రూ.460 కోట్లతో.. 23 నైపుణ్యాభివృద్ధి కాలేజీల నిర్మాణం..
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఒక్కొక్కటి చొప్పున నైపుణ్యాభివృద్ధి శిక్షణ కళాశాలలను ఏడాదిలోగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
‘వైఎస్సార్ సెంటర్స్’ పేరుతో రూ.460 కోట్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) రాష్ట్ర వ్యాప్తంగా 23 నైపుణ్య కళాశాలలను నిర్మిస్తోంది. వీటిని నిర్మించే బాధ్యతలను ప్రభుత్వరంగ సంస్థలైన ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ), ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్, రోడ్లు–భవనాల శాఖలకు అప్పగించినట్టు ఏపీఎస్‌ఎస్‌డీసీ ఎండీ ఎన్.బంగార్రాజు ‘సాక్షి’కి తెలిపారు. ఇందులో ఆర్ అండ్ బీకి 10, ఏపీఐఐసీకి 6, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు 7 కళాశాలల నిర్మాణ పనులు అప్పగించినట్టు వివరించారు. మరో రెండు కళాశాలలను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్మిస్తుందన్నారు. ఈ కాలేజీలకు సంబంధించి అభివృద్ధి చేసిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక, ఆకృతులను వాటికి అప్పగించామని, సెప్టెంబర్‌లోపు టెండర్లు పిలిచి అక్టోబర్ నాటికి పనులు మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వీటి నిర్మాణాలను 8 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. తర్వాత రెండు నెలల్లో ల్యాబ్ నిర్మాణం పూర్తిచేసి ఏడాదిలోగా ఈ కళాశాలల్లో కోర్సులను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు.
ఏయే నియోజకవర్గాల్లో ఏ సంస్థ నిర్మిస్తుందంటే..
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖకు కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, నరసాపురం, కర్నూలు, కడప, రాజంపేట, అనంతపురం, హిందూపురం కాలేజీల నిర్మాణ బాధ్యతలను ఏపీఎస్‌ఎస్‌ఓడీసీ అప్పగించింది. విజయవాడ, మచిలీపట్నం, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, ఒంగోలు నైపుణ్య కేంద్రాలను ఏపీఐఐసీకి, విశాఖ, అనకాపల్లి, అరకు, శ్రీకాకుళం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు కేంద్రాలను ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌కు అప్పగించింది. ఈ మేరకు ఆయా సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి. విజయనగరం, నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గాల స్కిల్ డెవలప్‌మెంట్ కాలేజీలను కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖ నిర్మిస్తుంది.

Published date : 24 Aug 2021 03:28PM