విద్యార్థులకు లేని ఇబ్బంది మీకేంటి?
Sakshi Education
సాక్షి, అమరావతి: ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు 2019–20 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేదంటూ ఓ పత్రికా విలేకరి పిల్ దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది.
విద్యార్థులకు లేని ఇబ్బంది మీకెందుకని ప్రశ్నించింది. ఇందులో మీకున్న ప్రయోజనాలు ఏమిటంటూ నిలదీసింది. తమకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందలేదని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తే వారే కోర్టుకు రావచ్చునంది. కోర్టును ఆశ్రయించవచ్చన్న పరిజ్ఞానం వారికి ఉందని వ్యాఖ్యానించింది. ఈ వ్యాజ్యంపై పునరాలోచించాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ చేశారో లేదో తెలుసుకుని చెప్పాలని ప్రభుత్వ న్యాయవాదికి సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులిచ్చింది. 2019–20కి విద్యార్థులకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చేయలేదంటూ గుంటూరుకు చెందిన విలేకరి పఠాన్ హుస్సేన్‌ఖాన్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ప్రభావితం అవుతున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కాకుండా మీరెందుకు ఈ పిల్ దాఖలు చేశారని పిటిషనర్‌ను ధర్మాసనం ప్రశ్నించింది. 5 వేలమంది విద్యార్థుల తరఫున ఈ వ్యాజ్యం దాఖలు చేశామని పిటిషనర్ న్యాయవాది డీఎస్‌ఎన్వీ ప్రసాద్‌బాబు తెలిపారు. ఎవరు పడితే వాళ్లు పిల్ పేరుతో పిటిషన్లు వేస్తుంటే తాము ఎందుకు విచారించాలని ప్రశ్నించింది.
Published date : 19 Jun 2021 02:50PM