Skip to main content

వర్సిటీలకు ఇన్‌చార్జి వీసీలుగా ఐఏఎస్‌లా? : టీఎస్ హైకోర్టు

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని యూనివర్సిటీలకు ఇన్‌చార్జి వైస్ చాన్స్‌లర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించాలని ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చిన ఆఫీస్ నోట్‌ను సవాల్ చేసిన కేసులో హైకోర్టు స్పందించింది.
ప్రతివాదులు తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ఆదేశించింది. గతేడాది జూలై 24న సీఎంవో ఇచ్చిన నోట్‌ను సవాల్ చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈమేరకు ఫిబ్రవరి 11 (సోమవారం)నప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. యూనివర్సిటీలకు ఇన్‌చార్జి వీసీలుగా ఐఏఎస్‌లను నియమించాలని సీఎంవో తీసుకున్న నిర్ణయం చట్ట వ్యతిరేకమైందని ప్రకటించాలని కోరుతూ ఉస్మానియా యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎస్.కరుణాకర్‌రెడ్డి దాఖలు చేసిన పిల్‌ను సోమవారం హైకోర్టు మరోసారి విచారించింది. యూజీసీ రెగ్యులేషన్స్-2010లోని సెక్షన్ 7.3.0 (1) ప్రకారం అన్ని యూనివర్సిటీలకు శాశ్వత ప్రాతిపదికపై వీసీలను నియమించాలని, కార్యనిర్వాహక కౌన్సిళ్లను కూడా ఏర్పాటుకు ఉత్తర్వులివ్వాలని ఆయన పిల్‌లో కోరారు. శాశ్వత ప్రాతిపదికపై నియామకాలు చేసే వరకూ సీనియర్ ఫ్యాకల్టీలను ఇన్‌చార్జి వీసీలుగా నియమించాలని కూడా అన్నారు.
Published date : 11 Feb 2020 01:19PM

Photo Stories