Skip to main content

సంక్రాంతి సెలవులు జనవరి 13 నుంచి 16 వరకు కుదింపు

సాక్షి, హైదరాబాద్: పాఠశాల విద్యా శాఖ సంక్రాంతి సెలవులను కుదించింది.
పాఠశాల విద్యా అకడమిక్ కేలండర్ ప్రకారం జనవరి 11 నుంచి 16 వరకు సెలవులను ప్రకటించినప్పటికీ జనవరి 12న ఆదివారం కావడంతో జనవరి 13 నుంచి 16 వరకు సెలవులను ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసింది. అలాగే వచ్చే ఏప్రిల్ వరకు ప్రతి నెలా రెండో శనివారం పాఠశాలలు పనిచేయాలని స్పష్టం చేసింది. రెండో శనివారం అయిన జనవరి 11, ఫిబ్రవరి 8, మార్చి 14, ఏప్రిల్ 11 తేదీల్లో పాఠశాలలకు సెలవులు వర్తించవని.. ఆ తేదీల్లో పని చేయాల్సిందేనని వెల్లడించింది. గత నెల 14, నవంబర్ 9, అక్టోబరు 12న పాఠశాలలు పని చేశాయని పేర్కొంది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్ విజయ్‌కుమార్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ సమ్మె కారణంగా విద్యా సంస్థలకు సెలవులు ఇచ్చినందున.. వాటిని సర్దుబాటు చేసేందుకు రెండో శనివారం అన్ని పాఠశాలలు పని చేయాలని విద్యా శాఖ స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలలు అమలు చేయాల్సిందేనని, దీనికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశించింది.

సంఘాల ఆందోళన..
పాఠశాల విద్యా శాఖ నిర్ణయం పట్ల ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఇప్పటికే టీచర్లు, విద్యార్థుల కుటుంబాలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు రైళ్లు, బస్సు టికెట్లను రిజర్వు చేయించుకున్నారని పేర్కొన్నాయి. ఇపుడు ఆకస్మాత్తుగా 11న సెలవు ఉండదని, పాఠశాలలు పని చేయాలని ప్రకటించడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదరవుతాయని ఆరోపించాయి. సంక్రాంతి సెలవులను స్కూల్ అకడమిక్ క్యాలెండర్‌లో ప్రకటించిన విధంగా జనవరి 11 నుంచి 16 వరకు యథావిధిగా కొనసాగించాలని, టీఎస్‌యూటీఎఫ్, టీపీటీఎఫ్, టీపీయూఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.జంగయ్య, చావ రవి, వై.అశోక్ కుమార్, మైస శ్రీనివాస్, హన్మంతరావు, నవాత్ సురేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, కమిషనర్ విజయ్‌కుమార్‌కు టీఎస్‌యూటీఎఫ్ వినతి పత్రాలు అందజేసింది.

జూనియర్ కాలేజీలకు 13 నుంచి సెలవులు..
రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కోర్సును నిర్వహించే కాంపొజిట్ డిగ్రీ కాలేజీలకు జనవరి 13 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులుగా ఇంటర్ బోర్డు ప్రకటించింది. కాలేజీలు తిరిగి 16వ తేదీన రీఓపెన్ అవుతాయని బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఈ సెలవులను అమలు చేయాలని తెలిపారు. సెలవు దినాల్లో ఎవరైనా కాలేజీ నడిపితే ఆయా కాలేజీ యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లపై చర్యలు చేపడతామని, గుర్తింపును రద్దు చేస్తామని హెచ్చరించారు.
Published date : 09 Jan 2020 02:31PM

Photo Stories