Skip to main content

నాణ్యత లేని శిక్షణ... ఎస్సీ కార్పొరేషన్‌పై సర్కార్ చర్యలు!!

సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహకార సంస్థ (ఎస్సీ కార్పొరేషన్) ద్వారా నిరుద్యోగులకిచ్చిన నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాల్లో అవకతవకలపై ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది.
శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించాల్సిన కాంట్రాక్టు సంస్థలు.. ట్రైనింగ్ ప్రోగ్రామ్స్‌తోనే సరిపెట్టడంపై ప్రభుత్వానికి పెద్ద ఎత్తున ఫిర్యాదులొచ్చాయి. పలువురు శిక్షణ పొందిన అభ్యర్థులు నేరుగా మంత్రి పేషీకి, ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో స్పందించిన సర్కార్ జరిగిన అవకతవకలను గుర్తించేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తాజాగా ఎస్సీ కార్పొరేషన్ వైస్‌చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ (వీసీఎండీ)పై వేటు పడినట్లు విశ్వసనీయ సమాచారం.

నాణ్యత లేని శిక్షణలపై ఆరా
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉపాధి కల్పనే లక్ష్యంగా.. యువతకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించేందుకు మూడేళ్లుగా పదుల సంఖ్యలో ప్రైవేట్ శిక్షణ సంస్థలకు అనుమతిచ్చారు. నర్సింగ్, హాస్పిటాలిటీ, బ్యూటీషియన్, ఇంజనీరింగ్ విభాగాల్లో పెద్ద సంఖ్యలో యువతకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. అయితే.. ఉపాధి అవకాశాలు కల్పించడంలో ఈ శిక్షణ సంస్థలు చేతులెత్తేశాయి. దీనిపై ఆగ్రహించిన అభ్యర్థులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో పాటు సంబంధిత మంత్రికి సైతం వినతులు సమర్పించారు. దీనిపై దృష్టి సారించిన ప్రభుత్వం అసలు సంగతిని తేల్చేందుకు ఉపక్రమించింది.

కరుణాకర్‌కు బాధ్యతలు
ఎస్సీ కార్పొరేషన్ వీసీఎండీగా ఉన్న లచ్చిరాం భుక్యను తప్పించి.. ఎస్సీ అభివృద్ధి శాఖ అదనపు సంచాలకుడు పి.కరుణాకర్‌కు దీని పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. ఐఆర్‌ఎస్ అధికారి అయిన లచ్చిరాం భుక్య ఎస్సీ కార్పొరేషన్ వీసీ ఎండీగా డిప్యుటేషన్‌పై వచ్చారు. ఏడాది పాటు డిప్యుటేషన్‌పై వచ్చిన ఆయన.. రెండుసార్లు ఎక్స్‌టెన్షన్ తెచ్చుకున్నారు. ఈ ఏడాది జూన్‌తో ఆయన పదవీకాలం పూర్తి కానుండగా.. మరో ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వానికి అర్జీ పెట్టుకున్నారు. అయితే ఎస్సీ కార్పొరేషన్ పై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ను తప్పిస్తూ కరుణాకర్‌ను నియమించినట్లు విశ్వసనీయ సమాచారం.

ఆడిట్‌కు ఆదేశం
గత మూడేళ్లుగా ఎస్సీ కార్పొరేషన్ చేసిన వ్యయాలపై ఆడిట్ నిర్వహించాలని ప్రభుత్వం అంతర్గతంగా ఆదేశించినట్లు సమాచారం. ఈ శాఖలో వృథా ఖర్చులు ఎక్కువయ్యాయని, ఒక్కో అధికారి రెండేసి వాహనాలు వాడుతున్నారని, అవసరం లేకున్నా పలు రకాల ఫర్నిచర్, ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేసినట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులొచ్చాయి. ఈ తతంగంపై ఓ సీనియర్ అధికారితో ఆడిట్ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం.
Published date : 19 Aug 2020 12:23PM

Photo Stories