Skip to main content

ఇకపై జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఉపకార వేతనాలు రాలేదంటేవీరిదే బాధ్యత!

సాక్షి, అమరావతి : జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఉపకార వేతనాల పెండింగ్ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం ముగింపు పలికింది.

ఇప్పటివరకు ఏటా లక్ష మంది విద్యార్థులకు ఏదో ఒక కారణంతో ఇవి పెండింగ్‌లో ఉంటూ వచ్చాయి. ఇకపై ఇలా కుదరదని.. పెండింగ్‌లో ఉంటే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంక్షేమ శాఖాధికారులకు స్పష్టంచేశారు. దీంతో వారు హుటాహుటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ శాఖలు, కాపు ఇతర కార్పొరేషన్ల ద్వారా అందుతున్న స్కాలర్‌షిప్‌ల వివరాలు పరిశీలించి సమస్యను కొలిక్కి తెచ్చారు.

ఏటా లక్ష వరకు పెండింగ్..
నిజానికి.. ప్రతి సంవత్సరం లక్ష మంది విద్యార్థుల ఉపకార వేతనాలు ఏదో ఒక కారణంగా పెండింగ్‌లో ఉంటూ వచ్చాయి. మంజూరైనా విద్యార్థులకు అందేవి కావు. దీంతో కోర్సు పూర్తయినా ఉపకార వేతనాలు అందలేదనే ఆవేదనలో విద్యార్థులుండే వారు. అంతేకాక.. ఫీజు రీయింబర్స్‌మెంట్ రానందున డబ్బులు కట్టి సర్టిఫికెట్లు తీసుకువెళ్లాలని కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను వేధించేవి. ఈ పరిస్థితులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సమగ్రమైన చర్యలు తీసుకోవాలని.. ఇకపై పెండింగ్‌లో ఉండడానికి వీల్లేదని ఆదేశించింది. ఒకవేళ ఏదైనా డాక్యుమెంట్, ఇతర వివరాలు జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో నమోదు చేయకుంటే కాలేజీ యాజమాన్యం, విద్యార్థి మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుందని.. అదే అధికారుల వద్ద పెండింగ్‌లో ఉంటే అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని ప్రభుత్వం స్పష్టంచేసింది. సాంకేతిక సమస్యలతో పెండింగ్‌లో ఉంటే ఐటీ వారిదే బాధ్యత అని తెలిపింది. దీంతో సంబంధిత అధికారులు స్పందించి గత అక్టోబర్‌లో పెండింగ్‌లో ఉన్న వాటన్నింటినీ పరిష్కరించారు. ఫలితంగా ఉపకార వేతనాల కోసం ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ (పీఎంవో) వద్దకు నిత్యం వందలాది మంది వచ్చే విద్యార్థుల సంఖ్య అక్టోబర్ నుంచి ఒక్కసారిగా తగ్గిపోయింది. ఇకపై కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు.. రెన్యువల్స్ వివరాలు ఎప్పటికప్పుడు జ్ఞానభూమి వెబ్‌సైట్‌లో అధికారులు పొందుపర్చనున్నారు.

పెండింగ్ సమస్య ఇకపై ఉండదు
ఏటా ఏదో ఒక సమస్యతో వివిధ స్థాయిల్లో స్కాలర్‌షిప్‌లు పెండింగ్‌లో ఉంటున్నాయి. వీటన్నింటినీ గత ఏడాది అక్టోబర్‌లో పరిష్కరించాం. ఇకపై జ్ఞానభూమి వెబ్‌సైట్లో కూడా ఉపకార వేతనాలు పెండింగ్‌లో ఉండవు. ఎంతమంది విద్యార్థులకు ఎంత మొత్తం స్కాలర్‌షిప్‌లు ఇచ్చామనే వివరాలు పక్కాగా ఉంటాయి.
- శ్రీనివాసన్, జాయింట్ డెరైక్టర్, సాంఘిక సంక్షేమ శాఖ

Published date : 23 Jan 2021 04:41PM

Photo Stories