బీసీ సంక్షేమ హాస్టళ్లలో ‘వికాసం’ కార్యక్రమం
Sakshi Education
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాల విద్యార్థుల పరిపూర్ణ వికాసం కోసం బీసీ సంక్షేమశాఖ ‘వికాసం’ అనే కార్యక్రమాన్ని రూపొందించింది.
వ్యక్తిత్వ, విద్యా, క్రీడా, జ్ఞాన, యోగా, ఆరోగ్య, సాంస్కృతిక, నైతిక వికాసాలకు సంబంధించిన కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సంపూర్ణ వికాసానికి అధికారులు కృషిచేస్తున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులచే ఆయా కార్యక్రమాలు చేయిస్తున్నారు. ఆయా రంగాల్లో నిష్ణాతులను పిలిపించి అప్పుడప్పుడు క్లాసులు చెప్పిస్తున్నారు. వ్యక్తిత్వ వికాసాన్ని పెంచుకోవడం ద్వారా రుగ్మతలను పారదోలేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులచే రోజూ యోగా చేయిస్తున్నారు. విద్యార్థుల్లోని సాంస్కృతిక కళను బయటకు తీసేందుకు వారానికి ఒక రోజు విద్యార్థులు వివిధ కళా రూపాలను ప్రదర్శిస్తున్నారు. నైతికతను పెంపొందించేందుకు నైతిక వికాసం తోడ్పడుతుందని అధికారులు చెబుతున్నారు. విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదిగేందుకు ఈ అష్ట వికాసాలు ఉపయోగపడతాయని బీసీ సంక్షేమశాఖ సంచాలకులు రామారావు చెప్పారు.
Published date : 10 Jan 2020 04:38PM