ఆంధ్రప్రదేశ్‌లోని యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నైపుణ్య శిక్షణ: మంత్రి గౌతమ్‌రెడ్డి
Sakshi Education
సాక్షి, అమరావతి: కరోనా ప్రభావం వల్ల యువత భవిష్యత్తుకు నష్టం వాటిల్లకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
యువతకు ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నైపుణ్య శిక్షణనిచ్చే విషయంపై దృష్టి పెట్టాల్సిందిగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రస్తుత పరిస్థితుల్లో వైద్య రంగ సేవలకు శిక్షణ ఇవ్వడం, విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే కోర్సులు, పాఠ్య ప్రణాళికల రూపకల్పనలో అంతర్జాతీయ స్థాయి భాగస్వామ్యం వంటి కీలక అంశాలపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై నైపుణ్యాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులకు మంత్రి ఏప్రిల్ 18న వీడియో కాన్ఫరెన్స్ లో మార్గ నిర్దేశం చేశారు. ఐటీఐ, డిప్లొమో, ఇంజనీరింగ్ తదితర కోర్సులు పూర్తి చేసిన వారిలో నైపుణ్యాలు మెరుగుపరచడం అంశాలపై దిశా నిర్దేశం చేశారు. వీడియో కాన్ఫరెన్స్ లో నైపుణ్యాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.అనంతరాము, చైర్మన్ చల్లా మధుసూదన్‌రెడ్డి, ఎండీ ఎ.శ్రీకాంత్‌లు పాల్గొన్నారు.
Published date : 20 Apr 2020 03:55PM