సచివాలయాల సిబ్బంది శిక్షణ పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే.. ప్రొబేషన్ పూర్తి!
Sakshi Education
సాక్షి, అమరావతి/తాడేపల్లిరూరల్ (మంగళగిరి): ప్రొబేషన్ కాలంలో ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది శిక్షణ కాలంలో నిర్వహించే నాలుగు రకాల పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే వారి ప్రొబేషన్ ప్రకటించడం జరుగుతుందని గ్రామ, వార్డు సచివాలయాల ముఖ్య కార్యదర్శి అజయ్‌జైన్ పేర్కొన్నారు.
బుధవారం వార్డు సచివాలయాల మాస్టర్ ట్రైనర్లు, వైఎస్‌ఆర్ జిల్లా గ్రామ సచివాలయాల మాస్టర్ ట్రైనర్ల శిక్షణ కార్యక్రమాల ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది రెండేళ్ల ప్రొబేషన్‌లో ఉన్నారని, ఈ రెండేళ్ల కాలంలో వారికి అనేక రకాల శిక్షణ కార్యక్రమాలు ఉంటాయన్నారు. విధుల నిర్వహణ, ప్రభుత్వ పథకాలు, ప్రవర్తనా నియమావళి గురించి నిర్వహించే ఈ శిక్షణ కార్యక్రమంలో నాలుగు దఫాలుగా పరీక్షలు నిర్వహిస్తారని ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోతే ప్రొబేషన్ పొడిగింపు ఉంటుందన్నారు. ప్రతి ఉద్యోగి కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలని, డిజిటల్ సహాయకులు సెలవులో ఉంటే, సచివాలయాల్లో పనిచేసే ఇతర సిబ్బంది డిజిటల్ సేవలు అందించడానికి సంసిద్ధులుగా ఉండాలన్నారు.
Published date : 12 Nov 2020 04:54PM