సెప్టెంబర్ నుంచి కొత్త విద్యా సంవత్సరం
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా కొత్త విద్యా సంవత్సరాన్ని జూలైకి బదులు సెప్టెంబర్‌లో ప్రారంభించాలని, అప్పుడే విద్యా సంస్థలు తెరవాలని యూజీసీ నిపుణుల కమిటీ పేర్కొంది.
కరోనా వైరస్ నేపథ్యంలో మార్చి నెల నుంచే కాలేజీలను, స్కూళ్లను మూసివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అకడమిక్ అంశాలు, ఆన్‌లైన్ విద్య తదితర అంశాలపై అధ్యయనం చేసేందుకు యూజీసీ రెండు కమిటీలను ఏర్పాటు చేసింది. హరియాణా యూనివర్సిటీ వైస్ చాయిలర్ ఆర్‌సీ కుహద్ నేతృత్వంలోని కమిటీ లాక్‌డౌన్ నేపథ్యంలో యూనివర్సిటీల్లో పరీక్షల నిర్వహణ, ప్రత్యామ్నాయ చర్యలపై అధ్యయనం చేసింది. ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో) వైస్ చాన్స్ లర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మరో కమిటీ ఆన్‌లైన్ పరీక్షలపై అధ్యయనం చేసింది. శుక్రవారం ఆ కమిటీలు యూజీసీకి తమ నివేదికలను అందజేశాయి. అందులో కుహద్ నేతృత్వంలోని కమిటీ విద్యా సంవత్సరాన్ని జూలైకి బదులు సెప్టెంబరులో ప్రారంభించాలని సిఫారసు చేసింది. ఇక నాగేశ్వర్‌రావు కమిటీ యూనివర్సిటీల్లో కావాల్సినంత మౌలిక సదుపాయాలు ఉంటే ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించవచ్చని సూచించింది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆ రెండు కమటీలను పరిశీలించి, మరో వారం రోజుల్లో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది.
Published date : 27 Apr 2020 03:47PM