Skip to main content

జనవరి 18న తెలంగాణలో పాఠశాలలు, కళాశాలలు పునః ప్రారంభం

సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 18 నుంచి తెలంగాణరాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.
తొలుత 9వ తరగతి, ఆపై తరగతుల విద్యార్థులకు క్లాస్‌రూం విద్యాబోధన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. 9, 10వ తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులకు సంబంధించిన తరగతుల నిర్వహణకు పలు షరతులతో అనుమతించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాఠశాలలు, కళాశాలలను పునః ప్రారంభించే అంశంపై విసృ్తతంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై సైతం ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు.

ఏడు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలు...
కోవిడ్-19 మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలను పునఃప్రారంభించలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడిచిపోయినా, ఇంకా ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. 3వ తరగతి, ఆపై విద్యార్థులకు ప్రస్తుతం ఆన్‌లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా వ్యాప్తి సైతం అదుపులోకి వచ్చిందని రోజువారీ కేసుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళతో సహా దేశంలోని ఏడు రాష్ట్రాలు ఇప్పటికే 9వ తరగతి, ఆపై విద్యార్థుల కోసం తరగతి గది బోధనలను ప్రారంభించాయి. రాష్ట్రంలో సైతం ఈ నెల 18 నుంచి 9వ తరగతి, ఆపై విద్యార్థులకు ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభించడమే మంచిదని రాష్ట్ర విద్యా శాఖ... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు పాఠశాలలు, కళాశాలలను పునఃప్రారంభించడానికి సంసిద్ధంగా ఉన్నామని ప్రభుత్వా నికి తెలిపింది. సోమవారం నిర్వహించనున్న సమీక్షలో సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని విద్యాశాఖ అధికారులు ఆశావహ దృక్పథంతో ఉన్నారు. రోజూ తరగతులు నిర్వహించాలా? లేక రోజు విడిచి రోజు నిర్వహించాలా? షిఫ్టుల వారీగా విభజించాలా? అన్న అంశంపై ఈ సమావేశంలో లోతుగా చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తరగతి గదులను పునఃప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే... ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన బోధన ప్రణాళికలను రూపొందించి ప్రకటించాలని రాష్ట్ర విద్యా శాఖ భావిస్తోంది. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మరి కొంతకాలం పాటు ఆన్‌లైన్ క్లాసులను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 9వ తరగతి, ఆపై విద్యార్థులకు క్లాసులు ప్రారంభించిన తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితులను అంచనా వేయాలని, రాష్ట్రంలో పెద్దగా కరోనా పాజిటివ్ కేసులు పెరగకపోతే క్రమంగా మిగతా తరగతుల విద్యార్థులకు సైతం క్లాస్‌రూం బోధనను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది.

రెవెన్యూపై కలెక్టర్లకు దిశానిర్దేశం
రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 31న సమీక్ష నిర్వహించారు. రెవెన్యూకు సంబంధించి పరిష్కరించాల్సిన పలు అంశాలపై ఈ సమావేశంలో సీఎం జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగే సమావేశంలో ఈ అంశాలను మళ్లీ కూలంకషంగా చర్చించనున్నారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనళ్ల ఏర్పాటు, పార్ట్-బీలో పెట్టిన భూముల పరిష్కారం తదితర అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై చర్చించనున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించనున్నారు. ప్రాధాన్యతా క్రమంలో పౌరులకు టీకా వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందించనున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిని సమీక్షించి తదుపరి విడత కార్యక్రమాల తేదీలను ప్రకటించే అవకాశముంది. హరితహారం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు.
Published date : 11 Jan 2021 01:54PM

Photo Stories