Skip to main content

విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దడమే మా లక్ష్యం...

సాక్షి, అమరావతి: విసృ్తత ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకునే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న విధానపరమైన నిర్ణయానికి తల్లిదండ్రుల నుంచి అత్యద్భుత స్పందన వచ్చిందని తెలిపింది. బలవంతంగా ఇంగ్లిష్ మీడియం రుద్దడం తమ ఉద్దేశం కాదని, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా విద్యార్థులను తీర్చిదిద్దడమే లక్ష్యమని వివరించింది. ఒకదశ దాటిన తరువాత ఇంగ్లీష్ మీడియంలోకి మారడం విద్యార్థికి కష్టతరంగా ఉంటుందని, ప్రాథమిక దశలోనే ఆంగ్లంలో చదవడం వల్ల ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఆస్కారం ఉంటుందని పేర్కొంది. ఇదే విషయాన్ని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేస్తున్నాయని నివేదించింది. ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెడుతూ జారీచేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. న్యాయస్థానం ఆదేశాల మేరకు పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ దీనిపై కౌంటర్ దాఖలు చేశారు.

అందులోని ముఖ్యాంశాలు ఇవీ..
తెలుగును తప్పనిసరి చేశాం...
‘‘తెలుగు భాష ఎంతో గొప్పది. అందుకే 1 నుంచి 10వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి పాఠ్యాంశంగా చేస్తూ.. జనవరి నెలలో జీవో కూడా జారీ చేశాం. తెలుగు లేదా విద్యార్థుల మాతృభాషను తప్పనిసరిగా ఓ సబ్జెక్టుగా బోధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ దిశగా పాఠ్య పుస్తకాలను రీ డిజైన్ చేస్తున్నాం. ఇంగ్లిషు మీడియంలో చదవడం వల్ల బలహీన వర్గాల ఆర్థిక స్థితిలో మార్పు వస్తుంది. సామాజిక సమానత్వం సాధ్యమవుతుంది. రాష్ట్రంలో అక్షరాస్యత 67 శాతం మాత్రమే. ఇది జాతీయ సగటు కంటే తక్కువ. పాఠశాలల్లో విద్యార్థుల చేరికను పెంచేందుకు అమ్మఒడి పథకం ద్వారా ఏటా రూ.15 వేలు ఆర్థిక సాయంగా అందచేసి తల్లిదండ్రులను ప్రోత్సహిస్తున్నాం. గ్రామీణ విద్యార్థులు మరో మార్గం లేక తెలుగు మీడియంలోనే చదువులు కొనసాగిస్తున్నారు. ఈ పరిస్థితిని మార్చాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని కోరారు. వారి అభ్యర్థన మేరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తెచ్చాం.

అత్యధికులు ఎస్సీ, ఎస్టీ, బీసీలు, బాలికలే...
రాష్ట్రంలో మొత్తం 71.79 లక్షల మంది విద్యార్థుల్లో 32.27 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్నారు. గతేడాది సెప్టెంబర్ 30 నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంలో చదువుతున్న విద్యార్థుల సంఖ్య 23.39 లక్షలు. వీరిలో 21.30 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులే ఉన్నారు. ప్రభుత్వ తెలుగు మీడియం స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల్లో 50.62 శాతం మంది బాలికలే. అత్యధికంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల విద్యార్థులతోపాటు బాలికలే తెలుగు మీడియంలో చదువుతున్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 10వ తరగతిలో ప్రభుత్వ తెలుగు మీడియం పాఠశాలలతో పోలిస్తే ఇంగ్లిష్ మీడియం స్కూళ్ల ఫలితాలు మెరుగ్గా ఉన్నాయి.

మండలానికో తెలుగు పాఠశాల..
విద్యార్థులు తెలుగు మీడియంలో చదువుకోవాలనుకుంటే మండల స్థాయిలో ఓ పాఠశాలను ఏర్పాటు చేసి తగిన మౌలిక సదుపాయాలు, బోధనా సిబ్బందిని సమకూరుస్తాం. ఒకవేళ పాఠశాల సమీపంలో లేకుంటే ఉచిత రవాణా సదుపాయం కల్పిస్తాం. బోధనా మాధ్యమం మాతృభాషలోనే తప్పనిసరిగా ఉండాలని విద్యా హక్కు చట్టం చెబుతోందన్న పిటిషనర్ల వాదనలో వాస్తవం లేదు. ‘వీలైనంత వరకు’ మాతృభాషలో ఉండాలని మాత్రమే నిబంధనలు చెబుతున్నాయి. అంతిమంగా ఏ మాధ్యమం ఉండాలనే ఐచ్ఛికం ప్రభుత్వానికి ఉంది. అందువల్లే రాష్ట్రంలోని 14 నవోదయ, 31 కేంద్రీయ విద్యాలయాల్లో ఇంగ్లీష్‌ను బోధనా మాధ్యమంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

ముద్రణ, శిక్షణకు అనుమతించాలి..
2020-21 విద్యా సంవత్సరంలో 1 నుంచి 6వ తరగతుల్లో 26 లక్షల మంది విద్యార్థులు చేరనున్నారు. వారికి సకాలంలో పాఠ్య పుస్తకాలు అందచేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఫిబ్రవరి నెలాఖారు కల్లా పాఠ్య పుస్తకాలను ముద్రణకు పంపకుంటే జూన్ నాటికి సిద్ధం కావు. అందువల్ల పాఠ్య పుస్తకాల ముద్రణ, ఉపాధ్యాయుల శిక్షణకు అనుమతించాలి. లేదంటే అది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఇంగ్లీష్ మీడియంపై దాఖలైన వ్యాజ్యాలను కొట్టి వేయాలని అభ్యర్థిస్తున్నాం’
Published date : 06 Feb 2020 04:04PM

Photo Stories