Skip to main content

కొత్త ఐటీ పాలసీతో రానున్న మూడేళ్లలో 55,000 ఉద్యోగాలు

సాక్షి, అమరావతి: అత్యున్నత నైపుణ్యంతో కూడిన ఉద్యోగావకాశాలు స్థానిక యువతకు కల్పించేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నూతన ఐటీ పాలసీ 2021–24 ఉందని పారిశ్రామిక సంఘాలు, ఐటీ సంస్థల ప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు.
మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ మూడు ఐటీ కాన్సెప్ట్‌ సిటీలు, ఇంటిగ్రేటెడ్‌ ఐటీ పార్కుల నిర్మాణం, ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ, ఇంక్యుబేషన్‌ సెంటర్లు, సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్, ల్యాబ్‌లు, కో–వర్కింగ్‌ స్పేస్, స్టేట్‌ డేటా సెంటర్‌ వంటివి ఏర్పాటుచేయడం ద్వారా అధిక జీతాలు కూడా పొందే అవకాశం ఉందంటున్నారు. అలాగే, రాయితీలను త్వరితగతిన చెల్లించే విధంగా చర్యలు తీసుకోవడం.. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఏర్పాటుచేసే సంస్థలకు మరిన్ని ప్రయోజనాలు అందించడం ద్వారా రాష్ట్రంలోని ఐటీ రంగంలోకి భారీ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీఐఐ), ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ (ఫ్యాప్సీ) వంటి పారిశ్రామిక సంఘాలు పేర్కొన్నాయి. విశాఖలో ఐటీ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీ ఏర్పాటుచేయడం ద్వారా హైఎండ్‌ ఉద్యోగాలు సాధించవచ్చని ఫ్యాప్సీ ప్రెసిడెంట్‌ సీవీ అచ్యుతరావు తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ తీసుకురావడం, ఉపాధి ఆధారిత రాయితీలు కల్పించడం స్వాగతించదగ్గ నిర్ణయాలన్నారు.

55,000 మందికి ప్రత్యక్ష ఉపాధి
కాగా, నూతన ఐటీ పాలసీ ద్వారా ప్రత్యక్షంగా 55,000 మందికి ఉపాధి లభిస్తుందని రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ అంచనా వేస్తోంది. ఐటీ రంగంలో ప్రతీఒక్క ప్రత్యక్ష ఉద్యోగానికి పరోక్షంగా ముగ్గురికి ఉపాధి లభిస్తుందని.. ఆ విధంగా చూస్తే మరో 1.65 లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని లెక్కగట్టింది. అదే విధంగా ఎస్‌జీఎస్టీ వసూళ్లు, వృత్తిపన్ను, ఉద్యోగుల వినిమయ శక్తి పెరగడం ద్వారా వివిధ పన్నుల రూపంలో రాష్ట్ర ప్రభుత్వానికి పదేళ్లలో రూ.783 కోట్ల ఆదాయం సమకూరనుందని ఐటీ శాఖ భావిస్తోంది. అలాగే, ప్రతీ ఏడాది ఉద్యోగులకు జీతాల రూపంలో రూ.2,200 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని, దీని ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వేగంగా పరుగులు తీస్తుందని చెబుతోంది.

నైపుణ్యంగల నిపుణులు వస్తారు
మారుతున్న కాలానికి అనుగుణంగా ఐటీ రంగంలో మౌలిక వసతులకు పెద్దపీట వేయడం ఆహ్వానించదగ్గ విషయం. ఇంటిగ్రేటెడ్‌ ఐటీ పార్కును ఏర్పాటుచేయడమే కాకుండా ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ రీసెర్చ్‌ యూనివర్సిటీని నెలకొల్పడం ద్వారా ఐటీ రంగంలో హైఎండ్‌ ఉద్యోగాలు లభిస్తాయి. ప్రస్తుతం ఇంజనీరింగ్‌ కోర్సులు ఐటీ ఉద్యోగాలకు ఉపయోగపడటంలేదు. రీసెర్చ్‌ యూనివర్సిటీ, సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్ ఏర్పాటు ద్వారా ఐటీ కంపెనీలకు నైపుణ్యం కలిగిన నిపుణులు దొరుకుతారు.
– దాసరి రామకృష్ణ, సీఐఐ ఏపీ చాప్టర్‌ మాజీ చైర్మన్‌, సీఈఓ, ఎఫ్ట్రానిక్స్‌

స్థానిక యువతకు ఉపాధి
రాష్ట్రంలో పుష్కలంగా ఉన్న మానవ వనరులను వినియోగించుకునే విధంగా పాలసీని రూపొందించడం భేష్‌ అయిన నిర్ణయం. మూడు కాన్సెప్ట్‌ సిటీల నిర్మాణం ద్వారా స్థానిక యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయి. దేశ చరిత్రలో తొలిసారిగా ఐటీ రంగంలో వెనుకబడిన తరగతులకు ప్రత్యేక రాయితీలను అందించడం ఆహ్వానించదగ్గ విషయం. మొత్తం మీద చూస్తే కొత్త పెట్టుబడులను ఆకర్షించే విధంగా పాలసీని రూపొందించారు.
– గేదెల శ్రీనుబాబు, సీఈఓ, పల్‌సస్‌ గ్రూపు
Published date : 05 Jul 2021 02:28PM

Photo Stories