Skip to main content

పేదలకు పెద్ద చదువులే లక్ష్యంగా.. ‘జగనన్న వసతి దీవెన’!

అమరావతి: పేదరికం వల్ల ఏ ఒక్క విద్యార్థీ చదువుకు దూరం కాకూడదన్న లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నూతన విప్లవానికి నాంది పలుకుతోంది.
ఇప్పటికే ‘అమ్మ ఒడి’ పథకం కింద 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తుండగా.. ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ విద్యార్థులకూ చేయూత అందించేందుకు ‘జగనన్న వసతి దీవెన’ పథకం అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. పెద్ద చదువులు చదివే పేద విద్యార్థులకు ఇప్పటికే చెల్లిస్తున్న పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగిస్తూనే.. భోజనం, వసతి సౌకర్యాల నిమిత్తం ఆర్థిక సాయం అందించేలా ‘జగనన్న వసతి దీవెన’ పథకాన్ని అమలు చేస్తున్నారు. విద్యార్థులు చదివే కోర్సును బట్టి ఏడాదికి రూ.10 వేల నుంచి రూ.20 వేల చొప్పున వారి తల్లుల ఖాతాల్లో జమ చేసే ఇలాంటి పథకం దేశంలోనే మరెక్కడా లేదు. ఈ పథకాన్ని సోమవారం విజయనగరం వేదికగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభిస్తున్నారు.

పేదల పెద్ద చదువులకు భరోసానిచ్చేలా..
విపక్ష నేతగా రాష్ట్రమంతటా జరిపిన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను స్వయంగా చూసిన వైఎస్ జగన్.. వారందరికీ భరోసా కల్పించేలా ‘జగనన్న వసతి దీవెన’ పథకానికి శ్రీకారం చుట్టారు. పేదరికంలో ఉన్న ఏ ఒక్క విద్యార్థి కూడా ఉన్నత చదువులకు దూరం కాకూడదన్న సంకల్పంతో పథకాన్ని అమల్లోకి తెస్తున్నారు. 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయసు ఉండి, ఇంటర్ తర్వాత కళాశాలల్లో చేరుతున్న వారి ‘గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో’ కేవలం 23 శాతం ఉంటోంది. ఇలాంటి దారుణ పరిస్థితికి పేదరికమే కారణమవుతోందని గ్రహించి.. ఆ పరిస్థితిని మార్చాలన్న సంకల్పంతోనే సీఎం ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.

ఏ విద్యార్థులకు ఎంత ఇస్తారంటే..
‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ.20 వేల చొప్పున హాస్టల్, మెస్ చార్జీల కింద చెల్లిస్తారు. అర్హత ఉన్న ప్రతి విద్యార్థికి యూనిక్ బార్ కోడ్‌తో కూడిన స్మార్ట్ కార్డులు జారీ చేస్తారు. ఆ కార్డులో విద్యార్థులకు సంబంధించిన పూర్తి వివరాలు ఉంటాయి. ఈనెల 25 నుంచి వలంటీర్లు ఆ కార్డులను ఇప్పటికే గుర్తించిన విద్యార్థుల ఇళ్లకు వెళ్లి అందజేస్తారు. ఎక్కువ మంది విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా ఆదాయ పరిమితి నిబంధనలను సవరించారు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.50 లక్షల వరకు గల ప్రతి విద్యార్థికీ ఈ పథకం వర్తింపచేస్తున్నారు.

11,87,904 మందికి లబ్ధి
జగనన్న విద్యా దీవెన పథకంతోపాటే జగనన్న వసతి దీవెన పథకానికి వైఎస్సార్ నవశకం సర్వే ద్వారా అర్హులను గుర్తించారు. గత ఏడాది నవంబరులో 11,27,437 మంది విద్యార్థులను సర్వే చేయగా, వారిలో 10,85,218 మంది విద్యార్థులు రెండు పథకాలకూ అర్హులని తేలింది. సర్వే సమయంలో కొత్తగా 69,085 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలోనూ అర్హులను గుర్తించారు. ఈ నేపథ్యంలో ‘జగనన్న విద్యా దీవెన’, ‘జగనన్న వసతి దీవెన’ పథకాల కోసం రాష్ట్రంలో 11,54,303 మంది విద్యార్థులు అర్హులని తేలింది. ఆ తరువాత ‘స్పందన’ కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను, సర్వేలో అనర్హులుగా గుర్తించిన వారి అభ్యంతరాలను, గ్రామ సచివాలయాల్లో వలంటీర్ల సర్వే.. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న అనంతరం ‘జగనన్న వసతి దీవెన’ పథకం కింద ప్రయోజనం పొందటానికి ఇప్పటివరకు 11,87,904 మంది విద్యార్థులు అర్హులుగా తేలింది. వీరందరికీ పథకం కింద ప్రయోజనం కలగనుంది.

పూర్తి పారదర్శకంగా..
జగనన్న వసతి దీవెన పథకంలో అర్హులను గుర్తించే ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించారు. వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి సామాజిక సర్వే ద్వారా అర్హులను గుర్తించారు. అర్హుడైన ఏ ఒక్క విద్యార్థికి కూడా నష్టం కలగకూడదన్న సంకల్పంతో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఆ క్రమంలోనే అర్హులైన విద్యార్థుల ఎంపికను పూర్తి పారదర్శకంగా కొనసాగించారు. ఇంకా అర్హులైన విద్యార్థులు ఎవరైనా మిగిలిపోతే వారికీ అవకాశం కల్పిస్తారు. అమ్మ ఒడి మాదిరిగానే జగనన్న వసతి దీవెన పథకం కింద విద్యార్థులకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని వారి తల్లుల ఖాతాల్లోనే జమ చేయనున్నారు. రెండు విడతల్లో జమ చేస్తారు. ఇందుకు రూ.2,278 కోట్లు ఖర్చవుతాయని అంచనా.

మొదటి విడతలో చెల్లించేదిలా..
జగనన్న వసతి దీవెన పథకం తొలి విడతలో 53,720 మంది ఐటీఐ విద్యార్థులకు, 86,896 మంది పాలిటెక్నిక్ విద్యార్థులకు, 10,47,288 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందనుంది. ఐటీఐ విద్యార్థులకు తొలి విడతగా రూ.5 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.7,500, డిగ్రీ, పీజీ విద్యార్థులకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.1,139.15 కోట్లు వారి తల్లుల ఖాతాల్లో జమ చేస్తారు. త్వరలోనే రెండో విడత సొమ్ములను జమ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

జిల్లాల వారీగా లబ్ధి పొందే విద్యార్థుల సంఖ్య ఇలా..

విజయనగరం

59,688

శ్రీకాకుళం

57,270

విశాఖ

1,05,709

తూర్పు గోదావరి

1,23,938

పశ్చిమ గోదావరి

86,816

కృష్ణా

1,19,197

గుంటూరు

1,19,618

ప్రకాశం

70,128

నెల్లూరు

67,541

అనంతపురం

85,041

వైఎస్సార్ కడప

78,595

చిత్తూరు

1,31,899

కర్నూలు

82,464

మొత్తం

11,87,904

Published date : 24 Feb 2020 03:29PM

Photo Stories