Skip to main content

NEET Exam Row: నీట్‌ కాంట్రవర్సీ.. మరోసారి పరీక్ష నిర్వహించాల్సిందేనా? దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష అవసరమా?

NEET Exam Row

వైద్య విద్యను అభ్యసించాలని లక్షలాదిమంది విద్యార్థులు దేశవ్యాప్తంగా రాసిన ‘నీట్‌’ పరీక్ష నిర్వహణలో అనేక అవకతవకలు జరగడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర వేదనలో మునిగిపోయారు. అసలు దేశం మొత్తానికీ ఒకే ప్రవేశపరీక్ష పెట్టడమనే విధానమే తప్పని ఈ సందర్భంగా విమర్శలు వస్తున్నాయి.

మొదటిసారిగా 2010లో భారతీయ వైద్య మండలి ‘నీట్‌’ పరీక్షకు ప్రకటన విడుదల చేసింది. కానీ ఈ పరీక్ష నిర్వహణ సరికాదని న్యాయస్థానం అడ్డుకుంది. దీంతో  భారతీయ వైద్య మండలి చట్టం– 1956లో మార్పులు చేసి, ‘సెక్షన్‌ 10 ఈ’ ద్వారా ‘నీట్‌’ పరీక్ష నిర్వహించటానికి వైద్య మండలికి సర్వ హక్కులు కల్పించింది నాటి ఎన్డీఏ ప్రభుత్వం.

NEET PG 2024 Exam: నీట్‌ పీజీ పరీక్ష ఖరారు.. లీకేజీ దెబ్బకు రెండుగంటల ముందే క్వశ్చన్‌ పేపర్‌ తయారు

తత్ఫలితంగా 2016 నుండి పరీక్షను నిర్వహిస్తూ వస్తున్నారు. 2016లో ఈ మార్పును వ్యతిరేకిస్తూ వేసిన కేసును కొట్టి వేయటమే కాక, రాష్ట్ర ప్రభుత్వాలు నీట్‌కు ప్రత్యామ్నాయంగా తాము పరీక్షలు నిర్వహిస్తామంటే కుదరదు అన్నది న్యాయస్థానం. 2020లో మైనారిటీ సంస్థల గోడు కూడా వినకుండా కోర్టు నీట్‌ నిర్వహణను గట్టిగా సమర్థించింది.

నీట్‌ పరీక్ష నిర్వహణ వల్ల లాభాలు లేకపోలేదు. అప్పటి దాకా రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు విశ్వ విద్యాలయాలు తమ సొంత ప్రవేశ పరీక్షల ద్వారా విద్యార్థులకు వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తూ వచ్చాయి. అనేక పరీక్షలు రాయలేక విదార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు కూడా పాల్పడిన సందర్బాలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా ఒకే పరీక్ష వల్ల ఈ ఒత్తిడి తగ్గింది. కాని పొరపాటున ఈ పరీక్ష రాయలేక పోతే విద్యార్థి ఒక విద్యా సంవత్సరం అంతా నష్ట పోవలసిందే.

Dress Code For Students: టీషర్ట్స్‌, చిరిగిన జీన్స్‌తో రావొద్దు.. విద్యార్థులకు కళాశాల ఆదేశాలు

అదే విధంగా విద్యార్థికి ఇష్టమైన కాలేజీలలో ప్రవేశం పొందలేక పోవచ్చు. రెండు మూడు పరీక్షలుంటే, తనకిష్టమైన కాలేజీలో చేరే అవకాశం ఉండేది. అందుకే ఇటువంటి దేశ వ్యాప్త ఏక పరీక్షలపై విస్తృత స్థాయిలో మేధామథనం జరగాలని అంటున్నారు.

ఒకే ఒక్క పరీక్ష ద్వారా విద్యార్ధి యోగ్యుడా కాదా అనేది నిర్ణయించటం సరైనదేనా? వందల కోట్ల జనాభా ఉన్న భారత దేశం లాంటి దేశంలో ఇంతకన్నా మార్గం లేదని వాదించే వారున్నారు. కోర్టులు, ప్రభుత్వాలు సైతం అర్హత కలవారిని ఎంపిక చెయ్యటానికి ‘నీట్‌’ పరీక్ష ఉత్తమ పద్ధతి అని అనుకుంటున్నాయి.

IT Company To Recruit 8000 Employees: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌.. ఒక్క కంపెనీలోనే త్వరలో 8 వేల మందికి ఉద్యోగాలు!

నిజానికి నీట్‌ పరీక్ష నిర్వహణ వల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులు బాగా నష్ట పోతున్నారు. ఇంగ్లీషు మీడియంలో చదివిన విద్యార్థులదే నీట్‌లో పైచేయిగా ఉంటోంది.  సీట్లు పొందడంలో వీరి శాతం 85.12 శాతం నుండి 95.01 శాతానికి పెరగగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదివే వారి సంఖ్య 1.2 శాతం నుండి 0.6 శాతానికి పడిపోయింది. పేద, దిగువ మధ్యతరగతి వర్గాలవారు 47.42 శాతం నుండి 41.05 శాతానికి పడిపోగా, గ్రామీణ ప్రాంత విద్యార్థులు 61.4  శాతం నుండి 50.8 శాతానికి పడిపోయారు.


ఇన్ని లోపాలు, నష్టాలను దృష్టిలో పెట్టుకొని... మరొక్క సారి నీట్‌ పరీక్ష నిర్వహణ సబబేనా అన్న అంశంపై విస్తృత స్థాయిలో చర్చించాల్చిన అవసరం ఎంతైనా వుంది. 
– ఈదర శ్రీనివాసరెడ్డి,
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌

Published date : 04 Jul 2024 09:08AM

Photo Stories