Skip to main content

‘గ్రామ, వార్డు సచివాలయ’’ పరీక్షల ఫలితాలు విడుదల

సాక్షి, అమరావతి: కరోనా కష్టకాలంలోనూ గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాల భర్తీకి రాత పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం నెల వ్యవధిలోనే ఫలితాలను కూడా ప్రకటించింది.

సెప్టెంబర్ 20 నుంచి 26 తేదీల మధ్య వారం రోజుల పాటు జరిగిన 14 రకాల రాత పరీక్షల ఫలితాలను ముఖ్యమంత్రివైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం విడుదల చేశారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆ శాఖ కమిషనర్ గిరిజాశంకర్, మున్సిపల్ శాఖ కమిషనర్ విజయకుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరీక్షలకు హాజరైన అభ్యర్థులందరికీ ఈసారి మార్కుల ఆధారంగా ర్యాంకులను ప్రకటించారు. ఆ ర్యాంకుల ఆధారంగా.. జిల్లాల వారీగా ఖాళీలను ఆయా జిల్లాల్లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులతో రిజర్వేషన్లు పాటిస్తూ మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. నోటిఫికేషన్ ఇచ్చే నాటికి రాష్ట్రంలో 16,208 పోస్టులు ఖాళీగా ఉండగా.. ఫలితాలు వెల్లడించే నాటికి ఆ సంఖ్య 18,048కి పెరిగింది. జిల్లాల్లో మెరిట్ లిస్ట్ నుంచి కేటగిరీ ఆధారంగా 18,048 పోస్టులనూ భర్తీ చేయనున్నారు. ఫలితాలను www.sakshieducation.com లో చూడవచ్చు.

వారంలో భర్తీ ప్రక్రియ షురూ

  • ర్యాంకుల ఆధారంగా జిల్లాల్లో మరో వారం రోజుల్లో కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా సెలక్షన్ కమిటీ (డీఎస్సీ) ఆధ్వర్యంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
  • జిల్లాల్లో ఖాళీల భర్తీకి కలెక్టర్లు మెరిట్ లిస్ట్ ప్రకారం అర్హులైన అభ్యర్థులను రూల్ ఆఫ్ రిజర్వేషన్, రోస్టర్ ప్రకారం ఎంపిక చేసి ప్రొవిజనల్ సెలక్షన్ లెటర్స్ పంపుతారు.
  • ఇన్‌సర్వీస్ అభ్యర్థులకు వారి సర్వీస్‌ను బట్టి గరిష్టంగా 15 మార్కులు కలిపి జాబితాలను రూపొందిస్తారు.
  • అనంతరం ప్రతి పోస్టుకూ క్వాలిఫైయింగ్ మార్కులను పోస్టుల లభ్యతను బట్టి కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా సెలక్షన్ కమిటీలు నిర్ణయిస్తాయి.
  • ఎంపికై న అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్ ప్రతులను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • తరువాత కలెక్టర్లు ప్రకటించే తేదీల్లో నిర్ణీత ప్రదేశాలకు వెళ్లి సర్టిఫికెట్లను తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుంది.


మహిళలే ఎక్కువ

  • గ్రామ సచివాలయాల్లో 14,062, వార్డు సచివాలయాల్లో 2,146 ఉద్యోగాల భర్తీకి జనవరి 10న పంచాయతీరాజ్, పురపాలక శాఖలు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేయగా.. 10,56,931 మంది దరఖాస్తు చేసుకున్నారు.
  • రాత పరీక్షలకు 7,68,965 మంది హాజరయ్యారు. వీరిలో 3,84,229 మంది పురుషులు కాగా, 3,84,736 మంది మహిళలు ఉన్నారు.
  • పరీక్షలు రాసిన వారిలో ఓసీలు 1,00,854 మంది, బీసీలు 3,88,043 మంది, ఎస్సీ కేటగిరీలో 2,24,876 మంది, ఎస్టీ కేటగిరీలో 55,192 మంది ఉన్నారు.


వెబ్‌సైట్‌లో ఫలితాల వివరాలు
పరీక్షలకు హాజరైన 7,68,965 మంది అభ్యర్థుల మెరిట్ జాబితాలు గ్రామ సచివాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయి. అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్ ఆధారంగా ఫలితాన్ని https://www.sakshieducation.com/Home.html లో తెలుసుకోవచ్చు.

రికార్డు స్థాయిలో ఉద్యోగాల భర్తీ
ప్రజా సంక్షేమం, అభివృద్ధితో పాటే నిరుద్యోగ యువతలో ఆశలు నింపుతూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఫలితాల వెల్లడి అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన వెంటనే 1.26 లక్షల సచివాలయ ఉద్యోగాల భర్తీకి అత్యంత పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి రికార్డు స్థాయిలో ఒకే రిక్రూట్‌మెంట్ ద్వారా లక్ష మందికి పైగా ఉద్యోగాలు కల్పించిన ఘనత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఇంత పెద్దఎత్తున పోస్టులు భర్తీ చేసిన దాఖలాలు గతంలో ఎప్పుడూ లేవన్నారు.

Published date : 28 Oct 2020 03:13PM

Photo Stories