Skip to main content

Department of Medical Health and Family: వెబ్‌ ఆప్షన్ల నిబంధనల్లో మార్పులు

మెడికల్‌ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించి వెబ్‌ ఆప్షన్లను ఇచ్చే ప్రక్రియలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్పులు చేసింది.
Department of Medical Health and Family
మెడికల్‌ సీట్లకు ఒకేసారి ఆప్షన్‌

వైద్య సీట్లకు దరఖాస్తు చేసుకునేవారు ఒకేసారి అన్ని కాలేజీలకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వాలన్న నిబంధనను తాజాగా ప్రవేశపెట్టింది. దీంతో రెండో విడత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉండదని స్పష్టం చేసింది. మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నిబంధనను తీసుకురావడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. గతేడాది వరకు కన్వీనర్‌ కోటా మెడికల్‌ సీట్ల భర్తీ ప్రక్రియలో విద్యార్థులకు ప్రతీ కౌన్సెలింగ్‌ సందర్భంగా కళాశాలలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛ ఉండేది. కాలేజీలు, పరిస్థితిని బట్టి ప్రాధాన్యక్రమంలో తమకు నచ్చిన కొన్ని కాలేజీలను ఎంపిక చేసుకునేవారు. అలా ఎంపిక చేసిన వాటిల్లో ఎందులో సీటవచ్చినా చేరాల్సిందే. అయితే తర్వాత జరిగే కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు, మళ్లీ ఆప్షన్లు పెట్టుకునేందుకు అనుమతి ఉండేది. దీంతో తమకు నచి్చన కాలేజీల్లో సీటు వచ్చే వరకు రెండు, మూడు, మాప్‌అప్‌ రౌండ్‌ కౌన్సెలింగ్‌ల వరకు కూడా దరఖాస్తు చేసుకునే, ఆప్షన్లు ఇచ్చుకునే వెసులుబాటు ఉండేది. దీనివల్ల ఇష్టమైన కాలేజీలో సీటు దక్కించుకునేవారు. కానీ 2022 నుంచి తీసుకురానున్న కొత్త నిబంధనతో విద్యార్థులకు చిక్కులు వస్తాయని వైద్య విద్య నిపుణులు అంటున్నారు. అన్ని కళాశాలలకు ఒకేసారి ఆప్షన్లు ఇవ్వాల్సి రావడంతో అవగాహన లేక ప్రాధాన్యాలను సరిగా ఇచ్చుకునే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. ఒకవేళ ప్రైవేట్‌ కాలేజీలో కన్వినర్‌ కోటా సీటు వస్తే, చేరాక మరో కౌన్సెలింగ్‌లో ఇతర కాలేజీలో సీటు వస్తే చెల్లించిన ఫీజును తిరిగి వెనక్కిస్తారా లేదా అన్న అనుమానాలు ఉన్నాయి. 

తదుపరి కౌన్సెలింగ్‌ల్లోనూ ప్రాధాన్యం ప్రకారం సీటు

ఉదాహరణకు ఒక విద్యార్థికి తానిచ్చిన ప్రాధాన్యంలోని పదో కాలేజీలో మొదటి కౌన్సెలింగ్‌లో సీటు వచ్చిందని అనుకుందాం. అతను ఆ కాలేజీలో తప్పక చేరాల్సిందే. తర్వాత కౌన్సెలింగ్‌కు దరఖాస్తు చేయకున్నా, తన ప్రాధాన్యంలోని పై తొమ్మిది కాలేజీల్లో ఎందులోనైనా సీటు వచ్చే అవకాశముంటే కేటాయిస్తారు. అప్పుడు చేరకుంటే, మూడో కౌన్సెలింగ్‌లో మళ్లీ ప్రాధాన్యంలోని పై కాలేజీల్లో కేటాయిస్తారు. కాబట్టి దీనివల్ల విద్యార్థులకు నష్టం ఉండదు. కానీ కొత్త మార్పులపై విద్యార్థులకు అవగాహన లేకపోవడంతో ప్రాధాన్యాల్లో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

చదవండి: 

Covid: విద్యా సంవత్సరం కుదింపు

ఇన్ సర్వీస్ అభ్యర్థుల దరఖాస్తుకు అవకాశం

తప్పనిసరి బదిలీ లిస్టులో 1,300 మంది ఉద్యోగులు

Published date : 10 Feb 2022 05:35PM

Photo Stories