చిటికెలో దేశాలు, రాజధానుల పేర్లు.. క్షణాల్లో మ్యాపులు..ఏకంగా 11 రికార్డులు
అంతే.. మట్టిలో మాణిక్యాలయ్యారు. ప్రపంచంలోని వివిధ దేశాల పేర్లను టకటకా చెప్పే స్థాయికి వచ్చారు. అంతేనా అంటే కాదు.. ప్రపంచదేశాల చిత్రపటాలు చిటికెలో గీసేస్తారు. రికార్డుల మోత మోగిస్తున్నారు. వీరంతా ఎవరంటే.. కర్నూలు జిల్లా ఆలూరులోని ఏపీ గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులు. 8, 9 తరగతులు చదువుతున్నారు. బళ్ళారికి 30 కి.మీ దూరంలో ఉండే ఈ స్కూలు చిన్నారులందరూ కూలి పనిచేసుకుని జీవించే పేద గిరిజనుల పిల్లలు. మట్టిలో మాణిక్యాలు ఉంటారనేందుకు వీరే ఉదాహరణ.
చినవీరభద్రుడు ప్రోత్సాహం
ఇలాంటి వీరిని రెండేళ్ల క్రితం అప్పటి గిరిజన సంక్షేమ శాఖ అడిషనల్ డెరైక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు గుర్తించారు. ఆ స్కూలు ప్రిన్సిపాల్ సాయికిశోర్‌ను పిలిపించారు. ఆ తర్వాత చినవీరభద్రుడు ఐఏఎస్ అయి సర్వశిక్ష అభియాన్ స్టేట్ ప్రాజెక్టు డెరైక్టర్‌గా, స్కూలు ఎడ్యుకేషన్ ఇన్‌చార్జ్ కమిషనర్‌గా ఉన్నారు. ఈ పిల్లల్ని సానబెట్టేందుకు ప్రిన్సిపాల్ చెప్పిన మెళకువలను ప్రోత్సహించాలని భావించిన చినవీరభద్రుడు.. ప్రభుత్వం నుంచి సుమారు రూ.7 లక్షలు మంజూరు చేయించి వీరికి శిక్షణ ఇప్పించారు. ఇంగ్లీష్‌లో ఒక క్రియను ఉపయోగించి ఒక వాక్యం ఇస్తే 415 మోడల్స్‌లో ప్రశ్న, సమాధానం రూపంలో అప్పటికప్పుడు వాక్యాలు రాసి రికార్డు సృష్టించారు. తెలుగు భాష కూడా రాని ఈ పిల్లలు గురుకులంలో చేరి తెలుగుతో పాటు ఇంగ్లీష్ భాషపై మంచి పట్టు సాధించారు. అంతేకాకుండా తర్ఫీదు ఇచ్చిన అంశాల్లో ఏకంగా 11 రికార్డులు సాధించి పాఠశాలకు జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చారు.
ఎవరెవరు వేటిల్లో రికార్డులంటే..
- విద్యార్థిని సుగాలి రోజాబాయి (9వ తరగతి) నేతృత్వంలోని గాయత్రి బాయి, మంజు, అనువైష్ణవిలు బ్లాక్‌బోర్డుపై ప్రపంచ పటంలోని 205 దేశాలను 1 నిమిషం 15 సెకన్లలో గీసి జాతీయ రికార్డు, ఆసియా బుక్ ఆఫ్ రికార్డును నెలకొల్పారు.
- పపంచంలోని అన్ని దేశాలను ఖండాల వారీగా 1 నిమిషం 20 సెకన్లలో చెప్పడం ద్వారా టి.అనువైష్ణవి ఆసియా బుక్, ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించింది.
- రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల రాజధానుల పేర్లను 14 సెకన్లలో చెప్పి
- బి.విజయలక్ష్మి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించింది.
- 16 సెకన్లలో 118 మూలకాలను చెప్పడం ద్వారా పాత రికార్డు 21 సెకన్లను బ్రేక్‌చేసి ఎం.యువరాణి ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించింది.
- 8వ తరగతికి చెందిన వైకే శ్రీదేవి 60 క్యూబ్స్‌ను ఒకే నిమిషంలో చెప్పి (పాత రికార్డు నిముషంలో 45 క్యూబ్స్) ఇండియా బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పింది. మరో
- విద్యార్థిని జి.సుజాత 78 స్క్వేర్స్‌ను ఒకే నిమిషంలో చెప్పి (పాత రికార్డు నిముషంలో 45 స్క్వేర్స్ మాత్రమే) ఇండియా బుక్ ఆఫ్ రికార్డు సాధించింది.
- నల్లబల్లపై ఒకే నిమిషంలో 44 క్యూబ్స్‌ను రాయడం (పాత రికార్డు 40) ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డును వైకే శ్రీదేవి సాధించింది.
- ఇక 57 స్క్వేర్స్‌ను ఒకే నిమిషంలో బోర్డుపై రాయడం ద్వారా (పాత రికార్డు 52 సెకన్లు) జి.సుజాత మరో ఇండియా బుక్ ఆఫ్ రికార్డు నెలకొల్పింది.
- ఆసియా బుక్ ఆఫ్ రికార్డుల ప్రతినిధి డాక్టర్ వసుధ, ఇండియా బుక్ ఆఫ్ రికార్డుల ప్రతినిధి జయసింహలు వీరి ప్రతిభను చూసి రికార్డులు ప్రకటించారు.
ప్రిన్సిపాల్ సాయికిశోర్ చొరవ
స్కూలు ప్రిన్సిపాల్ సాయికిశోర్ ఈ విద్యార్థులకు మార్గదర్శకులు. మంచి శిక్షణ ఇవ్వడం ద్వారా రికార్డులు సాధించేలా చేశారు.