Skip to main content

YSRUHS: వైద్య విద్య పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైద్య విద్య పీజీ కోర్సుల్లో ఇప్పటికే నిర్వహించిన కౌన్సెలింగ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. ప్రవేశాల ప్రక్రియను మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం నిర్ణయించింది.
YSRUHS
వైద్య విద్య పీజీ ప్రవేశాల కౌన్సెలింగ్‌ రద్దు

ఈ మేరకు ఇప్పటికే కన్వినర్, యాజమాన్య కోటా సీట్లకు తొలి దశలో నిర్వహించిన కౌన్సెలింగ్‌ను రద్దు చేసినట్టు ఆగ‌స్టు 31న‌ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్‌ రాధికారెడ్డి ఉత్తర్వులిచ్చారు. కర్నూలు జిల్లా శాంతిరామ్‌ వైద్య కళాశాలలోని పలు కోర్సుల్లో పీజీ సీట్ల పెంపుదలకు సంబంధించి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) పేరిట ఫేక్‌/ఫోర్జరీ అనుమతులు వెలువడ్డాయి.

ఈ అంశంపై ఎన్‌ఎంసీ ప్రకటన నేపథ్యంలో ఇప్పటివరకు నిర్వహించిన కౌన్సెలింగ్‌ను హెల్త్‌ యూనివర్సిటీ అధికారులు రద్దు చేశారు. ఫోర్జరీ అనుమతుల ఘటన వెలుగు చూడటంతో అప్రమత్తమైన అధికారులు మిగిలిన వైద్య కళాశాలల్లో పీజీ సీట్ల అనుమతులు సరిగా ఉన్నాయో, లేదో పరిశీలిస్తున్నారు. ఆయా కళాశాలలకు మంజూరైన సీట్లను, ఎన్‌ఎంసీ అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన సీట్లతో సబ్జెక్టుల వారీగా తనిఖీ చేస్తున్నారు.

చదవండి: MBBS Seats in AP : మరో 2550 ఎంబీబీఎస్‌ సీట్లు.. 3530 పోస్టులు.. ఇప్పటికే 5 కాలేజీల్లో..
ఈ నేపథ్యంలో జీఎస్‌ఎల్, శాంతిరామ్, మహారాజా కళాశాలల్లో అనుమతించిన పీజీ సీట్లకు, ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో చూపిస్తున్న సీట్ల సంఖ్య మధ్య వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించారు. దీంతో ఈ అంశంపై వివరణ కోరుతూ అధికారులు ఎన్‌ఎంసీకి లేఖ రాశారు. ఎన్‌ఎంసీ నుంచి పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చాక కొత్తగా సీట్‌ మ్యాట్రిక్స్‌ను రూపొందించనున్నారు. ఆ తర్వాత వెబ్‌ ఆప్షన్ల నమోదుకు నోటిఫికేషన్‌ ఇస్తామని రిజిస్ట్రార్ రాధికారెడ్డి తెలిపారు.

Published date : 01 Sep 2023 02:00PM

Photo Stories