రెండో విడత జగనన్న అమ్మ ఒడికి నేటి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
Sakshi Education
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఉదయం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది.
ఈ సమావేశంలో రెండో విడత ‘జగనన్న అమ్మ ఒడి’ పథకానికి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నారు. ఈ ఏడాది జనవరి 9వ తేదీన తొలి విడత జగనన్న అమ్మ ఒడి పథకం అమలు చేశారు. వరుసగా రెండో విడత మళ్లీ వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన జగనన్న అమ్మ ఒడి పథకం కింద అర్హులైన తల్లులకు రూ.15 వేల చొప్పున ఇచ్చేందుకు మంత్రివర్గ సమావేశంలో అమోదించనున్నారు. జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా సంపూర్ణ అక్షరాస్యత సాధించడంతో పాటు.. పేద వర్గాల పిల్లలను పనులకు పంపకుండా బడికి పంపేలా ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే సంక్రాంతికి ముందే వైఎస్సార్ రైతు భరోసా కింద రైతులకు ఆర్థిక సాయం అందించడంపై మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తారు. నియోజవర్గాల్లో పశువుల ఆరోగ్య పరీక్షల ల్యాబ్‌లు ఏర్పాటుతో పాటు పలు అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. గన్నవరం విమానాశ్రయం విస్తరణకు భూములిచ్చిన వారిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది.
Published date : 18 Dec 2020 02:10PM