Skip to main content

బాల్యంలో మధుర జ్ఞాపకాలుంటే మంచి భవిష్యత్తుకు..

బాల్యం..చాలామందికి మధుర జ్ఞాపకం. వీలైనప్పుడల్లా చిన్ననాటి సంగతులను నెమరు వేసుకుంటూ సంతోషపడుతుంటారు.

కొందరికి మాత్రం అదొక చేదు జ్ఞాపకంగానే మిగిలిపోతుంది. గతం గుర్తు చేసుకోవడానికే వారసలు ఇష్టపడరు. అయితే బాల్యం ఎలా గడిచిందనే విషయంపై భవిష్యత్ ఆధారపడి ఉంటోందని, బాల్యం నాటి పరిస్థితులు భవిష్యత్‌ను ప్రభావితం చేస్తున్నాయని ఓ అధ్యయనం తేల్చింది. ప్రస్తుతం యుక్తవయసులో ఉన్న వారు ఆనందమయ బాల్యం గడిపిన పక్షంలో..వారు మద్యం. డ్రగ్‌‌స వంటి వాటికి దూరంగా ఉండడంతో పాటు వారిలో చదువుపై ఆసక్తి, ఇతరత్రా అం శాల్లో నేర్చుకోవాలనే అభిలాష ఎక్కువగా ఉంటున్నట్టు ‘అడిక్షన్ రీసెర్చ్ థియెరీ’జర్నల్‌లో ప్రచురితమైన పరిశోధన పత్రం పేర్కొంది. అలాగే ఆరోగ్యకరమైన బాల్యాన్ని గడిపిన వారు కూడా పెద్దయ్యాక చెడు వ్యసనాల వైపు తక్కువగా మొగ్గుచూపుతున్నట్టు ఇండియానా (అమెరికా)లోని పుర్‌డ్యూ యూనివర్సిటీ నిర్వహించిన ఈ అధ్యయనం లో స్పష్టమైంది. చిన్నతనం గూర్చిన అంత మంచి జ్ఞాపకాలు లేని వారు చదువుల్లో వెనుకబడడంతో పాటు ఎక్కువగా వ్యసనాల బారిన పడే ప్రమాదం ఉన్నట్టు తేలింది.

సానుకూల దృక్పథం పెంపొందించాలి
ప్రస్తుతం కోవిడ్ మహమ్మారి పరిస్థితులు, ఇతర పరిణామాల నేపథ్యంలో ఆన్‌లైన్ చదువుతో కుస్తీ పడుతూ, మానసిక ఆరోగ్యం దెబ్బతిన్న టీనేజీ విద్యార్థులు వ్యసనాల వైపు మొగ్గుచూపుతున్నట్టు ఈ పరిశోధనలో పేర్కొన్నారు. ఈ విషయంలో టీచర్లు చొరవ తీసుకుని పిల్లల్లో ఉత్సాహం కలిగించేలా పాఠాలు బోధించడంతో పాటు వారిలో సానుకూల దృక్పథం పెంపొందేలా సత్సంబంధాలను కొనసాగించాలని సూచించారు. భవిష్యత్, ప్రస్తుతం, గతం గురించి. సానుకూల, ఆశావాహ దృక్పథంతో ఉన్న యుక్తవయసు విద్యార్థులు చెడువ్యవసనాల బారిన చాలా తక్కువగా పడుతున్నట్టు, వీరితో పోల్చితే నిరాశాజనక ఆలోచనా ధోరణి, అసంతృప్తితో గతం, ప్రస్తుత, వర్తమానాల గురించి ఆలోచించే యువకులు పెడదోవ పటటడంతో పాటు చెడు అలవాట్లకు త్వరగా అలవాటు పడుతున్నట్టు అధ్యయనం స్పష్టం చేసింది. ఇది అమెరికాలో జరిపిన పరిశోధన అయినా మన దేశానికి కూడా ఇది వర్తిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు.

పిల్లల భవిష్యత్తులో తల్లిదండ్రులదే కీలకపాత్ర
చిన్నతనంలో ఎదురయ్యే ఇబ్బందులు, దుర్ఘటనలు, చేదు అనుభవాలు పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తాయి. పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లిదండ్రులదే కీలకపాత్ర. పిల్లలు చెడు స్నేహాలు, దుర్వ్యసనాల బారిన పడకుండా తల్లిదండ్రులు వారితో స్నేహభావంతో వ్యవహరిస్తే మంచి ఫలితాలుంటాయి. ఏదైనా సమస్య వచ్చినా మిత్రుల కంటే కూడా తల్లిదండ్రుల వద్దకు వెళితేనే అది పరిష్కారమౌతుందనే నమ్మకం వారికి కలగాలి.
- డా. నిషాంత్ వేమన, సైకియాట్రిస్ట్

Published date : 28 Jan 2021 03:44PM

Photo Stories