తెలంగాణ ప్రభుత్వ విద్యాసంస్థల్లో ‘నాడు–నేడు’
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థలను కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా తీర్చి దిద్దాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం మరో బృహత్తర మార్పునకు శ్రీకారం చుడుతోంది.
ప్రభుత్వ విద్యా సంస్థల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు బడ్జెట్‌లో రూ.4వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఈ నిధులతో దశల వారీగా అన్ని పాఠశాలల్లో వసతుల కల్పనకు కార్యాచరణ సిద్ధం చేస్తూనే.. ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్న ‘నాడు–నేడు’తరహా కార్యక్రమాన్ని రాష్ట్రంలోనూ అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతూ ఇదివరకున్న పరిస్థితి, ప్రస్తుత అభివృద్ధిని పోల్చుతూ అక్కడ నాడు–నేడు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందుకు ఏపీ ప్రభుత్వం వినియోగిస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇక్కడ కూడా వినియోగించుకునేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు సాగిస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఈనెల 15న ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వాన్ని నిరభ్యంతర ధ్రువీకరణ పత్రం ఇవ్వాలని కోరగా.. తక్షణమే ఎన్‌ఓసీ జారీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు తెలస్తోంది. తెలుగు ప్రజల ప్రయోజనం కోసం అవసరమైన సహకారాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ సందర్భంగా హామీ ఇచ్చినట్లు సమాచారం.
Published date : 19 Jun 2021 02:54PM