Skip to main content

నాలుగేళ్లలో... బాలికల కోసం 4,500కుపైగా పెరిగినఐఐటీ సీట్లు!

సాక్షి, హైదరాబాద్: సాంకేతిక విద్యను అభ్యసించడంలో వెనుకంజలో ఉన్న బాలికల భాగస్వామ్యం పెంచేందుకు కేంద్రం చర్యలు వేగవంతం చేసింది.
ఇంజనీరింగ్ విద్యపట్ల బాలికలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని, బాలురతో పోల్చుకుంటే బాలికల సంఖ్య చాలా తక్కువగా ఉంటోందని గుర్తించిన కేంద్రం.. వారి సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టింది.

   నాలుగేళ్లలో కనీసం 20 శాతం మంది బాలికలకు అదనంగా సీట్లను ఇవ్వాలని 2017లో నిర్ణయించి అందుకు అనుగుణంగా చర్యలు చేపట్టింది. దీంతో ఐఐటీ కౌన్సిల్ కూడా అదే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే సీట్ల పెంపుపై నిర్ణయం తీసుకుంది. అయితే పలు ఐఐటీలు అప్పట్లో దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. తగిన మౌలిక సదుపాయాలు లేకుండా సూపర్ న్యూమరీ సీట్లను సృష్టిస్తే నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటాయని ఆందోళన వెలిబుచ్చాయి. దీంతో ఆ ఒక్క సంవత్సరం మాత్రం సదుపాయాలు ఉన్న ఐఐటీల్లో బాలికల కోసం అదనంగా సీట్లను కేటాయించాల ని కేంద్రం స్పష్టం చేసింది. ఆ ఏడాది దాదాపు అన్ని ఐఐటీలు సీట్లను పెంచాయి. ఆ తరువాత క్రమంగా పెంచుతూ వస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో మాత్రం (2020-21) భారీగా సీట్ల పెంపునకు ఐఐటీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఐఐటీల్లో ఉన్న సీట్లకు అదనంగా 20 శాతం సీట్లను బాలికల కోసమే సూపర్ న్యూమరీ సృష్టించి కేటాయించేందుకు చర్యలు చేపట్టింది.

మూడేళ్లలో సీట్ల పెరుగుదల ఇలా..
2016-17 విద్యా సంవత్సరంలో దేశంలోని ఐఐటీల్లో 10,435 సీట్లు ఉన్నాయి. కేంద్రం నిర్ణయంతో 2017-18 విద్యా సంవత్సరం వచ్చేసరికి ఆ సీట్లను ఐఐటీలు 10,957కు పెంచాయి. మొదటి ఏడాది 522 సీట్లను (5%) పెంచాయి. 2018-19 విద్యా సంవత్సరం వచ్చే సరికి 4 శాతం సీట్లను పెంచడంతో ఐఐటీల్లో సీట్ల సంఖ్య 11,326కు చేరుకుంది. 2019-20 విద్యా సంవత్సరంలోనూ అదనంగా 2,050 సీట్లను పెంచడంతో ప్రవేశాలు చేపట్టిన సీట్ల సంఖ్య 13,376కు చేరింది. ఇందులో 2019-20 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తెచ్చిన ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కింద వెయి్య సీట్ల వరకు ఉన్నాయి. ఇవి మినహాయిస్తే గత మూడేళ్లలో బాలికల కోసమే ఐఐటీల్లో 1,941 సీట్లు అదనంగా వచ్చాయి. తాజాగా వచ్చే (2020-21) విద్యా సంవత్సరంలో 20 శాతం సీట్లను పెంచాలని ఐఐటీల కౌన్సిల్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. దీంతో జూన్‌లో ప్రారంభమయ్యే ప్రవేశాల కౌన్సెలింగ్‌లో మరో 2,676 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో నాలుగేళ్లలో బాలికల కోసం అదనంగా పెంచిన సీట్ల సంఖ్య 4,500 దాటనుంది. 2016-17 విద్యా సంవత్సరంలో 10,435 సీట్లు ఉంటే అవి జూన్‌లో ప్రారంభమయ్యే కౌన్సెలింగ్‌లో 16 వేలు దాటనున్నాయి.
Published date : 16 Mar 2020 05:31PM

Photo Stories