Skip to main content

ప్రైవేటు విద్యాసంస్థల ట్యూషన్ ఫీజు తగ్గింపు

సాక్షి, అమరావతి: కోవిడ్ అనంతర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేటు అన్ ఎయిడెడ్ విద్యాసంస్థల ట్యూషన్ ఫీజులను గత విద్యా సంవత్సరం (2019–20) కంటే 30 శాతం మేర పాఠశాల విద్యాశాఖ తగ్గించింది.
ప్రైవేటు స్కూళ్లు, జూనియర్ కాలేజీలు ఈ ఏడాది (2020–21) ట్యూషన్ ఫీజులో 70 శాతం మాత్రమే విద్యార్థుల నుంచి వసూలు చేయాలని పేర్కొంటూ అక్టోబర్ 30వ తేదీన ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ కారణంగా లాక్డౌన్ విధింపుతో ఉద్యోగ, ఉపాధి కార్యక్రమాలు దెబ్బతినడం, పలు కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఛిన్నాభిన్నమైన నేపథ్యంలో.. ఫీజుల కోసం తల్లిదండ్రులను ఒత్తిడి చేయరాదని పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఇంతకు ముందే ఆదేశాలు ఇచ్చింది. గత ఏడాది వసూలు చేసిన ఫీజులను ఈ ఏడాది పెంచరాదని, ఆ ఫీజులను కూడా వాయిదాల పద్ధతిలో నెలవారీ మాత్రమే తీసుకోవాలని సూచించింది. తాజాగా ఫీజులపై కసరత్తు నిర్వహించిన కమిషన్ ట్యూషన్ ఫీజును తగ్గించి వసూలు చేయాలని సిఫారసు చేసింది. కాగా ఫీజులపై హైకోర్టులో ఉన్న వ్యాజ్యానికి సంబంధించిన తుది తీర్పుననుసరించి తదుపరి నిర్ణయం ఉంటుందని విద్యాశాఖ పేర్కొంది.
Published date : 31 Oct 2020 02:57PM

Photo Stories