్షను మొత్తం నాలుగు వందల మార్కులకు అయిదు విభాగాల్లో నిర్వహిస్తారు. అవి.. మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలు–200 మార్కులు, ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలు–50 మార్కులు, ఇంగ్లిష్ 25 ప్రశ్నలు–50 మార్కులు, జనరల్ సైన్స్ 25 ప్రశ్నలు–50 మార్కులు, సోషల్ సైన్స్ 25 ప్రశ్నలు–50 మార్కులకు పరీక్ష ఉంటుంది. మ్యాథమెటిక్స్ విభాగంలో ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు, మిగతా విభాగాల్లో ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు కేటాయించారు. ఈ రెండు పరీక్షలు పెన్–పెన్సిల్ విధానంలోనే జరుగుతాయి. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్‌లో సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది. పరీక్ష సమయం మూడు గంటలు. తొమ్మిదో తరగతి ప్రవేశ పరీక్షను ఇంగ్లిష్ మాధ్యమంలోనే నిర్వహిస్తారు.
హోంస్టేట్ కోటా విధానం
సీట్ల భర్తీ చేసే విషయంలో.. హోంస్టేట్ కోటా విధానాన్ని అమలు చేస్తారు. సైనిక్ స్కూల్ ఏర్పాటైన రాష్ట్రానికి చెందిన విద్యార్థులకు సదరు పాఠశాలలో ఉన్న మొత్తం సీట్లలో 67 శాతం సీట్లను కేటాయిస్తారు. మిగతా 33 శాతం సీట్లను అదర్ స్టేట్ కోటా పేరుతో అన్ని రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. అదే విధంగా హోంస్టేట్, అదర్ స్టేట్ కోటాల్లో అందుబాటులో ఉండే సీట్లలో 25 శాతం సీట్లను త్రివిధ దళాల్లో విధులు నిర్వహిస్తున్న వారి పిల్లలకు కేటాయిస్తారు. పీపీపీ విధానంలోని స్కూల్స్‌లో మాత్రం 40 శాతం సీట్లను ఏఐఎస్‌ఎస్‌ఈఈలో ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు. మరో 60 శాతం సీట్లను ఇప్పటికే ఆయా పాఠాశాలల్లో చదువుతున్న విద్యార్థుల మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తారు.
మెరిట్ కొలమానం
ఏఐఎస్‌ఎస్‌ఈఈలో సాధించిన ప్రతిభ, విద్యార్థులు దరఖాస్తు సమయంలో పేర్కొన్న పాఠశాల ప్రాథమ్యం ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి సీట్లు ఖరారు చేస్తారు. ఆ తర్వాత దశలో విద్యార్థులు సదరు పాఠశాలలో నిర్దేశిత తేదీలోపు జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది.
చదవండి: 10th Class Free Study Material: టెన్త్ విద్యార్థులకు జగనన్న విద్యాజ్యోతి
మంచి మార్కులకు మార్గమిదే
- దరఖాస్తు చేసుకుంటున్న తరగతి ఆధారంగా అంతకు ముందు తరగతులకు సంబంధించి అకాడమీ పుస్తకాలు, ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను చదవడం లాభిస్తుంది.
- ఆరో తరగతి ప్రవేశ పరీక్ష అభ్యర్థులు ప్రధానంగా నాలుగు,అయిదు తరగతుల మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ పుస్తకాలను అధ్యయనం చేయాలి.
- తొమ్మిదో తరగతికి అయిదు నుంచి ఎనిమిది తరగతుల పుస్తకాలను ముఖ్యంగా మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్‌లను చదవాలి.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్‌కు సంబంధించి గ్రామర్‌పై పట్టు సాధించాలి. ముఖ్యంగా యాంటానిమ్స్, సినానిమ్స్, ఆర్టికల్స్, ప్రిపొజిషన్స్, వెర్బ్స్‌పై దృష్టి పెట్టాలి.
- జనరల్ సైన్స్‌కు సంబంధించి సైన్స్‌లోని ప్రాథమిక అంశాలు, మొక్కలు, బ్యాక్టీరియాలు, వ్యాధులు–కారకాలు తదితర అంశాలపై అవగాహన పెంచుకోవాలి.
- సోషల్ సైన్స్‌కు సంబంధించి పర్యావరణం, హిస్టరీ, జాగ్రఫీ అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. అదే విధంగా సివిక్స్‌కు సంబంధించిన ప్రాథమిక భావనలు తెలుసుకోవాలి. ఎకనామిక్స్‌లో జనాభా, జన గణన గణాంకాలు, పంటలు –ఉత్పత్తులు, అవి ఎక్కువగా పండే ప్రదేశాలు తదితర అంశాలపై అవగాహన ఏర్పరచుకోవాలి.
- జనరల్ నాలెడ్జ్‌కి సంబంధించి ముఖ్యమైన వ్యక్తులు, అవార్డులు–విజేతలు, ముఖ్యమైన ప్రదేశాలు, క్రీడలు–విజేతలు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతి వంటి పదవులు చేపట్టిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలి.
ముఖ్య సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తు చివరి తేదీ: డిసెంబర్ 16, 2023
- ఆన్‌లైన్ దరఖాస్తులో సవరణలు: డిసెంబర్ 18 – డిసెంబర్ 20, 2023
- ఏఐఎస్‌ఎస్‌ఈఈ పరీక్ష తేదీ: 2024, జనవరి 21
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ,విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్.
- పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://exams.nta.ac.in/AISSEE
Tags
- Sainik School
- Sainik School Admissions
- CBSE
- AISSEE
- All India Sainik School Entrance Examination
- Career Opportunities
- Army
- entrance test
- IndianAirForce
- latest admissions in 2023
- sakshi education latest admissions
- CBSESyllabus
- MilitarySchools
- AcademicYear2024_25
- EntranceExam
- CareerOpportunities
- EducationPreparation
- CompetitiveExams