స్కూళ్ల ప్రారంభంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఇదే..
Sakshi Education
సాక్షి, అమరావతి : స్కూళ్లకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నవంబర్ 2 నుంచి స్కూళ్లను తెరవనున్నట్లు మఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. 1, 3, 5, 7 తరగతులు ఒకరోజు, 2,4,6,8 తరగతులకు మరో రోజు తరగతులు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అక్టోబర్ 20వ తేదీన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ స్పందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల ప్రారంభం, నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం స్కూళ్లు పున:ప్రారంభించాలని సీఎం నిర్ణయించారు. రెండు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే.. మూడ్రోజులకు ఒకసారి తరగతులు నిర్వహించాలన్నారు. స్కూళ్లు మధ్యాహ్నం వరకు మాత్రమే తెరుస్తారని, మధ్యాహ్నం భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. నవంబర్ నెలలో ఇది అమలవుతుందని, డిసెంబర్‌లో పరిస్థితిని బట్టి తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఒకవేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే.. వారి కోసం ఆన్‌లైన్ తరగతులను నిర్వహిస్తారని సీఎం జగన్ స్పష్టం చేశారు.
Published date : 20 Oct 2020 06:14PM