స్కూళ్లలో ప్రవేశాలకు టీసీల కోసం ఒత్తిడి చేయొద్దు: విద్యాశాఖ
Sakshi Education
సాక్షి, అమరావతి: పాఠశాలల్లో ప్రవేశాల కోసం వచ్చే విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్ (టీసీ)ల కోసం ఒత్తిడి చేయకుండా వెంటనే ప్రవేశాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.చినవీరభద్రుడు బుధవారం జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంచాలకులకు సూచనలు జారీ చేశారు.
కోవిడ్ కారణంగా పాఠశాలల్లో చేరిన విద్యార్థులకు టీసీల సమర్పణకు 30 రోజులు గడువు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా చేరే స్కూళ్లలో టీసీలు సమర్పించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు అర్జీలు ఇస్తే అప్పటివరకు చదువుతున్న స్కూళ్ల యాజమాన్యాలు వెంటనే టీసీలను ఇవ్వాలని స్పష్టం చేశారు. కోవిడ్ కారణంగా టీసీలు ఇవ్వడానికి 30 రోజుల గడువు ఇస్తున్నందున ఆలోగా ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్లు జారీ చేయకుంటే విద్యాహక్కు చట్టం కింద వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వలస వెళ్లిన, లేదా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన వారి పిల్లలకు ఎలాంటి టీసీలు, రికార్డు షీట్లతో సంబంధం లేకుండా ఆయా విద్యాసంస్థల్లో 1 నుంచి 10 వతరగతి వరకు ప్రవేశాలు కల్పించాలని ఆదేశించారు.
Published date : 24 Jun 2021 04:43PM