Skip to main content

శుభవార్త.. పెండింగ్ జీతాల చెల్లింపునకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్!

సాక్షి, అమరావతి: కోవిడ్-19 లాక్‌డౌన్ నేపథ్యంలో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా తగ్గిపోవడంతో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉద్యోగులకు సగం వేతనాలను మాత్రమే చెల్లించడం తెలిసిందే.
మిగతా సగం వేతనాలను చెల్లించేందుకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నెలకు సంబంధించిన మిగతా సగం వేతనాలను డిసెంబర్ నెలలో ఇవ్వనున్నట్టు, ఏప్రిల్ నెలకు సంబంధించిన మిగతా సగం వేతనాన్ని వచ్చే జనవరిలో ఇవ్వనున్నట్టు తెలిపారు. పెన్షనర్లకు మార్చిలో సగం పెన్షన్ ఇవ్వగా.. మిగతా సగాన్ని ఈ నెలలో ఇస్తారు. నాలుగో తరగతి ఉద్యోగులు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మార్చి, ఏప్రిల్ నెలల్లో 90 శాతం వేతనాలివ్వగా.. మిగతా పది శాతాన్ని ఇప్పుడు చెల్లించనున్నారు.

పెన్షనర్లకు జనవరి నుంచి నగదు రూపంలో డీఏ
2018 జూలై నుంచి పెన్షనర్లకు ఇవ్వాల్సిన డీఏను చంద్రబాబు ప్రభుత్వం బకాయి పెట్టింది. ఆ మొత్తాలను వచ్చే జనవరి నుంచి నగదు రూపంలో చెల్లించనున్నట్టు ఆర్థిక శాఖ తాజా ఉత్తర్వుల్లో తెలిపింది. 2018 జూలై 1వ తేదీ నుంచి 31-12-2020 వరకు ఇవ్వాల్సిన బకాయిలను మూడు సమాన వాయిదాల్లో చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. 2019 జనవరి నుంచి పెన్షనర్లకు చెల్లించాల్సిన డీఏను జూన్ 2021 నుంచి, జూలై 2019 నుంచి ఇవ్వాల్సిన డీఏను వచ్చే ఏడాది డిసెంబర్ నుంచి చెల్లించనున్నట్టు వివరించింది.

ప్రభుత్వ ఉత్తర్వులపై ఉద్యోగులు, పెన్షనర్ల హర్షం
ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న 2 నెలల 50% జీతాలను 2 వాయిదాల్లో, పెన్షనర్లకు మార్చిలో నిలిపివేసిన 50% పెన్షన్‌ను ఒకే వాయిదాలో చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు ఏపీజేఏసీ చైర్మన్ బొప్పరాజు, జనరల్ సెక్రటరీ వైవీ రావు మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. రాబోవు క్రిస్టమస్, సంక్రాంతి పండుగలు మా ఉద్యోగులు, పెన్షనర్లకు పెద్ద పండుగలని, ఈ చెల్లింపుల ద్వారా తామంతా కుటుంబసభ్యులతో సంతోషంగా పండుగలు చేసుకుంటామని, ఈ అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తామంతా ధన్యవాదాలు తెలుపుతున్నామని చెప్పారు. అదేవిధంగా ఉద్యోగులకు రావలసిన 3 పెండింగ్ డీఏల చెల్లింపునకు కూడా నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
Published date : 02 Dec 2020 03:08PM

Photo Stories