Skip to main content

టెట్: గెజిట్ నోటిఫికేషన్ వస్తేనే చెల్లుబాటు.. అప్పటి వరకు ఏడేళ్ల వ్యాలిడిటీనే..!

సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) వ్యాలిడిటీని శాశ్వతం చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) తీసుకున్న నిర్ణయం ఇప్పట్లో అమలయ్యే పరిస్థితి కనిపించట్లేదు.
దానిపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే వరకు ఎన్‌సీటీఈ నిర్ణయానికి చట్టబద్ధత ఉండదని, పాత పద్ధతే కొనసాగుతుందని విద్యావేత్తలు పేర్కొంటున్నారు. దీంతో తమ పరిస్థితి ఏంటన్న దానిపై అభ్యర్థులు ఆవేదనలో పడ్డారు. అయితే రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గత సెప్టెంబర్‌లో ఎన్‌సీటీఈ తీసుకున్న నిర్ణయం అమలుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసేలా కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాయాలని అభ్యర్థులు కోరుతున్నారు.

Must Check: TET/ DSC bit banks, previous papers and model papers

గెజిట్ నోటిఫికేషన్ వస్తే లక్షల మందికి ప్రయోజనం
టెట్ స్కోర్ వ్యాలిడిటీ విషయంలో కేంద్రం జారీ చేసే గెజిట్ నోటిఫికేషన్‌తోనే రాష్ట్రంలోని లక్షల మంది అభ్యర్థులకు ప్రయోజనం చేకూరనుంది. అప్పుడే 2011 జూలై 1న, 2012 జనవరి 8న, 2012 జూన్ 1న నిర్వహించిన మూడు టెట్‌లలో అర్హత సాధించి, ఏడేళ్ల వ్యాలిడిటీ ముగిసిన 4 లక్షల మంది అభ్యర్థుల టెట్ స్కోర్‌కు శాశ్వత వ్యాలిడిటీ లభించనుంది. ఇప్పటికే వ్యాలిడిటీ కోల్పోయిన అభ్యర్థుల విషయంలో న్యాయ సలహా తీసుకున్నాక తుది నిర్ణయం ఉంటుందని ఎన్‌సీటీఈ పేర్కొన్న నేపథ్యంలో త్వరగా దానిపై నిర్ణయం తీసుకుని కేంద్ర గెజిట్‌లో ప్రచురించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లేదంటే తాము మళ్లీ టెట్ రాసి అర్హత సాధించాల్సి వస్తుందని, ఇప్పుడు అది సాధ్యం అయ్యే పరిస్థితి లేదని చెబుతున్నారు. మరోవైపు 2014 మార్చి 16న నిర్వహించిన టెట్‌లో అర్హత సాధించిన మరో 1.6 లక్షల మంది అభ్యర్థుల వ్యాలిడిటీ వచ్చే 2021 మార్చి 16తో ముగియనుంది. ఈలోపే టెట్ స్కోర్ వ్యాలిడిటీ శాశ్వతం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాయాలని, అవసరమైతే కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రితో చర్చించాలని కోరుతున్నారు. టెట్ స్కోర్ వ్యాలిడిటీ శాశ్వతం చేస్తే పాత అభ్యర్థులు 4 లక్షల మంది, 2014లో అర్హత సాధించిన అభ్యర్థులు 1.6 లక్షల మందికి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అలాగే 2016 మే 22న జరిగిన టెట్‌లో, 2017 జూలై 23న జరిగిన టెట్‌లో అర్హత సాధించిన మరో 2.1 లక్షల మంది స్కోర్ వ్యాలిడిటీ కూడా శాశ్వతం కానుంది.

రెండు రకాల నిర్ణయాలు అవసరం
టెట్ స్కోర్ వ్యాలిడిటీని శాశ్వతం చేసే విషయంలో కేంద్రం రెండు రకాల నిర్ణయాలు తీసుకోవాలి. ప్రస్తుతం ఏడే ళ్ల వ్యాలిడిటీ కలిగిన అభ్యర్థుల స్కోర్‌ను శాశ్వతం చేయా లి. ఇప్పటికే వ్యాలిడిటీ కోల్పోయిన అభ్యర్థుల టెట్ స్కోర్ వ్యాలిడిటీని కూడా శాశ్వతం చేయాల్సి ఉంది. అప్పుడే పాత అభ్యర్థులకు న్యాయం జరుగుతుంది. లేదంటే వారు ఇప్పుడు మళ్లీ టెట్ రాసి అర్హత సాధించాలంటే కష్టమవుతుంది. ఎన్‌సీటీఈ పాలక మండలి నిర్ణయంపై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశాకే చట్టబద్ధత ఉంటుంది.
Published date : 24 Dec 2020 04:01PM

Photo Stories