Skip to main content

ఈ విద్యార్థులకు విశాఖలో నీట్, జేఈఈ శిక్షణ కేంద్రం

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ విద్యార్థులకు నీట్, జేఈఈ శిక్షణ ఇచ్చేందుకు విశాఖ జిల్లా మధురవాడలో మరో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు.
ఈ విద్యార్థులకు విశాఖలో నీట్, జేఈఈ శిక్షణ కేంద్రం
ఈ విద్యార్థులకు విశాఖలో నీట్, జేఈఈ శిక్షణ కేంద్రం

ఎస్సీ గురుకుల విద్యార్థులు పదోతరగతి, ఇంటర్‌ పరీక్షల్లో మరింత మెరుగైన ఫలితాలను సాధించేందుకు వీలుగా 56 అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో మే 23న‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఎస్సీ గురుకుల విద్యాలయాల సంస్థ జిల్లా కో ఆర్డినేటర్ల (డీసీవోల)తో నిర్వహించిన  సమీక్ష  సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎస్సీ బాలుర కోసం అడవి తక్కెళ్లపాడు (గుంటూరు జిల్లా), చిన్నటేకూరు (కర్నూలు జిల్లా), బాలికల కోసం ఈడుపుగల్లు (కృష్ణాజిల్లా)లో నీట్, జేఈఈ శిక్షణ కేంద్రాలున్నాయని తెలిపారు. ఈ కేంద్రాలకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని బాలికల కోసం మరో శిక్షణ కేంద్రాన్ని మధురవాడలో ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ కేంద్రంలో 160 మంది బాలికలకు శిక్షణ ఇస్తామన్నారు. ఎస్సీ గురుకులాలు పదో తరగతి, ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో రాష్ట్ర సగటును మించి ఫలితాలు సాధించాయని చెప్పారు. ఇంటర్మీడియట్‌లో ఉత్తీర్ణత సాధించలేకపోయిన విద్యార్థుల్లో 1,400 మంది సింగిల్‌ సబ్జెక్ట్‌లో తప్పారని తెలిపారు. వీరంతా ఉత్తీర్ణులయ్యేలా రాష్ట్రవ్యాప్తంగా 56 అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సింగిల్‌ సబ్జెక్ట్‌లో తప్పినవారంతా ఉత్తీర్ణులైతే ఇంటర్‌ పాస్‌ ఫలితాలు 80 శాతం దాటిపోతాయని పేర్కొన్నారు. డీసీవోలు తమ జిల్లాల పరిధిలో తక్కువ ఫలితాలు వచ్చిన పాఠశాలలకు వెళ్లి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని ఆదేశించారు. గురుకులాల్లో విద్యార్థుల రోజువారీ హాజరును ప్రతిబింబిస్తూ డైలీ సిట్యుయేషన్‌ రిపోర్ట్‌ (డీఎస్‌ఆర్‌)ను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచాలన్నారు. తద్వారా విద్యార్థులు అనుమతి లేకుండా బయటికి వెళ్లి ప్రమాదాల బారినపడే అవకాశం లేకుండా చూడాలని కోరారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు అందించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.  

అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం 

గురుకులాల్లో అడ్మిషన్ల ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించామని అధికారులు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 
గురుకులాల్లో 5వ తరగతిలో 14,940 సీట్లు ఉన్నాయని, తొలివిడతగా 13,881 మందిని ఎంపిక చేశామని 
తెలిపారు. జూనియర్‌ ఇంటర్‌లో 13,520 సీట్లు ఉన్నాయని, వీటిలో 13,180 సీట్లకు తొలి విడతలోనే విద్యార్థులను ఎంపిక చేశామని చెప్పారు. 5 నుంచి 9వ తరగతిలో మిగిలిపోయిన మరో 1,450 సీట్లను కూడా ఆయా 
జిల్లాల స్థాయిలోనే భర్తీచేస్తామని వారు తెలిపారు. గురుకులాల్లో ఒక్క సీటు కూడా ఖాళీగా మిగలకుండా చూసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఆర్‌.పావనమూర్తి, సంయుక్త కార్యదర్శి శివరావు, ఏఎంవో ఎన్‌.
సంజీవరావు తదితరులు పాల్గొన్నారు.

Published date : 24 May 2023 06:22PM

Photo Stories