సగం మందితోనే తరగతులు నిర్వహించండి: సబితా ఇంద్రారెడ్డి
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం కానున్న డిగ్రీ, పీజీ, వృత్తి విద్యా కాలేజీల్లో 50 శాతం మంది విద్యార్థులతోనే తరగతులు జరిగేలా చూడాలని ప్రభుత్వం నిర్ణయించింది.
సగానికంటే ఎక్కువ మంది విద్యార్థులు వస్తే షిఫ్ట్ విధానంలో లేదా రోజు విడిచి రోజు బోధన చేపట్టేలా చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఒకరోజు ఒక సంవత్సరం వారికి బోధన కాకుండా ఆయా కోర్సుల్లో అన్ని సంవత్సరాల వారికి తరగతులను ప్రారంభించాలని స్పష్టం చేసింది. శుక్రవారం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉన్నత విద్యాశాఖాధికారులతో తరగతుల ప్రారంభంపై సమీక్షించారు. కాలేజీలవారీగా, తరగతులవారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్ల ప్రారంభం విషయంలోనూ విద్యార్థుల సంఖ్య, స్థానిక పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కరోనా మార్గదర్శకాలను అనుసరించి తరగతులను నిర్వహించాలని, ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను తరచూ తనిఖీ చేయాలన్నారు. విద్యార్థులు గుమికూడకుండా యాజమాన్యాలు తగిన చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.
Published date : 30 Jan 2021 02:50PM