విద్యా వ్యాపారమైపోతుంది.. అందుకే ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ రద్దు?
ఇంటర్ చదువుకు ప్రాధాన్యం పెంచడంతో పాటు ప్రభుత్వ కాలేజీల్లోని విద్యార్థులకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఈ విధానాన్ని 2008లో అమల్లోకి తీసుకురాగా నాటి నుంచి కార్పొ రేట్ కాలేజీలు దీన్ని అనుకూలంగా మార్చుకున్నాయన్న ఆరోపణలు వెల్లు వెత్తుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఇంటర్ ప్రాక్టికల్స్‌లో తమ విద్యార్థుల సామ ర్థ్యం మేరకు మార్కులు వేస్తుండగా కార్పొరేట్ కాలేజీలు మాత్రం తమ విద్యార్థులకు అక్రమంగా 120కి 120 మార్కులు వేసుకొని ఎంసెట్‌లో టాప్ ర్యాంకులు కొల్లగొడుతూ విద్యా వ్యాపారం సాగిస్తున్నాయన్న వాదన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వెయిటేజీ విధానాన్ని రద్దు చేసే యోచనలో ప్రభుత్వ వర్గాలు పడ్డాయి. 2014లో రాష్ట్ర విభజన సమయంలోనే ఈ మేరకు కసరత్తు జరిగినప్పటికీ అప్పట్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు. విభజన చట్టం ప్రకారం ఈ అంశం తెలం గాణ, ఏపీ ఉమ్మడి ప్రవేశాల విధానంతో ముడిపడి ఉన్నందు వల్ల ఎలా ముందుకు సాగాలన్న దానిపై ఆంధ్రప్రదేశ్‌తోనూ చర్చించాల్సి వస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే అదేమీ సమస్య కాబోదని, ప్రభుత్వం తలచుకుంటే సులభమేనని అధికారులు చెబుతున్నారు.
వెయిటేజీ ఎందుకు వచ్చిందంటే..
రాష్ట్రంలో ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం 1983లో ఎంసెట్‌ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. కొన్నాళ్లు అది బాగానే ఉన్నా కార్పొరేట్ కాలేజీలు ఇంటర్ కంటే ఎంసెట్ శిక్షణకు ప్రాధాన్యాన్ని పెంచాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు సమస్యలు మొదలయ్యాయి. జూనియర్ కాలేజీలు రెండుగా విడిపోయాయి. ప్రభుత్వ కాలేజీలు కేవలం ఇంటర్ చదువుకే ప్రాధాన్యం ఇవ్వగా కార్పొరేట్ కాలేజీలు సీట్ల కోసం ఎంసెట్‌కు ప్రాధాన్యం పెంచుతూ పోయాయి. దీంతో ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులకు ఎంసెట్ వంటి శిక్షణ లేక ఎంసెట్‌లో వెనుకబడిపోవడం, కార్పొరేట్ కాలేజీలు ప్రత్యేక శిక్షణల పేరుతో ముందుకు సాగడంతో ఇంటర్ విద్య నిర్లక్ష్యానికి గురైంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న అంశంపై అప్పట్లో ప్రభుత్వం ప్రొఫెసర్ దయారత్నం కమిటీని నియమించింది.
అమలుకు నోచుకోని మిగతా సిఫారసులు..
ప్రొఫెసర్ దయారత్నం కమిటీ ఇంటర్ విద్యపై అనేక కోణాల్లో అధ్యయనం చేసి 12 ప్రధాన అంశాలపై సిఫారసులు చేసింది. అందులో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం ప్రధాన అంశంగా పేర్కొంది. దాంతోపాటు ఎంసెట్ ప్రాధాన్యాన్ని తగ్గించి ఇంటర్ ప్రాధాన్యాన్ని పెంచేలా సిఫారసులు చేసింది. భవిష్యత్తులో ఎంసెట్ అవసరమే లేకుండా ఇంటర్ మార్కుల ఆధారంగానే ప్రవేశాలు చేపట్టేలా సిఫారసు చేసింది. అందులో భాగంగా ఎంసెట్ ర్యాంకుల ఖరారులో మొదటి ఏడాది ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజీ (ఎంసెట్ మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇచ్చి ర్యాంకులు ఖరారు చేసేలా) ఇవ్వాలని సూచించింది. ఆ తరువాత సంవత్సరాల్లో ఏటా ఇంటర్ వెయిటేజీని 50 శాతం, 75 శాతం ఇచ్చేలా, చివరకు 100 శాతం ఇంటర్ మార్కులతోనే ప్రవేశాలు చేపట్టేలా సిఫారసు చేసింది. ఇంటర్ మార్కులకు ప్రాధాన్యం పెంచిన నేపథ్యంలో కార్పొరేట్ కాలేజీలు ఇష్టానుసారంగా ప్రాక్టికల్స్‌లో మార్కులు వేసుకోకుండా చూసేలా మరో సిఫారసు చేసింది. అందుకే ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం అమలు చేయాలని స్పష్టం చేసింది. అయితే ఆ సిఫారసుల్లో 25 శాతం వెయిటేజీని 2008లో అమల్లోకి తెచ్చారు. ఆ తరువాత కాలంలో మిగతా సిఫారసులను అమలు చేయాల్సి ఉన్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదు.
నష్టపోతున్న ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు...
ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ లేకపోవడం, ఇంటర్ మార్కులకు ఎంసెట్‌లో వెయిటేజీ వల్ల ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేటు కాలేజీల విద్యార్థులకు కూడా నష్టం తప్పట్లేదు. ఆయా కాలేజీల్లో చదివే విద్యార్థులకు ప్రాక్టికల్స్‌లో ఎక్కువ మార్కులు వేయట్లేదు. నాలుగు సబ్జెక్టులకుగాను ప్రాక్టికల్ మార్కులు ఒక్కో దాంట్లో 30 చొప్పున 120 ఉన్నాయి. గ్రామీణ ప్రాంత ప్రైవేటు కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల్లో చదివే దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు ఆయా కాలేజీల ఫ్యాకల్టీ... విద్యార్థులకు వచ్చిన మేరకే మార్కులను వేస్తున్నారు. మరోవైపు ప్రాక్టికల్స్‌లో జంబ్లింగ్ విధానం లేకపోవడంతో కార్పొరేట్ కాలేజీలు తమ విద్యార్థుల్లో ఎక్కువ మందికి 120కి 120 మార్కులను వేసుకుంటున్నాయి. దీంతో కార్పొరేట్ కాలేజీల విద్యార్థులకు ప్రాక్టికల్ మార్కులు స్కోరింగ్‌కు బాగా ఉపయోగపడి మంచి ర్యాంకులు వస్తుండగా, ఇవేవీ లేని ప్రభుత్వ కాలేజీల విద్యార్థులు ఎంసెట్ ర్యాంకుల్లో వెనుకబడిపోతున్నారు. పైగా ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్ల నియామకం లేక కొందరు రెగ్యులర్ లెక్చరర్లు, మరికొందరు కాంట్రాక్టు లెక్చరర్లతో నెట్టుకొట్టుస్తుండటం, ఎంసెట్ కోసం ప్రత్యేక శిక్షణ లేకపోవడంతో ప్రభుత్వ కాలేజీల విద్యార్థులకు ఎంసెట్ ర్యాంకుల్లో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీనిపై 2012లో అప్పటి ఎమ్మెల్సీ పాలడుగు వెంకట్రావు నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన అసెంబ్లీ కమిటీ కూడా ఇంటర్ మార్కుల వెయిటేజీ రద్దుకే సిఫారసు చేసింది. 2014లో రాష్ట్ర విభజన తరువాత దీనిపై చర్చ జరిగినా ఆచరణకు నోచుకోలేదు. తాజాగా మళ్లీ ఈ అంశంపై మళ్లీ ఆలోచనలు మొదలయ్యాయి.
ప్రభుత్వ కాలేజీల విద్యార్థులపై ఒత్తిడి...
ప్రభుత్వ కాలేజీల్లో ఎంసెట్ శిక్షణపై ప్రత్యేక విధానం ఏమీ లేదు. పైగా ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సరిపడా లెక్చరర్లు లేరు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ కాలేజీలు, గ్రామీణప్రాంత కాలేజీల్లో చదివే విద్యార్థులపై ఒత్తిడి పెరుగుతోంది. ఇంటర్‌తోపాటు ఎంసెట్ శిక్షణ తీసుకోలేని విద్యార్థులు నష్టపోతున్నారు.
- డాక్టర్ పి. మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు
రద్దు చేయడమే మంచిది
ఇంటర్‌లో ప్రాక్టికల్స్ మార్కుల విధానంపై అనుమానాలు ఉన్నాయి. అందువల్ల ఎంసెట్ ర్యాంకుల ఖరారులో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తే మంచిది. దీనిపై అవసరమైతే ప్రభుత్వానికి లేఖ రాస్తాం. జేఈఈలో ఇంటర్‌కు ఉన్న 40 శాతం వెయిటేజీ మార్కులను ఇప్పటికే తొలగించారు.
- ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి, ఉన్నత విద్యామండలి చైర్మన్