MBBS and BDS Admissions 2023 : ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి షెడ్యూల్ ఇదే.. ముఖ్యమైన తేదీలు ఇవే..
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మెడికల్, డెంటల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను అఖిల భారత కోటా కింద భర్తీ చేయనున్నారు. కాలేజీలు, సీట్ల వివరాలను జూలై 20వ తేదీన ఎంసీసీ, ఎన్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని, అదే రోజున ఉదయం పది గంటల నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.
ముఖ్యమైన తేదీలు ఇవే..
జూలై 22వ తేదీ నుంచి 26వ తేదీ వరకూ వెబ్ ఆప్షన్ల నమోదుకు గడువు ఇవ్వనున్నట్టు తెలిపింది. జూలై 29వ తేదీన సీట్ల కేటాయింపు జాబితా విడుదల చేస్తారు. ఆగస్టు నాలుగో తేదీ నాటికి కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ఆగస్టు 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకూ రెండో దశ, ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 18వ తేదీ వరకూ మూడో దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని స్పష్టం చేసింది. మూడో దశలో మిగిలిన సీట్లకు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి స్ట్రే వెకెన్సీ రౌండ్ కౌన్సెలింగ్ నిర్వహిస్తామని వెల్లడించింది.
☛ Medical Students: ఎంబీబీఎస్ స్టూడెంట్స్‌కు గుడ్‌న్యూస్...ఇకపై సీట్లన్నీ స్థానికులకే... ఎక్కడంటే
అఖిల భారత కోటా కౌన్సెలింగ్‌లో మాత్రం..
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లలో 15 శాతం అఖిల భారత కోటా కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. ఈ సీట్లలో జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చేరతారు. కాగా, ఈసారి ఎంబీబీఎస్ కౌన్సెలింగ్‌ను మార్పు చేయాలని జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) భావించింది. ఆ ప్రకారం అఖిల భారత స్థాయి కౌన్సెలింగ్, రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌ను ఒకేసారి ప్రారంభించాలని నిర్ణయించింది.
☛ NEET Ranks: నీట్‌లో రాష్ట్రం నుంచి 44,629 మందికి ర్యాంకులు.. టాప్ 10 ర్యాంకర్లు వీరే..
కానీ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈసారి కొత్త విధానంలో కాకుండా పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. అంటే అఖిల భారత కౌన్సెలింగ్ తర్వాతే రాష్ట్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఆ మేరకు జాతీయ, రాష్ట్రస్థాయి కౌన్సెలింగ్‌లు వేర్వేరు తేదీల్లో కొనసాగుతాయి. అయితే రాష్ట్రాల కౌన్సెలింగ్ ఎప్పుడు ప్రారంభించాలన్న దానిపై ఎన్‌ఎంసీ ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకటించలేదు.