Skip to main content

దేశంలోని అగ్ర విద్యాసంస్థల ద్వారా.. పేద విద్యార్థులకు ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులు

న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభించనున్న నూతన విద్యావిధానంలోని పలు అంశాలను కేంద్ర బడ్జెట్ 2020-21లో బాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు.
ఉన్నతవిద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రుణాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. పబ్లిక్‌ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో జాతీయ పోలీస్ యూనివర్సిటీ, జాతీయ ఫోరెన్సిక్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తారు. వాటిని జిల్లా మెడికల్ కాలేజీలతో అనసంధానిస్తారు. అలాగే పేదవిద్యార్థులకు ఆన్‌లైన్‌లో డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెస్తారు, ఇండియాలో చదివేందుకు ఆసక్తి చూపే ఆసియా-ఆఫ్రికా విద్యార్థులకు ఇండ్-సాట్ పేరిట ప్రత్యేక పరీక్ష నిర్వహించి, ప్రతిభావంతులకు ఉపకార వేతనం కూడా అందించనున్నారు.

ముఖ్యాంశాలు..
  1. ఉన్నత విద్య అందుబాటులో లేని బలహీన, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ఆన్‌లైన్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి రానున్నాయి. దేశంలో టాప్ 100 విద్యాసంస్థల ద్వారా ఈ ప్రోగ్రాం అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీతారామన్ ప్రకటించారు.
  2. 2020-21 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సందర్భంగా విద్యారంగంలో ప్రవేశపెట్టబోయే నూతన విధానాలపై ఆమె ప్రసంగిం చారు. త్వరలో నూతన విద్యా విధానం తీసుకురాబోతు న్నామని వెల్లడించారు. ఇందుకోసం రూ.99,300 కోట్లు విద్యారంగానికి నిధులు కేటాయించబోతున్నామని ఆమె పేర్కొన్నారు.
  3. ప్రత్యేకంగా మరో రూ.3000 కోట్లు నైపుణ్యాభివృద్ధికి వెచ్చిస్తారు. కేంద్ర ఆరోగ్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఎంట్రప్రెన్యూర్ షిప్ శాఖల సహకారంతో స్కిల్ ఇండియా మిషన్ కార్యక్రమం చేపడతారు. తద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్య వాతావరణం సృష్టించి పౌరుల నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుస్తారు.
  4. ఉన్నత విద్యాభ్యాసానికి భారత్ కేంద్రంగా మారాలన్న తలంపుతో ‘స్టడీ ఇన్ ఇండియా’ ను రూపొందించారు. ఇందులో భాగంగా ఐఎన్‌డీ- ఎస్‌ఏటీ పరీక్షను నిర్వహిస్తారు. ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రతిభ గలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తారు.
  5. కొత్త విద్యా విధానంపై అన్ని రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఇతర భాగస్వాములతో చర్చించామని తెలిపారు. దీనిపై రెండు లక్షలకుపైగా సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. త్వరలోనే నూతన విద్యా విధానాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు, మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు.
  6. విద్య అనంతరం ఉద్యోగ అవకాశాలు పెరగాలంటూ డిమాండ్లు పెరుగుతున్న దరిమిలా.. 2021 మార్చి నెలనాటికి 150 ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అప్రెంటిష్ షిప్‌తో కూడిన డిగ్రీ, డిప్లొమా కోర్సులను కూడా ప్రవేశపెట్టబోతున్నారని ప్రకటించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సంబంధిత స్థానిక సంస్థల్లో ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్‌కి వీలు కల్పించేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోందని తెలిపారు. ఆర్థికంగా వెనకబడి, బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందించేందుకు డిగ్రీ స్థాయిలో పూర్తిస్థాయి ఆన్‌లైన్ విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు.
  7. జాతీయ పోలీసు యూనివర్సిటీ, జాతీయ ఫోరెన్సిక్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నారు. పబ్లిక్‌ప్రైవేటు పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టే ఈ కార్యక్రమంలో ఈ యూనివర్శిటీలను భత జిల్లా మెడికల్ కాలేజీలతో అనసంధానిస్తామని, దీనివల్ల మెరుగైన వైద్యసేవలు లభిస్తాయి.
Published date : 03 Feb 2020 04:46PM

Photo Stories