విద్యార్థుల ముంగిట్లో ‘విద్యా వారధి’ మొబైల్ స్కూల్ పాఠాలు..!
Sakshi Education
సాక్షి, అమరావతి: కరోనా మహమ్మారి విద్యావ్యవస్థ ప్రణాళిక మొత్తాన్ని ఛిన్నాభిన్నం చేసిందని, ఆ లోటు తీరుస్తూ విద్యార్థులను చదువు వైపు మొగ్గు చూపేలా ప్రభుత్వం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడుతోందని విద్యాశాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు.
శుక్రవారం సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్‌సీఈఆర్టీ), రాష్ట్ర విద్యా పరిపాలన శిక్షణా సంస్థ (సీమ్యాట్) సంయుక్తంగా రూపకల్పన చేసిన విద్యావారధి వాహనాలను ఆయన ప్రారంభించారు. పాఠశాల విద్య ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, ఆంగ్ల మాధ్యమ ప్రత్యేక అధికారి కె. వెట్రిసెలి్వ, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ డా.బి.ప్రతాప్ రెడ్డి, సీమ్యాట్ డైరెక్టర్ వీఎన్ మస్తానయ్య, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ ఆర్ మధుసూదనరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మాట్లాడారు. కోవిడ్ నేపథ్యంలో విద్యాసంస్థలు తెరవలేని పరిస్థితి ఉన్నందున విద్యా సంవత్సరాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో భాగంగా ప్రభుత్వం ఆన్‌లైన్, డిజిటల్, మొబైల్ వాహనాల రూపకల్పన చేసిందన్నారు. పాఠశాలలు పున:ప్రారంభమయ్యేంతవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశాలు విద్యావారధి మొబైల్ వ్యాను టీవీ తెరల ద్వారా బోధిస్తారని తెలిపారు.
Published date : 01 Aug 2020 04:11PM