Skip to main content

జగనన్న విద్యా దీవెన ఫిబ్రవరి 24న ప్రారంభం!

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ‘జగనన్న విద్యా దీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్)’పథకం ఈ నెల 24న ప్రారంభం కానుంది.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విజయనగరంలో ఈ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్ పేరుతో ఈ పథకం కొనసాగుతోంది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు విద్యార్థినీ విద్యార్థుల పూర్తి ఫీజును ప్రభుత్వం చెల్లిస్తుంది. పేద విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. వైఎస్సార్ నవశకం సర్వేలో కొత్తగా 69,216 మంది విద్యార్థులు ఈ పథకం పరిధిలోకి వచ్చారు. కొత్తగా పథకం పరిధిలోకి ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యార్థులూ రానున్నారు. రాష్ట్రంలో 11,48,918 మంది అర్హులైన విద్యార్థులకు ‘జగన్న విద్యా దీవెన’వర్తిస్తుంది. ఈ పథకానికి గతంలో రూ.రెండు లక్షలు కుటుంబ ఆదాయం ఉన్న వారు అర్హులు కాగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆదాయ పరిమితిని రూ. 2.50 లక్షలకు పెంచింది. దీంతో చాలా మంది విద్యార్థులు కొత్తగా పథకం పరిధిలోకి వచ్చారు. గతంలో పాలిటెక్నిక్, ఐటీఐ వారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇచ్చే వారు కాదు.

ఫిబ్రవరి 26 నుంచి కార్డుల అందజేత..
ఈ నెల 26 నుంచి ‘జగనన్న విద్యా దీవెన’పథకం గుర్తింపు కార్డులను విద్యార్థులకు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. కార్డులో విద్యార్థుల వివరాలు ఉంటాయి. దీన్ని గుర్తింపు కార్డుగానూ ఉపయోగించుకోవచ్చు. కార్డులు సాంఘిక సంక్షేమ శాఖ వద్ద సిద్ధంగా ఉన్నాయి.

విద్యార్థుల పూర్తి ఫీజుల బాధ్యత..
విద్యార్థుల ట్యూషన్ ఫీజు కాలేజీలు ఎంత మొత్తం తీసుకుంటే అంత మొత్తాన్నీ ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకు చెల్లిస్తుంది. గతంలో ఏడాదికి రూ.2,537 కోట్లు ప్రభుత్వం చెల్లించేది. పూర్తి స్థాయిలో ఫీజులు చెల్లిస్తే మరో రూ.763 కోట్లు అదనంగా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉంది. అందుకే బడ్జెట్‌లో జగనన్న విద్యా దీవెన పథకానికి రూ.3,300 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
Published date : 18 Feb 2020 03:20PM

Photo Stories