రేపటి వరకు డిగ్రీ సెల్ఫ్ రిపోర్టింగ్ గడువు: దోస్త్
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: డిగ్రీ ఆన్‌లైన్ ప్రవేశాల్లో భాగంగా మూడో దశ కౌన్సెలింగ్ సీట్లు పొందిన విద్యార్థులు సెల్ఫ్ రిపోర్టింగ్ చివరి తేదీని ఈనెల 26 నుంచి 28వ తేదీ వరకు పొడిగించినట్లు డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు.
ఈ నెల 28వ తేదీలోగా దోస్త్ వెబ్‌సైట్ ద్వారా (ఆన్‌లైన్) సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని విద్యార్థుల సీట్లు రద్దు అవుతాయని పేర్కొన్నారు. ఇటీవల వచ్చిన వరదలు, సెలవుల కారణంగా ఈ గడువును పొడిగించినట్లు వెల్లడించారు. అలాగే ప్రత్యేక విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్లు, వెబ్ ఆప్షన్ల గడువును కూడా ఈనెల 28వ తేదీ వరకు పొడిగించామని వివరించారు. కాగా ప్రత్యేక విడత కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపును ఈనెల 31వ తేదీన ప్రకటిస్తామని, విద్యార్థులు ఈనెల 31 నుంచి వచ్చే నెల 5వ తేదీలోగా ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని సూచించారు. అలాగే అన్ని దశల కౌన్సెలింగ్‌లో సీట్లు పొంది, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు ఈనెల 31వ తేదీ నుంచి వచ్చే నెల 5వ తేదీలోగా ఆయా కాలేజీల్లో వ్యక్తిగతంగా రిపోర్టు చేయాలని వెల్లడించారు.
Published date : 27 Oct 2020 03:38PM