Skip to main content

సీబీఎస్‌ఈ ధ్రువీకరణ పత్రాల్లో విద్యార్థులను పేరు మార్చుకోనివ్వండి: సుప్రీంకోర్టు

సాక్షి, న్యూఢిల్లీ: సీబీఎస్‌ఈ ధ్రువీకరణ పత్రాల్లో విద్యార్థులు తమ పేరు లేదా తల్లిదండ్రుల పేరు మార్పు కోరితే అనుమతించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఆ మేరకు నిబంధనలను సవరించాలని సీబీఎస్‌ఈని ఆదేశించింది. సీబీఎస్‌ఈ నిబంధనలను సవాల్‌ చేస్తూ జిగ్యా యాదవ్‌ అనే విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన జస్టిస్‌ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ కృష్ణమురారిల ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. విద్యార్థి, తల్లిదండ్రులకు సంబంధించి పేరు, ఇంటి పేరు, పుట్టిన తేదీలకు సంబంధించి మార్పులు లేదా సరిదిద్దడంపై ఉన్న నియంత్రణలను కొట్టివేసింది. పేరులో ఏమున్నదా... గులాబీకి ఆ పేరు కాకుండా వేరే పేరు పెట్టినంత మాత్రాన తీపి వాసన వస్తుందా ... అంటూ ప్రసిద్ధ షేక్స్‌పియర్‌ నాటకం ‘రోమియో జూలియట్‌’లోని ఓ సన్నివేశ సంభాషణతో తీర్పు ప్రారంభించిన ధర్మాసనం.. పేరు అనేది సమాజంలో అతడు/ఆమెలకు ముఖ్యమైన గుర్తింపు అని పేర్కొం ది. రాజ్యాంగాన్ని అధిగమిం చేలా నిబంధనలు ఉండరాదని పేర్కొంది. పాఠశాల ధ్రువీకరణ పత్రంలో విద్యార్థులు పేరు మార్పు కోరరాదంటూ ఉన్న సీబీఎస్‌ఈ నిబంధన చట్టపరంగా చెల్లదని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిం చేలా ఇలాంటివి ఉండరాదని తెలిపింది. గుర్తింపు హక్కు అనేది భావ వ్యక్తీకరణ హక్కులో ఒక భాగమని పేర్కొంది. ఆధార్, పాస్‌పోర్టు తదితర ప్రభుత్వ గుర్తింపు కార్డుతో తమ పేరు లేదా తల్లిదండ్రుల పేర్ల మార్పు కోరవచ్చని తెలిపింది. ఈ మేరకు తక్షణమే సవరణలు చేయాలని సీబీఎస్‌ఈకి ధర్మాసనం మార్గదర్శకాలను జారీ చేసింది.
Published date : 04 Jun 2021 04:20PM

Photo Stories