జనవరి 31లోగా పదోన్నతులు పూర్తి.. మిగిలిన ఖాళీలు ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ!
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతులు, కారుణ్య నియామకాలు, ప్రత్యక్ష పద్ధతిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియలో పురోగతిపై ప్రభుత్వం స్పష్టమైన గడువును నిర్దే శించింది.
ఈ నెలాఖరు వరకు పదోన్నతులు, నియామకాల ప్రక్రియకు సంబంధించి ప్రతీ వారం (జనవరి 6, 12, 20, 27 తేదీల్లో) సమీక్షా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్.. అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులను ఆదేశించారు. సోమవారం బీఆర్‌కేఆర్ భవన్‌లో వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులు, పలువురు జిల్లాల కలెక్టర్లతో ఆయన సమావేశమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సచివాలయంతో పాటు విభాగాధిపతు (హెచ్‌ఓడీ)లు, జిల్లా స్థాయిలో ఉద్యోగుల పదోన్నతులను ఎటువంటి జాప్యం లేకుండా జనవరి 31లోగా పూర్తి చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, హెచ్‌ఓడీలకు సూచించారు. పదోన్నతులు, కారుణ్య నియామకాల ప్రక్రియను జాప్యం లేకుండా పూర్తి చేయాలని, పదోన్నతులతో ఏర్పడే ఖాళీలను కూడా ప్రత్యక్ష నియమాల ప్రకటనల్లో చేర్చాలని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆశయం మేరకు ఈ అంశాలకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తామని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం.. రాష్ట్ర, జోనల్, జిల్లా కేడర్‌ల వారీగా పోస్టుల విభజన ప్రక్రియను సత్వరంగా పూర్తి చేయాలని సీఎస్ సోమేశ్‌కుమార్ అన్ని ప్రభుత్వ శాఖల అధికారులను కోరారు. ఇంకా కొన్ని శాఖలు ఈ ప్రక్రియ పూర్తి చేయలేదని, సత్వరంగా ముగించాలని కోరారు.
Published date : 05 Jan 2021 04:09PM